కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ముంగిట ఆ రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కి స్పష్టమైన ఆధిక్యం లభిస్తుందని చెప్పడంతో.. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశి థరూర్ పేరు వినిపిస్తున్న తరుణంలో, ఆయన స్వయంగా స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కేరళలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా శశి థరూర్ ను అక్కడి ప్రజలు ముఖ్యమంత్రిగా చూడాలని బలంగా కోరుకున్నారనే మాట వినపడుతోంది.
Also Read : తమిళనాట ఎన్నికల ఫలితాలు.. తిరుమలలో త్రిష..!
అయితే, ఈ వార్తలపై థరూర్ స్వయంగా స్పష్టత ఇచ్చారు. తాను ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిని కాదని ఆయన తేల్చి చెప్పారు. తాను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదని, కాబట్టి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని స్పష్టం చేశారు. సాధారణంగా ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల నుండే ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం సరైన ప్రజాస్వామ్య పద్ధతి అని, పార్టీ అధిష్టానం, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కలిసి ఈ నిర్ణయం తీసుకుంటారని ఆయన వెల్లడించారు మరోవైపు ముఖ్యమంత్రి రేసులో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు బలంగా వినిపిస్తోంది.
అయితే, ఆయన కర్ణాటకకు చెందిన నేత అని చాలా మంది పొరపడుతుంటారు. దీనికి కారణం ఆయన గతంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గా పనిచేయడమే. కానీ వాస్తవానికి ఆయన అచ్చమైన కేరళీయుడు. కేరళలోని కన్నూర్ జిల్లా పయ్యనూరులో జన్మించిన వేణుగోపాల్, తన రాజకీయ ప్రస్థానాన్ని అక్కడే మొదలుపెట్టారు. కేరళ అసెంబ్లీకి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడమే కాకుండా, అలప్పుజ నుండి ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. ఈయనకు కూడా సిఎంగా పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి.
Also Read : జర్నలిజం ముసుగులో భజన.. మీరు మారరా..!
కేరళలో ఈసారి హంగ్ వచ్చే అవకాశం లేదని, యూడీఎఫ్ కి పూర్తి మెజారిటీ వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శశి థరూర్ తనంతట తానుగా రేసు నుండి తప్పుకోవడంతో, కేసీ వేణుగోపాల్ వైపు అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు కావడం ఆయనకు కలిసి వచ్చే ప్రధాన అంశం. అయితే, స్థానికంగా బలంగా ఉన్న వి.డి. సతీశన్, రమేష్ చెన్నితల వంటి నేతలు కూడా ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మరి కేరళ రాజకీయం ఫలితాల తర్వాత ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

