విజయనగరం జిల్లాలో ఆసక్తికరమైన రాజకీయం నడుస్తోంది. ఏ రాజకీయ శిబిరాన్ని చూసినా ‘బొత్స’ కుటుంబ కథా చిత్రమే దర్శనమిస్తోంది. రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పోటీకి ముందు సాగుతున్న కసరత్తు, గెలిచేందుకు అనుసరించాల్సిన మెళుకువల గురించి మాత్రం చాపకింద నీటిలా చర్చ నడుస్తూనే ఉంది. ఈ సారి జిల్లా చరిత్రలోనే సరికొత్త రాజకీయ క్రీడను చూసే అవకాశం కలిగింది. విజయనగరం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా నిలిచింది.
Also Read: కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణకు రేవంత్ ఆదేశాలు!
నిన్నటి వరకూ బొత్స రాజకీయం ఒకటి. కొద్ది రోజుల నుంచి మరొకటి. ఇప్పుడిది వైసీపీ నుంచే కాదు.. అన్ని పార్టీల నుంచి వినిపిస్తున్న మాట. బొబ్బిలి ఎంపీగా గెలుపు తన రాజకీయ వ్యూహాలకి పదును పెట్టేందుకు తోడ్పడింది. టీడీపీ హయాంలోనే జెడ్పీలో సరిసమాన బలం సాధించి, లాటరీ బొత్సకి అనుకూల వాతావరణాన్ని అందించింది. 2004 నాటికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోటరీలో ఒకరుగా ఎదిగి జిల్లా మీద పట్టు సాధించేందుకు బలమైన పునాదులు వేసింది. రాష్ట్ర మంత్రిగా తొలిసారి ప్రమాణస్వీకారం చేసిన తరువాత జిల్లాలో ఆట మొత్తం మారిపోయింది. ఆనాటి నుంచి బొత్స చెప్పిందే వేదంగా మారిపోయింది. కాంగ్రెస్‌లో దిగ్గజాలు ఉన్నా సత్తిబాబు దూకుడు ముందు నిలవలేని పరిస్థితి ఏర్పడింది. క్రమక్రమంగా విజయనగరం అంటే బొత్స, బొత్స అంటే విజయనగరం అని పిలుచుకునే విధంగా వాతావరణాన్ని సృష్టించారు.
2009 తరువాత సత్తిబాబు రాష్ట్ర రాజకీయాలలోకి అడుగుపెట్టారు. ఆ క్రమంలోనే తన సంబంధాలతో, తన రాజకీయ చతురతతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కూడా అయ్యారు. ముఖ్యమంత్రి రేసులో నిలిచారు. తరువాత రాష్ట్రం విడిపోవడం, మూడో పార్టీ తెరమీదకి రావడం, 2014 తరువాత కాంగ్రెస్ వీడి వైసీపీలోకి రావడం జరిగిపోయింది. ఇక్కడి వరకూ బొత్స, చిన్నశ్రీను కలిసి చేసిన రాజకీయమే అన్నది ముమ్మాటికీ వాస్తవం. సరిగ్గా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత చిన్నశ్రీను నీడలోంచి రాజకీయంగా ప్రతక్ష్యమయ్యారు. కారణాలు ఏమైనా 2019 తరువాత ఈ శిబిరంలోనే ఎడబాటు చోటుచేసుకోవడం జరిగింది.
అది కాస్త ఇప్పుడు పార్టీనే కాదు బొత్సతోనే బంధాన్ని తెంచుకునేటట్లు చిన్న శ్రీనుని ఒత్తిడికి గురి చేసినట్లయ్యింది. ఈ మార్పు బొత్సని మళ్లీ 2004 నాటి రాజకీయ పరిస్థితులకు దిగాల్సిన పరిస్థితి తలెత్తింది. చిన్న శ్రీను పార్టీ మారిన క్షణం నుంచే బొత్స తన వ్యూహానికి పదును పెట్టడం ప్రారంభించారు. ఒక అడుగు వెనక్కి వేసి మరీ తన పూర్వ సంబంధాలను కదుపుతున్నారు. అన్ని నియోజకవర్గాలలో తన బలాన్ని సమీకరించుకునే పనిలో ఉన్నారు. అన్ని వర్గాల వారితో మంత్రాంగం నడుపుతున్నారు. ఒక పక్క రీజినల్ కో ఆర్డినేటర్‌గా, మరో పక్క శాసన మండలి ప్రతిపక్ష నాయకుడిగా, ఇంకో పక్క విజయనగరంలో పార్టీ పగ్గాలను తిరిగి చేపట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
Also Read : కోర్ట్ లో ఐబొమ్మ రవి సంచలన పిటీషన్..!
తన సొంత నియోజకవర్గమైన చీపురుపల్లిలో రోజువారీ వ్యవహారాలను తన కుమారుడు సందీప్, తన కుమార్తె అనూషకు అప్పగించారు. మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‍కు పార్టీ జిల్లా అధ్యక్ష పగ్గాలు అప్పగించి.. పూర్తి స్థాయిలో పార్టీ పరంగా, తన పరంగా పట్టు సడలలేదన్నది నిరూపించేందుకు నానాపాట్లు పడుతున్నారు. గతం మాదిరిగా కాకుండా.. పార్టీ మీద వూర్తి పట్టును తిరిగి తన చేతుల్లోకి తీసుకునేందుకు బొత్స తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదే సమయంలో ఉత్తరాంధ్రలో బాగా వినిపిస్తున్న మాట.. బొత్సనా, చిన్న శ్రీనా?. రాజకీయపరమైన చర్చలో ఇది కీలకంగా మారింది. నిన్నటి వరకూ టీడీపీ, వైసీపీ అంటూ సాగిన చర్చ.. అకస్మాత్తుగా కీలకమలుపు తీసుకున్నట్లు అయ్యింది.

