పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం అంతమవుతుందని, నకిలీ నోట్లకు చెక్ పడుతుందని బీజేపీ సర్కార్ చేసిన ప్రకటనలు బూటకమని తేలింది. దేశంలో నకిలీ నోట్ల చెలామణీ పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .. ఆర్బీఐ తాజా నివేదిక వెల్లడించింది. బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీ కరెన్సీ నోట్ల గుర్తింపు 2025-26లో 5.7 శాతం పెరిగిందని, ముఖ్యంగా రూ.500, రూ.200 నోట్ల విభాగంలో నకిలీలు భారీగా పెరిగాయని ఆర్బీఐ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో 2,17,396 నకిలీ నోట్లను గుర్తించగా 2025-26లో ఆ సంఖ్య 2,29,746 నోట్లకు పెరిగిందని ఆర్బీఐ తన వార్షిక నివేదికలో పేర్కొంది. నకిలీలలో ఎక్కువగా రూ.500 నోట్లు ఉన్నాయి. 500 రూపాయల ఫేక్ నోట్లు 20 శాతం పెరిగాయి.
Also Read : భారత్ లో టెస్లా మోడల్ వై ప్రీమియం ఆర్డబ్ల్యూడీ.. ధర ఎంత అంటే..!
రూ.2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకోవడంతో నకిలీ నోట్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత ఏడాది 3,508 నకిలీ నోట్లను గుర్తించగా 2025-26లో 824 నోట్లను గుర్తించారు. గుర్తించిన మొత్తం నకిలీ నోట్లలో 97.6 శాతం.. 2,24,334 నోట్లు ఇతర బ్యాంకుల్లో గుర్తించగా, ఆర్బీఐ కేవలం 2.4 శాతం.. 5,412 నోట్లు మాత్రమే గుర్తించింది. అయితే ఈ గణాంకాలలో పోలీసులు, ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లను చేర్చలేదు. 2026 ఆర్థిక సంవత్సరంలో చలామణిలో ఉన్న రూ.500 డినామినేషన్ నోట్ల పరిమాణం సుమారు 11.2 శాతం పెరిగింది. ఇది భారతదేశ కరెన్సీ వ్యవస్థలో వాటి ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసింది.
ఆర్బీఐ నివేదిక ప్రకారం సంవత్సరం క్రితం 6,34,458 లక్షల 500 నోట్లు చెలామణిలో ఉండగా, 2026 మార్చి చివరి నాటికి ఆ సంఖ్య 7,05,482 లక్షలకు పెరిగింది. విలువ పరంగా చెలామణిలో ఉన్న రూ.500 నోట్ల విలువ 2025 ఆర్ధిక సంవత్సరంలో రూ.31.72 లక్షల కోట్ల నుంచి 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.35.27 లక్షల కోట్లకు పెరిగింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.500 డినామినేషన్‌లో గుర్తించిన నకిలీ నోట్లు 20 శాతానికి పైగా పెరిగాయని ఆర్బీఐ తెలిపింది. 2026 మార్చి చివరినాటికి చెలామణిలో ఉన్న మొత్తం నోట్ల పరిమాణంలో రూ.500 డినామినేషన్ నోట్లు 41.2 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగాయని, ఆ తర్వాత స్థానంలో 16.1 శాతం వాటాతో రూ.10 డినామినేషన్ నోట్లు ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది.
Also Read : సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్..!
విలువ పరంగా చూస్తే చెలామణిలో ఉన్న కరెన్సీలో 86 శాతానికి పైగా రూ.500 డినామినేషన్ నోట్లే ఉన్నాయి. దేశంలో కరెన్సీ డిమాండ్ నిరంతరం గణనీయంగా పెరుగుతుండటంతో ఆర్బీఐ పాలిమర్ బ్యాంక్ నోట్లను ప్రవేశపెట్టే విషయమై మళ్లీ చర్చలు ప్రారంభించింది. పాలిమర్ లేదా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే ఆలోచనపై పాట్నా, ముంబైలలో ఇటీవల ఆర్బీఐ రెండు బోర్డు సమావేశాల్లో చర్చ జరిగినట్టు తెలిసింది. సంప్రదాయ కాగితపు నోట్ల కంటే పాలిమర్ నోట్లు ఎక్కువ కాలం మన్నుతాయని, అలాగే వీటి తయారీ వ్యయం కూడా తక్కువగా ఉంటుందని ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నారు. పాలిమర్ ఆధారిత నోట్లను ఏటీఎంల ద్వారా కూడా పంపిణీ చేయవచ్చు. కేంద్ర బ్యాంకు త్వరలోనే పాలిమర్ కరెన్సీ పైలట్ ప్రాజెక్ట్ను సిద్ధం చేస్తోందని, ఇది త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
1988లో ఆస్ట్రేలియా ప్రపంచంలోనే మొదటిసారిగా పాలిమర్ కరెన్సీని ప్రవేశ పెట్టింది. 1996 నాటికి ఆ దేశం పూర్తిగా పాలిమర్ నోట్లలోకి మారిపోయింది. ఇక 2016లో మోడీ చేపట్టిన నోట్ల రద్దు దేశంలో పెద్ద రగడకు దారితీసింది. దీనిపై దేశంలో ప్రధాన పార్టీలన్నీ మోడీని టార్గెట్ చేశాయి. కాగ్, నీతిఅయోగ్ కూడా మోడీ నిర్ణయాలను అప్పట్లో తప్పు పట్టాయి. నోట్ల రద్దు వల్ల పేదలకు ఒరిగింది ఏమీ లేదని, అంబానీ, అదానీ వంటి వారు ఒక్కరోజైనా క్యూలో నిలబడి పెద్ద నోట్లు మార్చారా అని అప్పట్లో ప్రతి పక్షాలు ప్రశ్నల వర్షం కురిపించాయి. ఇవన్నీ నిజమేనన్న భావన సామాన్యుడులో కూడా వ్యక్తమైంది. అయితే తరువాత కాలంలో నోట్ల రద్దుపై ఎక్కడా విమర్శలు కనిపించలేదు. అలాగే 2016 తరువాత తీసుకొచ్చిన కొత్త రూ.2000 నోటును మోడీ ప్రభుత్వం రద్దు చేసింది.

