విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొంత కాలంగా స్టీల్ ప్లాంట్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వరుస ప్రమాదాలు.. యాజమాన్య నిర్ణయాల పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. కాగా.. తాజాగా స్టీల్ ప్లాంట్ నుంచి మిగిలిన సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బందిని పూర్తిగా ఉపసంహరించుకోవాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేయటంతో కొత్త చర్చ మొదలైంది.
Also Read : ఒక్క రోజే 400 కేసులు క్లోజ్.. సమాధాన్ సమారోహ్..!
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు భద్రతగా ఉన్న సీఐఎన్ఎఫ్ సిబ్బందిని పూర్తిగా ఉపసంహరించుకుంటూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 17 నాటికి యూనిట్‌ను పూర్తిగా ఖాళీ చేయాలని కేంద్రం 3 నెలల గడువు ఇచ్చింది. ప్రస్తుతం అక్కడ 350 మంది సెక్యూరిటీ, 120 మంది ఫైర్ సేఫ్టీ సిబ్బంది కొనసాగుతున్నారు. కాగా, 2024 వరకు స్టీల్ ప్లాంటులో సుమారు 1500 మంది సీఐఎస్ఎఫ్ బలగాలు ఉండగా, ఆ తర్వాత దశలవారీగా సిబ్బందిని తగ్గిస్తూ వస్తున్నారు. ఈ తాజా నిర్ణయంతో ప్లాంట్ భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. 2026 నవంబరు 17 నుంచి సెక్యూరిటీ, ఫైర్ వింగ్‌లలో ఉన్న బలగాలను ఉపసంహరించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి సీఐఎస్ఎఫ్‌కు రావాల్సిన బకాయిలన్నీ ముందుగా చెల్లించాలని కేంద్ర హోంశాఖ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజా నిర్ణయం పై కార్మిక సంఘాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ సీఐఎస్ఎఫ్ బలగాల ఉపసంహరణను ఉక్కు పరిశ్రమ అధికారికంగా నిర్దారణ చేయాల్సి ఉంది. అయితే గతంలో 400 మంది వరకు సీఐఎస్ఎఫ్, సెక్యూరిటీ, ఫైర్ విభాగం సిబ్బందిని తొలగించగా.. వారి స్థానంలో ఏపీ స్పెషల్ ఫోర్స్ బలగాలను నియమించారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌లో కొనసాగుతున్న 350 మంది సెక్యూరిటీ, 120 మంది ఫైర్ సేఫ్టీ సిబ్బందిని ఉపసంహరించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసిందనే సమాచారంతో కార్మిక సంఘాలు ఈ వ్యవహారం పైన ఆరా తీస్తున్నాయి.
Also Read : హెచ్1ఎన్1 వస్తే హార్ట్ ఎటాక్ వస్తుందా..?
ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌లోని సీఎస్ఎఫ్ బలగాలకు సంబంధించి.. భద్రతా విభాగంలో 1,033మంది.. అగ్నిమాపక విభాగంలో 298 మంది ఉన్నారు. అయితే, ఇప్పుడు పూర్తిగా వీరిని ఉపసంహరించిన తరువాత వీరి స్థానంలో ఏపీ స్పెషల్ ఫోర్స్ బలగాలకు భద్రతా బాధ్యతలు అప్పగిస్తారా.. లేదా.. అనేది స్పష్టత రావాల్సి ఉంది.

