కేరళం ఫలితాలు అంతా ఊహించినట్లుగానే వచ్చాయి. ఎన్నికల ప్రకటన రాక ముందు నుంచే అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్.. ఎల్‌డీఎఫ్ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. తాజా ఫలితాలు కూడా అందరి అంచనాలకు అనుగుణంగానే వచ్చాయి. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్ ప్రతిపక్షానికే పరిమితం అయ్యింది. అందరూ ఊహించినట్లుగానే కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్.. యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది. కేరళంలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల జరిగాయి. ఇక్కడ 71 స్థానాలు మ్యాజిక్ ఫిగర్‌గా ఉంది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన అధికార ఎల్‌డీఎఫ్ మ్యాజిక్ ఫిగర్‌కు ఆమడ దూరంలో నిలిచింది. అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న యూడీఎఫ్ భారీ మెజారిటీ సాధించింది. వరుసగా రెండోసారి కూడా కేరళంలో బీజేపీ అగ్రనేతలకు నిరాశే ఎదురైంది.
Also Read : కేరళ సీఎం అయ్యేది ఎవరు..? శశి థరూర్ కష్టమేనా..?
కేరళం ప్రజలు తొలి నుంచి విలక్షణ తీర్పు ఇస్తున్నారు. కేరళంలోని 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ప్రధానంగా రెండు ప్రధాన కూటముల మధ్య పోటీ నెలకొంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్.. ఎల్‌డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్.. యూడీఎఫ్. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్ నేతలు వరుసగా మూడోసారి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే చారిత్రక నేపథ్యం పరిశీలిస్తే మాత్రం.. కేరళలో అధికారం సాధారణంగా ఈ రెండు కూటముల మధ్య మారుతూ వస్తోంది. సాధారణంగా కేరళం ఓటర్లు ప్రతి ఐదేళ్లకు ఓసారి ప్రభుత్వ మార్పు కోరుకుంటారు. కానీ గత 2021లో జరిగిన ఎన్నికల్లో పినరయ్ విజయన్ ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. వరుసగా రెండోసారి కూడా ఆయనే సీఎం అయ్యారు.
కానీ ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో మాత్రం ప్రజలు మార్పు కోరున్నారనే విషయం తేలిపోయింది. అయితే ఇక్కడ అంతా గమనించాల్సి విషయం ఏమిటంటే.. కేరళంలో కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్దగా బలం లేదు. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పేసి కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు మద్దతిస్తున్నారు. శశిథరూర్ వంటి సీనియర్ నేతలు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పక్కనే కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ.. కన్నడ కాంగ్రెస్ నేతలు కూడా కేరళం వైపు కన్నెత్తి చూడలేదు. అయినా కూడా కేరళంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ వైపే ప్రజలు మొగ్గు చూపారు. ఇందుకు ప్రధానంగా కమ్యూనిస్టు పాలనపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడమే ప్రధాన కారణం.
అయితే కేరళంలో గెలుపు కోసం బీజేపీ అగ్రనేతలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ ఫలించలేదు. ప్రధానంగా బీఫ్ మాంసంపై ఆరోపణలు, మైనారిటీలను టార్గెట్ చేయడం, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, కమ్యూనిస్టు పాలనలో హిందువులపై దాడులంటూ ప్రచారం, శబరిమల ఆలయంపై పదే పదే కేసులు.. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఎన్నో ప్రయత్నాలు చేశారు బీజేపీ నేతలు. కానీ అవేవీ పెద్దగా ఫలితం చూపించలేదు. కేరళ అనే పేరును సరిగ్గా ఎన్నికల ముందు కేరళం అని మారుస్తూ మోదీ సర్కార్ గెజిట్ విడుదల చేసింది. అయినా సరే.. మళయాళీలు మాత్రం.. కమలం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కేరళంలో పాగా వేయాలని కలలు కన్న బీజేపీకి మరోసారి నిరాశ ఎదురైంది.
Also Read : తమిళనాట ఎన్నికల ఫలితాలు.. తిరుమలలో త్రిష..!
రెండు సార్లు ఎల్‌డీఎఫ్‌కు అవకాశం ఇచ్చిన కేరళం ఓటర్లు.. ఈసారి తమ పాత సంప్రదాయానికే మొగ్గు చూపారు. పాలన మార్పు కోరుకుంటూ యూడీఎఫ్ కూటమికి జై కొట్టారు. యూడీఎఫ్ కూటమి విజయం సాధించడంతో కొత్త సీఎం ఎవరనే చర్చ కేరళం రాజకీయాల్లో మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు వీడీ సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారు. మరి ఢిల్లీ పెద్దలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి మరి.

