కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నిండుగా.. అభివృద్ధి పండుగ బహిరంగ సభలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి శ్రీకారం చుడుతూ నిర్వహించిన ఈ సభలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, రాష్ట్రాభివృద్ధికి ఇక్కడి నుంచే బలమైన పునాది వేశామని ఆయన స్పష్టం చేశారు.
Also Read : వైసీపీ నేతల చూపు.. టీడీపీ వైపే..!
పిఠాపురం నియోజకవర్గ ప్రజలు తనను భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపడం ద్వారా రాష్ట్రంలో ఒక సరికొత్త రాష్ట్రాభివృద్ధి ప్రస్థానానికి పునాది వేశారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో తన గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులకు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. తన రాజకీయ ప్రస్థానంలో తాను ఎప్పుడూ గెలుపు, ఓటమిల గురించి ఆలోచించలేదని, కేవలం ప్రజలకు సేవ చేయడం, సమాజంలో మార్పు తీసుకురావడమే తన ఏకైక లక్ష్యమని ఈ సందర్భంగా పవన్ స్పష్టం చేసారు.
Also Read : వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్ మాస్ వార్నింగ్..!
పిఠాపురం నియోజకవర్గంలో దశాబ్దాలుగా నలుగుతున్న ఉప్పాడ తీర ప్రాంత సముద్ర కోత సమస్య అత్యంత కీలకమైనదని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ప్రత్యేక చొరవ తీసుకున్నామని తెలిపారు. ఉప్పాడ తీరంలో సముద్ర రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని రకాల అనుమతులను సాధించినట్లు పవన్ కల్యాణ్ సభ ముఖంగా ప్రకటించారు. ఈ భారీ ప్రాజెక్టు కోసం శాస్త్రీయంగా సర్వే పనులు, డిజైన్, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపకల్పనకు మద్రాస్ ఐఐటీ నిపుణుల బృందం రంగంలోకి దిగిందని వివరించారు. సుమారు రూ. 323 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ రక్షణ గోడ నిర్మాణం ద్వారా తీర ప్రాంత గ్రామాలకు, వ్యవసాయ భూములకు, మత్స్యకార కుటుంబాలకు దశాబ్దాల సముద్ర కోత ముప్పు నుండి శాశ్వత విముక్తి లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

