రాజకీయాల్లో ఇప్పుడు విపరీత ధోరణి కనిపిస్తోంది. వాస్తవానికి రాజకీయాల్లో ఉన్న నేతలు పార్టీలతో సంబంధం లేకుండా బహిరంగంగానే మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భాలున్నాయి. వేరు వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ.. కేవలం వ్యవస్థాగతమైన, పాలనాపరమైన అంశాలపై మాత్రమే విమర్శలు చేసుకునే వారు తప్ప.. వ్యక్తిగత విమర్శల జోలికి పోయేవారు కాదు. అందుకే ఇప్పటికీ నాటి తరం నేతలకు అటు ప్రజల్లో ఇటు రాజకీయాల్లో మంచి పేరు ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితులు మాత్రం పూర్తి విరుద్ధంగా.. ఇంకా చెప్పాలంటే చాలా దారుణంగా తయారయ్యాయి. రాజకీయ విమర్శలు కాస్త పూర్తి వ్యక్తిగతంగా మారిపోయాయి. వ్యక్తిత్వ హననం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అధినేత దృష్టిలో పడాలంటే.. ప్రత్యర్థి పార్టీల నేతలను బూతులు తిట్టాలనే సంస్కృతి కనిపిస్తోంది. ఇది చాలా దారుణ పరిస్థితులు.
Also Read : ఏపీ పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన..!
అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే.. పాలక, ప్రతిపక్ష నేతలు కలవటం సర్వ సాధారణం. అధికారికంగా అయితే అసెంబ్లీ బీఏసీ సమావేశంలో కలుస్తారు. అక్కడ కాసేపు జోకులు కూడా వేసుకుంటారు. ఇక ముఖ్య నేతలు, అధికారుల కుటుంబాల్లో జరిగే వివాహ కార్యక్రమాల్లో కూడా కలిసి సరదాగా ముచ్చటించుకునే వారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నోసార్లు ముఖాముఖి కలుసుకున్నారు. మంత్రులుగా కలిసి పని చేసిన తొలి రోజులను గుర్తు చేసుకునే వారు. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కలవటం అనే విషయం పక్కన పెడితే.. కనీసం పలకరింపు కూడా కరువైంది.
అసెంబ్లీ బీఏసీ సమావేశాలకు ప్రతిపక్ష నేతలు రావటం లేదు. వారి ప్రతినిధులు వస్తున్నారు. ఇక తాజాగా కిందిస్థాయి కార్యకర్తల విషయంలో ఒకలా.. నియోజకవర్గ స్థాయి నేతల విషయంలో మరోలా వ్యవహరిస్తోంది వైసీపీ. ఓ వారం రోజుల క్రితం ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైసీపీ మహిళా నేతలు మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. వారి కుటుంబంలో జరగనున్న శుభకార్యానికి బాలినేనిని ఆహ్వానించారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అలా కలిసినందుకు వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుల పేరుతో లేఖ విడుదల చేశారు. అయితే సరిగ్గా నాలుగు రోజులకు మార్కాపురంలో జరిగిన ఓ వివాహ వేడుకకు బాలినేని హాజరయ్యారు. ఆ సమయంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి కూడా అక్కడికి వచ్చి బాలినేనితో సరదాగా గడిపారు. ఇద్దరు పక్కనే పక్కనే కూర్చుని భోజనం చేశారు. కానీ జంకె పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ వ్యవహరాన్ని సదరు మహిళా నేతలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీలో పురుషులకు ఒక న్యాయం, మహిళలకు ఒక న్యాయమా అని నిలదీస్తున్నారు.
Also Read : ఏపీ సచివాలయంలో వైసీపీ ధురంధర్‌లు..!
ఇదే తీరు అటు తెలంగాణలో కూడా కనిపిస్తోంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. దీనిని బీఆర్ఎస్ తీవ్రంగా పరిగణిస్తోంది. అలా ఎందుకు కలవాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే మల్లారెడ్డి మాత్రం.. తాను పార్టీ మారటం లేదని.. తన కాలేజీలో కొత్తగా ఏఐ విభాగం ప్రారంభిస్తున్నామని.. దాని ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించేందుకు మాత్రమే మోదీని కలిసినట్లు చెప్పారు. అసలు కలవటమే తప్పా.. అని మల్లారెడ్డి నిలదీస్తున్నారు. మరో పార్టీ నేతలను కలవటమే నేరమా అనే చర్చ ఇప్పుడు జోరుగా జరుగుతోంది.

