ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అదే సమయంలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కూడా భారీగానే ఖర్చు చేస్తోంది. విద్యార్థుల కోసం ఇప్పటికే అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నారు. అలాగే విద్యార్థుల కోసం పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగులు అందిస్తోంది. ఇక విద్యార్థుల కోసం ఇప్పటికే అన్ని పాఠశాలల్లో సరికొత్త బెంచ్‌లు, డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక శిధిలావస్థలో ఉన్న పాఠశాలలకు సరికొత్త హంగులతో రూపుదిద్దుతోంది ప్రభుత్వం. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read : ప్రత్యక్ష ఎన్నిక.. చంద్రబాబు వ్యూహం అదే..!
వైసీపీ పాలనలో నాడు – నేడు పేరుతో పాఠశాలలు, మోడల్ స్కూల్స్ రూపురేఖలు మార్చేందుకు భారీగా నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా పాఠశాలల్లో విద్యార్థులకు మంచినీరు అందించేందుకు శుద్ధజల యంత్రాలు.. ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. వీటి కోసం లక్షలు ఖర్చు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల్లో రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేశారు. పట్టణ ప్రాంతాల్లోని జిల్లా పరిషత్ పాఠశాలల్లో అయితే రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. వీటి ద్వారా పాఠశాలలోని విద్యార్థులందరికీ మినరల్ వాటర్ అందించేలా ఏర్పాట్లు చేశారు. లక్ష్యం మంచిదే.. కానీ అమలులో మాత్రం ఎన్నో విమర్శలు.
లక్షలు ఖర్చు చేసిన ఏర్పాటు చేసిన ఈ ఆర్వో ప్లాంట్లు ఇప్పుడు నిర్లక్ష్యానికి గురయ్యాయి. 2021-22 మధ్య కాలంలో వీటిని ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతను కూడా ఐదేళ్ల పాటు సంస్థలకే అప్పగించారు. అయితే నాసిరకం ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో.. వాటికి సకాలంలో నిర్వహణ లేకపోవడం వల్ల చాలా చోట్ల మూలన పడ్డాయి. వీటి మరమ్మతు కోసం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఇప్పటికే ఉన్నతాధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశారు. అయినా కూడా ఎలాంటి స్పందన లేదు. ఇందుకు ప్రధాన కారణం.. సరైన సాంకేతిక నిపుణులు అందుబాటులో లేకపోవడమే అంటున్నారు. దీంతో హెడ్ మాష్టర్లే బయట నుంచి నీటిని తెప్పించి పిల్లలకు తాగునీటిని సమకూరుస్తున్నారు.
Also Read : హెచ్1ఎన్1 వస్తే హార్ట్ ఎటాక్ వస్తుందా..?
చాలా పాఠశాలల్లో బోరు లేకపోవడం, వాటిని పైపు లైన్లతో అనుసంధానించక పోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కొన్ని పాఠశాలల్లో అయితే ప్లాంట్ సామర్థానికి సరిపడ విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో ఉన్న విద్యుత్ మీటరు ద్వారా ఇచ్చిన కనెక్షన్ సామర్థ్యం సరిపోవడం లేదు. కొన్నిచోట్ల దాతల సాయంతోనే హెడ్ మాస్టర్లు నీటి సరఫరా చేపడుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ఏకంగా 880 ప్లాంట్లను నాటి ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. వాటిల్లో ఇప్పుడు సగానికి పైగా అలంకారప్రాయంగానే మారిపోయాయి. కొన్నిటికి మాత్రం హెడ్ మాస్టర్లు సొంత డబ్బులతో, దాతల సాయంతో ప్రైవేటు మెకానిక్‌ల ద్వారా చిన్న చిన్న రిపేర్లు చేయించారు.
ఉమ్మడి ప్రకాశం, కృష్ణా, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంది. అందుకే విద్యార్థుల కోసం శుద్ధమైన తాగునీటి సరఫరా కోసమే ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అయితే వీటిల్లో చాలా వరకు నాసిరకం కావడంతో త్వరగానే పాడయ్యాయి. వీటి నిర్వహణ గురించి గత ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. దీంతో అవి వృథాగా మారాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత హెడ్ మాస్టర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అయినా సరే.. ఇప్పటికీ సరైన చర్యలను అధికారులు చేపట్టకపోవడంతో అవి నిరుపయోగంగానే ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు ఆర్వో ప్లాంట్లకు మరమ్మతు చేయించాలని కోరుతున్నారు.

