Monday, July 20, 2026 04:43 PM
Monday, July 20, 2026 04:43 PM

ఏపీలో కొత్త కోవిడ్ వేరియంట్.. మళ్ళీ వస్తోందా..?

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19కు సంబంధించిన జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన RF.5 ఉప-వేరియంట్ గుర్తించారు. కడప జిల్లాలో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసులకు సంబంధించిన నాలుగు నమూనాలను వైరస్ జీనోమ్ విశ్లేషణ కోసం పూణేలోని వైరాలజీ ప్రయోగశాలకు పంపగా, వాటిలో RF.5 వేరియంట్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు. పూణే నుంచి వచ్చిన నివేదికలపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు.

Also Read : టాబ్లెట్ కోసం ఇన్సులిన్ ఇంజెక్షన్ ఆపుతున్నారా..?

ఈ సందర్భంగా ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండటం మాత్రమే ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ కేసులు చెదురుముదురుగా మాత్రమే నమోదవుతున్నాయని, పరిస్థితిని ఆరోగ్యశాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని తెలిపారు. అవసరమైన అన్ని వైద్య ఏర్పాట్లు ఇప్పటికే చేపట్టామని, బోధనాస్పత్రుల్లో ప్రత్యేక కోవిడ్ వార్డులు, పడకలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కోవిడ్ నిర్ధారణకు అవసరమైన పరీక్షా కిట్లు, మందులు, ఇతర మౌలిక సదుపాయాలను కూడా సమకూరుస్తున్నట్లు వెల్లడించారు.

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ, RF.5 అనేది SARS-CoV-2 వైరస్‌కు చెందిన ఒమిక్రాన్ ఉప-వంశం (Sublineage) అని వివరించారు. ఇది JN.1 వేరియంట్ నుంచి సహజ పరిణామ క్రమంలో అభివృద్ధి చెందిన ఉప-వంశమని, రీకాంబినెంట్ (Recombinant) వేరియంట్ కాదని స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ వేరియంట్‌ను సాధారణ జీనోమిక్ పర్యవేక్షణలో భాగంగా నిరంతరం పరిశీలిస్తోందని తెలిపారు. సింగపూర్‌తో పాటు ఆగ్నేయాసియాలోని కొన్ని దేశాల్లో RF.5 కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాల ప్రకారం ఇది ఇతర ఒమిక్రాన్ వేరియంట్ల కంటే ఎక్కువ ప్రమాదకరమని చెప్పే ఆధారాలు లేవని పేర్కొన్నారు.

Also Read : ఉత్తరాంధ్రకు కొత్త యుగం.. ఆగస్టు 1న భోగాపురం ప్రారంభం

RF.5 వేరియంట్‌కు సంబంధించిన లక్షణాలు కూడా ఇతర ఒమిక్రాన్ ఉప-వేరియంట్ల మాదిరిగానే ఉంటాయని డాక్టర్ విష్ణువర్ధన్ వివరించారు. ప్రధానంగా గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, అలసట, శరీర నొప్పులు వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 16 కోవిడ్ కేసులు నమోదయ్యాయని, ఈ నెల 16వ తేదీ వరకు 12 కేసులు గుర్తించినట్లు మంత్రి సత్య కుమార్ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ, ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సలహా తీసుకోవడం వంటి సాధారణ జాగ్రత్తలను కొనసాగించాలని సూచించారు.

ప్రస్తుతం లభ్యమవుతున్న శాస్త్రీయ సమాచారం ప్రకారం RF.5 వేరియంట్‌పై భయపడాల్సిన అవసరం లేదని, అపోహలు లేదా పుకార్లను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది. పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రజలు అప్రమత్తంగా ఉంటే ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారులు మరోసారి స్పష్టం చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ నయా గేమ్...

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు...

హైదరాబాద్ డ్రగ్స్ అడ్డాగా...

భాగ్యనగరంలో మత్తు పదార్థాల కల్చర్‌ను పూర్తిగా...

తల్లికి వందనం పథకం...

ఏపీ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా...

కాదంబరి జెత్వాని కేసులో...

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ముంబై...

అమర్ రాజాకు ఏపీ...

ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ అమర...

తమ్మినేని చుట్టూ బిగుస్తున్న...

కోట్ల రూపాయల విలువైన భూమిని నకిలీ...

పోల్స్