తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం తీసుకున్న ఒక వివాదాస్పద నిర్ణయం టీడీపీ సోషల్ మీడియాలో వచ్చిన తీవ్ర వ్యతిరేకతతో గంటల వ్యవధిలోనే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. తిరుమల నార్త్ సబ్ డివిజన్ ఇన్‌ఛార్జ్ అసిస్టెంట్ ఇంజనీర్ బాధ్యతల నుంచి పీఎంవీ సుబ్రహ్మణ్యాన్ని తక్షణమే తప్పిస్తూ టీటీడీ చీఫ్ ఇంజనీర్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. నెటిజన్లు, కూటమి శ్రేణుల నుండి వ్యక్తమైన నిరసనల దెబ్బకు అధికారులు తమ తప్పును సరిదిద్దుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
Also Read : బ్యాక్ పాకెట్ లో వాలెట్ పెడుతున్నారా?
గతంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో, ఈ సుబ్రహ్మణ్యం స్వీట్లు పంచిపెట్టి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వ్యతిరేక నేపథ్యం ఉన్న వ్యక్తికి తిరుమలలో అత్యంత కీలకమైన నార్త్ సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పెద్ద ఎత్తున దుమారం రేపారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇలాంటి వారికి కీలక పోస్టింగులు ఎలా ఇస్తారంటూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
Also Read : విజిలెన్స్ కమీషనర్‌గా అవినీతి ఆరోపణలున్న అధికారి..!
ఈ వ్యవహారం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అప్రమత్తమైన టీటీడీ ఉన్నతాధికారులు నష్టనివారణ చర్యలు చేపట్టారు. గతంలో సుబ్రహ్మణ్యానికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి, ఆయనను పాత స్థానానికే పరిమితం చేశారు. అదే సమయంలో తిరుమల నార్త్ సబ్ డివిజన్ ఏఈ పూర్తి అదనపు బాధ్యతలను వేణుగోపాల్ అనే మరో అధికారికి అప్పగిస్తూ కొత్త ఆదేశాలు జారీ చేశారు. గతంలో సైతం పలువురు అధికారుల బదిలీలను టీడీపీ సోషల్ మీడియా విమర్శలతో రద్దు చేసిన సంగతి తెలిసిందే.

