తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌కు గడువు సమీపిస్తున్న వేళ, దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పార్టీకి అనుకూలంగా ఉండటంతో, చెన్నైలో నేడు అత్యంత కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేసిన మొత్తం 234 మంది అభ్యర్థులతో విజయ్ నేడు సమావేశం కానున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో టీవీకే పార్టీకి గణనీయమైన స్థానాలు వస్తాయని అంచనా వేయడం, కొన్ని చోట్ల మెజారిటీ మార్కును తాకే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : అమీర్ ను ఫిదా చేసేసిన సాయి పల్లవి..!
యాక్సిస్ మై ఇండియా వంటి సంస్థల అంచనాలపై అభ్యర్థుల నుంచి క్షేత్రస్థాయి అభిప్రాయాలను విజయ్ అడిగి తెలుసుకోనున్నారు. మే 4న జరగనున్న ఓట్ల లెక్కింపు రోజున అభ్యర్థులు మరియు కౌంటింగ్ ఏజెంట్లు ఎలా వ్యవహరించాలి అనే దానిపై విజయ్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండటానికి, ఫలితాల ప్రకటన వరకు అప్రమత్తంగా ఉండాలని ఆయన కేడర్‌ను హెచ్చరించనున్నారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్‌ల తనిఖీపై అభ్యర్థులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
Also Read : ఏపీ సచివాలయంలో వైసీపీ ధురంధర్‌లు..!
ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చరమగీతం పాడాలని లక్ష్యంగా పెట్టుకున్న విజయ్, ఎన్నికల అనంతర పరిణామాలపై కూడా తన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఒకవేళ హంగ్ ఏర్పడితే, ప్రభుత్వం ఏర్పాటులో టీవీకే పార్టీ పాత్ర ఎలా ఉండాలి..? ఏ పార్టీతో పొత్తు లేదా మద్దతుపై చర్చించాలి..? అనే అంశాలపై అభ్యర్థులతో ప్రాథమికంగా చర్చించే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త శక్తిగా ఎదగాలని కోరుకుంటున్న దళపతి విజయ్, ఈ సమావేశం ద్వారా తన పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపనున్నారు.

