ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి హెల్త్ హబ్‌గా మార్చే దిశగా మరో కీలక అడుగు పడబోతోంది. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వైద్య సంస్థలలో ఒకటైన ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నూతన క్యాంపస్ నిర్మాణానికి సెప్టెంబర్ 23న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ మరియు శంకుస్థాపన చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో శరవేగంగా పుంజుకుంటున్న అభివృద్ధి పనులకు ఈ మైలురాయి ప్రాజెక్టు మరింత ఊతం ఇవ్వనుంది.
Also Read : వాళ్ల కోసమే జగన్ ఎదురు చూపులు..!
ఈ ప్రతిష్ఠాత్మక ఆసుపత్రి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తుళ్లూరు మండలం పరిధిలోని అబ్బరాజుపాలెం గ్రామంలో, సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమీపంలో 12 ఎకరాల భారీ భూమిని కేటాయించింది. ఎల్వీ ప్రసాద్ ఇన్స్టిట్యూట్ నెట్‌వర్క్‌లోనే అత్యంత అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు మరియు పరిశోధనా కేంద్రంతో ఈ రీజినల్ క్యాంపస్ రూపుదిద్దుకోనుంది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రపంచ స్థాయి కంటి వైద్య సేవలు రాజధాని ప్రాంతంలోనే అందుబాటులోకి రానున్నాయి.
Also Read : జగన్‌కు ఊహించని షాక్ ఇస్తున్న లోకేష్..!
ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని ఏపీసీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు శంకుస్థాపన వేదిక వద్ద ఏర్పాట్లను సర్వసిద్ధం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలోనే అమరావతిని నాలెడ్జ్ అండ్ మెడికల్ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు జరగగా, ఇప్పుడు ఎల్వీ ప్రసాద్ వంటి పెద్ద బ్రాండ్ ఇక్కడికి రావడం విశేషం. ఈ మెగా ప్రాజెక్టు ప్రారంభంతో రాబోయే రోజుల్లో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ వైద్య సంస్థలు అమరావతికి క్యూ కట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

