ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రం సహకారంతో రైల్వే ప్రాజెక్టుల పనులు వేగవంతం అవుతున్నాయి. పాత ప్రాజెక్టులతో పాటుగా కొత్త ప్రాజెక్టులు కూడా ఒక్కొక్కటిగా పట్టాలెక్కుతున్నాయి. రాష్ట్రంలో కీలకమైన నడికుడి – శ్రీ కాళహస్తి రైల్వే లైన్ పనులు వేగవంతం చేసి ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుతం మార్కాపురం జిల్లా కనిగిరి వరకు పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం పామూరు వైపుగా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కనిగిరి వరకు రైల్వే లైన్ పనులు పూర్తికావడంతో అక్కడి వరకు రైళ్లు నడపాలని ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులతో పాటుగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైల్వేశాఖకు విన్నవించారు.
Also Read : కాళేశ్వరంపై పట్టు వదలని రేవంత్.. కీలక సమావేశం..!
కనిగిరి వాసుల ఎన్నో ఏళ్ల కలను నిజం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. నడికుడి – శ్రీ కాళహస్తి కొత్త రైల్వే లైన్‌లో కనిగిరి వరకు ప్యాసింజర్ రైలును నడిపేందుకు ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. గుంటూరు నుంచి నరసరావుపేట, వినుకొండ, గుండ్లకమ్మ, దర్శి, పొదిలి మీదుగా కనిగిరి వరకు రైలును నడిపేందుకు గుంటూరు రైల్వే డివిజన్ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఈ నెల 24న ఆ వివరాలు అధికారుల దగ్గరకు చేరాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం వారంలో ఆరు రోజుల పాటు గుంటూరు నుంచి కనిగిరి వరకు ఈ కొత్త సర్వీస్ నడపాలని ప్రతిపాదించారు. ఈ ప్యాసింజర్ రైలు గుంటూరులో ఉదయం 7 గంటలకు బయల్దేరి దర్శికి 9.23 గంటలకు దర్శి, 9.54 గంటలకు పొదిలి, 10.25 గంటలకు కనిగిరి చేరుకునేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ రైలు తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2 గంటలకు కనిగిరి నుంచి బయల్దేరి రాత్రి 7 గంటలకు గుంటూరు చేరుకునేలా ప్లాన్ చేశారు. అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే పూర్తి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.
Also Read : బ్లీచింగ్ ఉచ్చులో పడ్డ టీడీపీ..? వైసీపీ మైండ్ గేమ్ సక్సెస్..!
నడికుడి – శ్రీ కాళహస్తి కొత్త రైల్వే లైన్‌లో కనిగిరి వరకు రైలు నడపాలని గతంలోనే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి రైల్వే అధికారులను కోరారు. ఇటీవల రైల్వే అధికారులతో మాట్లాడటంతో సానుకూలంగా స్పందించారు. కనిగిరి రైల్వే స్టేషన్ పనులు పూర్తికావడం, ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో ఎలాంటి ఇబ్బందులు లేవు అంటున్నారు. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తి చేయడంతో.. కొత్తగా ప్యాసింజర్ రైలును కనిగిరి వరకు నడిపేందుకు దాదాపుగా లైన్ క్లియర్ అయినట్లేనని చెబుతున్నారు. కనిగిరి నుంచి ప్యాసింజర్ రైలు ప్రారంభమైతే ఆ ప్రాంతం నుంచి రాజధాని ప్రాంతమైన గుంటూరుకు కనెక్టివిటీ కూడా పెరుగుతుందంటున్నారు. కనిగిరి మాత్రమే కాదు పొదిలి, దర్శి ప్రాంతాల ప్రజలకు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మొత్తం మీద మార్కాపురం, పశ్చిమ ప్రకాశం జిల్లా వాసుల ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది. అయితే ఈ మార్గంలో ప్రస్తుతం గుండ్లకమ్మ వరకు మాత్రమే విద్యుత్ లైన్ అందుబాటులో ఉంది. కొత్తగా నిర్మించిన మార్గంలో ఇంకా విద్యుదీకరణ చేయలేదు. దీంతో.. గుంటూరు – కనిగిరి – గుంటూరు మధ్య మెమో ఇంజన్ నడిచే అవకాశం ఉంది.

