ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నారా లోకేష్ పై ఇటీవల కొన్ని వర్గాలు, మాజీ అధికారులు విపరీతంగా స్పందిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల వేళ డీజేల నిర్వహణ, శబ్ద నియంత్రణపై ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు హోంమంత్రికి వినతి చేయడం ద్వారా అనుమతులు ఇప్పించారు. దీంతో ఆయన సూపర్ సీఎంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించే క్రమంలో ఆయన చూపుతున్న క్రియాశీలక చొరవను పాజిటివ్‌గా చూడటానికి బదులు, అధికారాన్ని చెలాయిస్తున్నారంటూ రాజకీయం చేయడం వెనుక బలమైన అసూయే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది.
Also Read : టీడీపీ కార్యకర్తలకు పవన్ ధన్యవాదాలు..!
పీవీ రమేష్‌తో పాటు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కూడా ట్విట్టర్ వేదికగా లోకేష్ ప్రాధాన్యతను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ప్రకటనల్లో స్థానిక మంత్రుల ఫోటోలు లేవని, లోకేష్ జోక్యం ఎక్కువైందని రోజువారీ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం ఓ పాలసీ పెట్టుకుంది. ఏదైనా పీఎం, సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలు మాత్రమే ఉంటాయి. దాన్ని గుర్తించడం లేదు. ఈ మాజీ అధికారుల బాధ వేరేలా ఉంది. ప్రభుత్వంలో తమకు అత్యంత ప్రాధాన్యత దక్కుతుందని అనుకున్నారు కానీ వారిని దూరం పెట్టారు. తమను దూరం పెట్టడానికి నారా లోకేష్ కారణం అనేది వీళ్ల అనుమానం. ఇలాంటి వర్గాలకు లోకేష్ వేగవంతమైన వర్కింగ్ స్టైల్ ఏమాత్రం జీర్ణమవడం లేదు. లోకేష్ తమను దగ్గరకు తీసి, తమ సొంత ఎజెండాలకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటే.. ఇదే సత్వర నిర్ణయాధికారాన్ని డైనమిక్ లీడర్షిప్ అంటూ పొగిడేవారనడంలో సందేహం లేదు. తమకు సందు దొరకడం లేదన్న అసహనమే ఈ సూపర్ సీఎం ప్రచారానికి ప్రధాన ఇంధనంగా మారింది.
నిజానికి కూటమి ప్రభుత్వంలో మంత్రి మండలి అంతా ఒకే కుటుంబంలా, ఒకే టీమ్‌లా పనిచేస్తోంది. క్షేత్రస్థాయి నుంచి వినతులు వచ్చినప్పుడు లేదా ప్రజల అత్యవసర సమస్యలు పరిష్కరించాల్సి వచ్చినప్పుడు, కేవలం తన పరిధి కాదని లోకేష్ మిన్నకుండిపోవడం లేదు. సంబంధిత శాఖ మంత్రులను ఆదేశించడం కాకుండా, వారికి పద్ధతిగా విజ్ఞప్తి చేస్తూ సమన్వయం చేసుకుంటున్నారు. వ్యవస్థలో నిర్ణయాల ప్రక్రియ వేగవంతం కావడానికి లోకేష్ తీసుకుంటున్నది బాధ్యత మాత్రమే తప్ప, అధికారం కాదనేది స్పష్టమవుతోంది. కేబినెట్ సహచరులతో సత్సంబంధాలు కలిగి ఉంటూ, ఎవరి పరిధిని ఉల్లంఘించకుండా ప్రజా సమస్యలపై దృష్టి సారించడాన్ని దురాక్రమణ గా చిత్రీకరించడం వారి అసూయే.
Also Read : కూతురు పెళ్లిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే ఖర్మ లేదు..!
కూటమి అధికారంలోకి వచ్చాక పరిశ్రమలను రప్పించడం, విద్యా వ్యవస్థలో సంస్కరణలు తేవడం, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను స్వయంగా పర్యవేక్షించడం ద్వారా లోకేష్ తన ప్రతిభను నిరూపించుకుంటున్నారు. ప్రతిపక్షాలు సృష్టించే మైండ్ గేమ్‌లను , విమర్శకుల వ్యాఖ్యలను పట్టించుకోకుండా, ప్రభుత్వం వేగంగా పరుగెత్తేలా ఒక ఉత్ప్రేరకం లా పనిచేస్తున్నారు. నిర్ణయాధికారం జాప్యం కాకుండా సమన్వయకర్తగా వ్యవహరించడాన్ని ఆధిపత్యంగా అభివర్ణించడం అంటే.. మారుతున్న ఆధునిక రాజకీయ నాయకత్వ శైలిని అర్థం చేసుకోవడంలో విమర్శకులు విఫలమవ్వడమే. లోకేష్ సాధిస్తున్న ప్రజాదరణ, రోజురోజుకూ పెరుగుతున్న రాజకీయ ప్రాధాన్యతనే ప్రత్యర్థులకు, మాజీ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అధికారం చెలాయించడం వేరు, ఒక పక్కా వ్యూహంతో సమర్థవంతంగా పరిపాలనా పగ్గాలను పటిష్టం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండటం వేరు. దీన్ని విమర్శించేవారు గుర్తించాల్సి ఉంది.

