భారత వాయుసేన అరుదైన ఘనత సాధించింది. సముద్రమట్టానికి 13,629 అడుగుల ఎత్తులో ఉన్న లడఖ్‌లోని న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ఐఎల్–76ఎండీ భారీ రవాణా విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. ప్రపంచంలో ఎక్కడా ఈ తరహా విమానం ఇంత ఎత్తైన ప్రదేశంలో ల్యాండింగ్ చేయలేదని భారత వాయుసేన వెల్లడించింది. ఈ విజయంతో భారత వ్యూహాత్మక వాయు రవాణా సామర్థ్యంలో మరో కీలక మైలురాయి నమోదైంది.
Also Read : ప్రాదేశిక పోరులో కూటమి దూకుడు.. కానీ..!
సిబ్బంది నైపుణ్యానికి నిదర్శనం
ఈ చారిత్రక ల్యాండింగ్ ఐఎల్–76ఎండీ విమానం సామర్థ్యంతోపాటు సిబ్బంది అసాధారణ నైపుణ్యం, కచ్చితత్వం, వృత్తిపరమైన నిబద్ధతకు నిదర్శనమని వాయుసేన పేర్కొంది. అత్యంత ఎత్తైన ప్రదేశంలో భారీ రవాణా విమానాన్ని విజయవంతంగా దించడం ద్వారా సిబ్బంది తమ కార్యదక్షతను చాటుకున్నారని ప్రశంసించింది.

సరిహద్దుల్లో రవాణా సామర్థ్యానికి బలం
తూర్పు లడఖ్‌లోని న్యోమా వైమానిక స్థావరం వాస్తవాధీన రేఖకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఐఎల్–76ఎండీ వంటి భారీ విమానం ల్యాండ్ కావడం, సరిహద్దు ప్రాంతాలకు సైనికులు, భారీ పరికరాలు, అవసరమైన సామగ్రిని తరలించే సామర్థ్యానికి బలాన్నిస్తుంది. పర్వత ప్రాంతాల్లో సైనిక బలగాలకు రవాణా, సరఫరా మద్దతును అందించడంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ రికార్డు ప్రత్యేకంగా ఐఎల్–76ఎండీ విమాన రకానికి సంబంధించినది. న్యోమాలో సాధించిన ఈ విజయాన్ని విమానయాన చరిత్రలో సరికొత్త ఎత్తుగా అభివర్ణించిన భారత వాయుసేన.. దేశ వ్యూహాత్మక వాయు రవాణా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే మైలురాయిగా పేర్కొంది.


