ఇరాన్‌పై మరోసారి అత్యంత భీకరమైన దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోందా..? అంటే అవుననే అంటున్నాయి అంతర్జాతీయ నివేదికలు. ఇజ్రాయెల్‌లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో జాతీయవాదాన్ని రగిల్చేందుకు, అక్కడి అల్ట్రా-ఆర్థడాక్స్ యూదుల మద్దతు కూడగట్టేందుకు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొత్త యుద్ధ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్, లెబనాన్ లేదా పాలస్తీనా ప్రాంతాలపై సరికొత్త దాడులకు నెతన్యాహు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఈ ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
Also Read: ఈ అరుదైన రికార్డ్ చంద్రబాబుకే సాధ్యం
ఇజ్రాయెల్‌కు ఏకంగా 40 వేల అత్యంత శక్తివంతమైన, వినాశకరమైన బాంబులను సరఫరా చేసేందుకు ట్రంప్ అంగీకరించారు. ఈ కొత్త రక్షణ ఒప్పందం ప్రకారం, ఇజ్రాయెల్‌కు అత్యంత ప్రాణాంతకమైన ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఒక్కొక్కటి 2,000 పౌండ్ల బరువుండే 40 వేల భారీ బాంబులను అమెరికా సరఫరా చేయనుంది. ఈ ప్యాకేజీలో 20,000 ‘MK 84’ బాంబులు, మరో 20,000 ‘BLU-117’ బాంబులతో పాటు 20,000 ‘I-2000 పెనెట్రేటర్’ వార్‌హెడ్‌లు కూడా ఉన్నాయి.
గతేడాది కాంగ్రెస్ సమీక్షా ప్రక్రియను పక్కనబెట్టి మరీ ట్రంప్ యంత్రాంగం దాదాపు 3 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను ఇజ్రాయెల్‌కు విక్రయించింది. గతంలో జో బైడెన్ ఈ 2,000 పౌండ్ల బాంబుల సరఫరాను నిలిపివేయగా, ట్రంప్ అధికారంలోకి రాగానే మళ్లీ వీటి రవాణాను పునరుద్ధరించడం గమనార్హం. ఈ దాడుల కోసమే ఈ 2,000 పౌండ్ల బాంబులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ భారీగా నిల్వ చేసుకుంటోంది. కేవలం ఆయుధాలు ఇవ్వడమే కాదు, ఇరాన్ దాడుల నుంచి ఇజ్రాయెల్‌ను రక్షించేందుకు అమెరికా రక్షణ వ్యవస్థలు నేరుగా రంగంలోకి దిగాయి.
Also Read : పాకిస్తాన్ కు షాక్ ఇచ్చిన భారత్..!
జోర్డాన్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేసిన సమయంలో పెంటగాన్ తన అత్యంత ఖరీదైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. కేవలం గత వారంలోనే 70కి పైగా హై-ఎండ్ ఎయిర్ డిఫెన్స్ ఇంటర్‌సెప్టర్లను, ఒక డజనుకు పైగా అత్యంత శక్తివంతమైన ‘థాడ్’ ఇంటర్‌సెప్టర్లను అమెరికా ప్రయోగించింది. అయితే, అమెరికా ఇజ్రాయెల్ కోసం ఇంతగా ఆయుధ సంపత్తిని ఖర్చు చేయడంపై అంతర్జాతీయ రక్షణ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా లాంటి ప్రధాన శత్రువును పక్కనబెట్టి, ట్రంప్ ప్రభుత్వం తన దృష్టిని పశ్చిమ ఆసియాపై కేంద్రీకరించిందని, అమెరికా తన విలువైన వనరులను ఇక్కడ వృథా చేస్తోందని విమర్శిస్తున్నారు.

