జలయజ్ఞంలో ధనయజ్ఞం కమిషన్‌ల భాగస్వామి ఆరోపణలు ఉన్న రిటైర్డు ఐఏఎస్‌ను విజిలెన్స్ కమీషనర్ పోస్టులో నియమించనున్నారా..? వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన జలయజ్ఞం పర్యవేక్షించటమే కాకుండా.. అప్పటి కమిషన్‌ల భాగస్వామిగా విమర్శలు వచ్చిన ఐఏఎస్ అధికారి ఎప్పుడో రిటైర్డు అయ్యారు. అయితే ఆయన సీఎం చంద్రబాబును ఎలా పట్టుకున్నారో తెలియదు కానీ.. హైదరాబాద్ నుండి అమరావతికి వచ్చారు. రెండు కులం కమిషన్‌లకు ఏదో పోస్టులో నియమితులయ్యారు. అనేక అవినీతి ఆరోపణలు ఉన్న వైఎస్ఆర్ అభిమాన ఐఏఎస్ అధికారిని.. త్వరలో విజిలెన్స్ కమీషనర్‌గా సీఎం చంద్రబాబు నియమించనున్నారనే వార్త.. ఇప్పుడు సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : లొంగే ప్రసక్తే లేదు.. ఇరాన్ ప్రెసిడెంట్ సంచలన ప్రకటన..!
అవినీతి పరుల పై విచారణ జరిపే అధికారిగా.. అవినీతి ఆరోపణలు ఉన్న రిటైర్డు ఐఏఎస్ అధికారినే విజిలెన్స్ కమీషనర్‌గా నియమిస్తున్నారనే ప్రచారం సచివాలయంలో పెద్ద దుమారం రేపుతోంది. నిజాయితి గురించి పదే పదే చెప్తున్న సీఎం చంద్రబాబు.. ఇప్పుడు అవినీతి ఆరోపణలున్న.. వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులనే ప్రాధాన్యత పోస్టుల్లో నియమిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా విజిలెన్స్ కమీషనర్ పోస్టు విషయంలో రిటైర్డు ఐఏఎస్ అధికారులతో పాటు ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. అసలు విషయం ఏమిటంటే.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాను విజిలెన్స్ కమీషనర్‌గా నియమిస్తున్నారనే ప్రచారం ఇప్పుడు దుమారం రేపుతోంది.
ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖలో కార్యదర్శిగా పనిచేసిన రాజీవ్ రంజన్ మిశ్రా హయాంలోనే జలయజ్ఞం ప్రారంభం అయ్యింది. ప్రతి కాంట్రాక్టర్ దగ్గర మొబిలైజేషన్ అడ్వాన్స్ రూపంలో 8 శాతం కమిషన్ ముందుగా తీసుకునేవారని.. అప్పట్లోనే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. లంచం ఇవ్వకపోతే కాంట్రాక్టర్ బిల్లులను ఆర్ధిక శాఖకు అప్పటి ఇరిగేషన్ ఐఏఎస్ అధికారులు పంపే వారు కాదని.. అప్పుడే మీడియా కూడా దుమ్మెత్తి పోసింది. ఇదే విషయాన్ని అప్పట్లో కాంట్రాక్టర్‌లు సీఎం రాజశేఖర్ రెడ్డితో పాటు ఆయన ఆత్మ అయిన కేవీపీ రామచంద్రరావుకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఇద్దరు మాత్రం.. ఏదో ఒకటి ఇచ్చి వారితో పని చేయించుకోండి అని ఉచిత సలహా ఇచ్చారని కొంత మంది కాంట్రాక్టర్‌లు ఇప్పటికీ చెబుతున్నారు.
అప్పట్లో లంచాలు అడిగిన ఐఏఎస్ అధికారులలో రాజీవ్ రంజన్ మిశ్రా కూడా ఉన్నారనేది ప్రధాన ఆరోపణ. ఆయన సతీమణి కూడా ఐఏఎస్ అధికారిణి. అప్పట్లో ఆర్ధిక శాఖలో పనిచేశారు. బిల్లుల చెల్లింపు విషయంలో భార్యాభర్తలు పరస్పరం సహకరించుకునే వారట. భర్తకు అన్ని విధాలుగా భార్య సహకరించారని ఇప్పటికీ చెబుతున్నారు. అప్పటి జలయజ్ఞంలో వేల కోట్ల అవినీతి జరిగిందని, ప్రాజెక్టుల నిర్మాణాల ఖర్చు ముందుగా నిర్ణయించుకున్న దాని కంటే రెట్టింపు పెంచారని.. అందుకు అప్పటి ఇరిగేషన్ ఐఏఎస్ అధికారులు కూడా కారణమని.. నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శలు, ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జలయజ్ఞంపై విచారణ జరిపిస్తామని కూడా అన్నారు.
Also Read : బ్యాక్ పాకెట్ లో వాలెట్ పెడుతున్నారా?
అప్పటి ముగ్గురు ఇరిగేషన్ ఐఏఎస్ అధికారులలో రాజీవ్ రంజన్ మిశ్రా కూడా ఒక్కరు. కడుపు నిండిన తర్వాత ఆయన కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు వెళ్లి అక్కడే రిటైర్డు అయ్యారు. అప్పట్లో అమెరికాలో ఆయన భారీగా ఆస్తులు కొనుగోలు చేశారని మీడియా కూడా ఆధారాలతో కధనాలు ప్రచురించింది. అప్పుడు మాయమైన రాజీవ్ రంజన్ మిశ్రా.. రాష్ట్ర విభజన తర్వాత కనిపించలేదు. 2024లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత మళ్లీ ఏపీలో అడుగుపెట్టారు. ఒకప్పుడు ఎవరిపైన అవినీతి ఆరోపణలు చేశారో.. ఆ ఐఏఎస్ అధికారినే రెండు కమిషన్‌లలో నియమించారు చంద్రబాబు. త్వరలో విజిలెన్స్ కమీషనర్‌గా కూడా నియమిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కొసమెరుపు ఏమిటంటే.. చంద్రబాబు రెండవ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. విజిలెన్స్ కమీషనర్‌గా రిటైర్డు చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన, అనేక అవినీతి ఆరోపణలున్న అనిల్ చంద్ర ఫునేఠాను కూడా చంద్రబాబు నియమించారు. జలయజ్ఞం ధనయజ్ఞం అని.. ఇందుకు సహకరించారనే విమర్శలు ఎదుర్కొన్న రాజీవ్ రంజన్ మిశ్రానే విజిలెన్స్ కమీషనర్‌గా వస్తున్నారనే వార్త.. సచివాలయంలో పెద్ద దుమారం రేపుతోంది.

