కూటమి సర్కార్‌పై వైసీపీ నేతలు నిరంతరం విమర్శలు చేస్తూనే ఉన్నారు. నిజం చెప్పాలంటే.. కూటమి సర్కార్ పై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ప్రజలు పెద్దగా పట్టించుకోవటం లేదు కూడా. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు ఏం జరిగిందో అందరికీ తెలుసు. అందుకే ప్రతి విషయంపై వైసీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నప్పటికీ.. ప్రజలు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. కూటమి సర్కార్ చేసే ప్రతి ప్రారంభోత్సవం మా వల్లే అని వైసీపీ నేతలు క్రెడిట్ చోరీ చేస్తుంటే.. వెంటనే వాస్తవాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అయితే వైసీపీ నేతల మాటలు పట్టించుకోనప్పటికీ.. కొందరు సొంత నేతలు చేస్తున్న ఆరోపణలు మాత్రం కూటమి సర్కార్‌ను ఇబ్బంది పెడుతున్నాయి.
Also Read : మహానాడుపై టీడీపీ సంచలన నిర్ణయం..!
కాపు కులానికి చెందిన మాజీ జనసేన నాయకులతోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఘోరంగా తిట్టిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం తెర వెనుక నుంచి నడిపిస్తోంది మాత్రం వైసీపీ నేతలు. ప్యాకేజీలకు ఆశ పడుతున్నారో.. రాజకీయ భవిష్యత్తును ఆశిస్తున్నారో.. ఇంకేమి ఆశిస్తున్నారో.. అనే విషయం బయట పడకపోయినా పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ, మాజీ జనసేన నాయకులే విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. అయినా సరే జనసేన అధికార ప్రతినిధుల్లో చాలామందితో పాటు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మౌనం వహిస్తుండటం ఏమిటి..? ముఖ్యంగా కాపు కులానికి చెందిన పదిమంది మాజీ జనసేన నాయకులే బరి తెగిస్తూ.. నోటికొచ్చినట్లు తిడుతున్నారు. ఒక మహిళా లాయరు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారో.. ఆమె నోటికి తాళం వేయటంలో జనసేన ఎమ్మెల్యేలు, నాయకులు ఘోరంగా విఫలమయ్యారు. అందులో కొంతమందికి పవన్ కళ్యాణ్‌ను తిట్టటం ఆనందం ఏమో.. వైసీపీ నేతలతో కొందరు జనసేన నేతలు తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారేమో.. అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.
చంద్రబాబుకు కమ్మ కులం మేధావులు తలనొప్పి కలిగించనున్నారా..? ఇటీవల కాలంలో కొందరు కమ్మ కులం మేధావులే సీఎం చంద్రబాబు తీరును తప్పు పడుతూ, ఆధారాలతో అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. జూన్ నెలలో కూడా మరికొందరు కమ్మ కులం మేధావులు కూడా వీరితో జత కట్టేందుకు రెడీగా ఉన్నారనేది విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా మాజీ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సీఎం చంద్రబాబు పైన చేస్తున్న విమర్శలు, ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. సోషల్ మీడియాతో పాటు.. తనకు అనుకూలమైన కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్‌తో రోజూ మాట్లాడుతూనే ఉన్నారు. ఏబీవీ చేసిన విమర్శలను, ఆరోపణలను వైసీపీ నేతలే చేయలేక పోతున్నారంటే.. వెనుక మతలబు ఏమిటనేది ఇప్పుడు ప్రశ్న. సుమారు పది మంది కమ్మ కులం మేధావులే చంద్రబాబు పై ఆధారాలతో ధ్వజం ఎత్తిపోతున్నారు. జూన్ నాటికి చంద్రబాబు సీఎం అయ్యి రెండేళ్లు పూర్తి అవుతోంది. అప్పటి లోగా కూటమి ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలకు సంబంధించిన ప్రభుత్వ జీవోలను సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : చిలుకూరు బాలాజీ టెంపుల్ పై అమెరికా ఏడుపులు..!
చంద్రబాబు, లోకేష్ తీరుతో కమ్మ కులానికి అన్యాయం జరుగుతోందని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నిజాయితీ పరుడైన కమ్మ కులానికి చెందిన ఐఏఎస్ అధికారి కాటమనేని భాస్కర్‌ను అవినీతికీ సహకరించ లేదనే ఒకే ఒక్క కారణంతో సీఆర్‌డీఏ కమీషనర్ పోస్టునుండి అకారణంగా తప్పించటం, మెజారిటీ అమరావతి రైతులకు, కమ్మ కులం వారికి ఏ మాత్రం మింగుడుపడలేదు. అదే విధంగా కమ్మ కులానికి చెందిన సీనియర్ అయిన సాయిప్రసాద్‌ను సీఎస్ పోస్టులో నియమించకుండా, ఆయన కన్నా జూనియర్ అయిన అధికారిని సీఎస్ పోస్టులో నియమించటం, అదేమిటంటే ఆయన బీసీ అని చంద్రబాబు సమర్ధించుకోవటం కూడా కమ్మ కులం వారికి ఆగ్రహం కలిగించింది.
వైసీపీ నేతల నోటికి తాళం వేస్తున్న కూటమి నేతలు.. సొంత కులానికే చెందిన మాజీ అభిమానులను మాత్రం పట్టించుకుంటున్నట్లు లేదు. ఓ వైపు జనసేన మాజీలు బొలిశెట్టి సత్యనారాయణ, మహిళా లాయరు రజనీతో పాటు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన ఏబీ వెంకటేశ్వర్రావు వంటి మేధావులు ఇప్పుడు కూటమి సర్కార్‌పై పదే పదే విమర్శశలు చేస్తున్నారు. అయినా సరే.. అటు ప్రభుత్వం తరఫు నుంచి కానీ.. ఇటు టీడీపీ, జనసేన పార్టీల వైపు నుంచి ఎలాంటి ఖండన రావటం లేదు. దీంతో ప్రజలు కూడా ఆ మేధావుల మాటలను ఆసక్తిగా గమనిస్తున్నారు.

