వైసీపీని వివిధ కారణాల వల్ల వీడి వెళ్ళిన వారిని తిరిగి పార్టీలోకి తెచ్చే కార్యక్రమం జరుగుతోందా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. వైసీపీ నుంచి బయటకు వెళ్ళిన వారు ఎవరూ ప్రస్తుతం హ్యాపీగా లేరు అనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. ఇప్పటికే అక్కడ అంతా కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. పైగా నిన్నటిదాకా ఎదురు బొదురుగా నిలిచి రాజకీయంగా కత్తులు దూసుకున్న వారు ఇపుడు ఒకే గూటికి వచ్చినా ఈక్వేషన్లు కుదరడం లేదు. దాంతో పాటు ఏ పార్టీలో చేరినా కూడా కండువా కప్పుతారు కానీ భవిష్యత్తు మీద హామీ లేదు. మరి రాజకీయాల్లో అవకాశాలే ముఖ్యం కాబట్టి వైసీపీని వీడిన మాజీలు ఇపుడు కొత్త ఆలోచనలు చేస్తున్నారు అని అంటున్నారు.
Also Read : కళ్లెదుటే టీచర్లపై దాడి జరుగుతుంటే నిఘా వ్యవస్థ ఏమైంది..?
వైసీపీలో ఉన్నపుడు వారి ప్లేస్ పదిలంగా ఉంది. ఎవరూ అక్కడ పోటీ కాదు, తామే ఏకచత్రాధిపత్యంగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. కానీ వేరే పార్టీలోకి జంప్ చేసినప్పుడు పది మందిలో ఒకరుగా ఈ నేతలు నిలుస్తున్నారు. అది వారికి ప్రాధమికంగా ఇబ్బంది కలిగించేదిగా ఉంది అని అంటున్నారు. కీలక పదవులు నిర్వహించిన వారు దీనిని తట్టుకోలేకపోతున్నారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే కూటమి పార్టీలు పిలిచి కండువాలు కప్పడం లేదు, వస్తామంటే ఓకే చెబుతున్నారు, అక్కడ వారికి ప్రతీ నియోజకవర్గంలో కావాల్సినంత మంది నాయకులు ఉన్నారు. దాంతో కూటమి నుంచి అయితే ఉండాలని ఏమీ ఒత్తిళ్లు లేవు. మరో వైపు వైసీపీలో చూస్తే ఈ నాయకులు వదిలి వెళ్ళిన ఆ స్థానాలలో ఖాళీలు దాదాపుగా అలాగే ఉన్నాయి. దాంతో తాము సొంత గూటికి చేరి పాత స్థానాలను అందుకోవచ్చు అని పునరాలోచన చేస్తున్నారనే ఊహాగానాలు బాగా వినిపిస్తున్నాయి.
ఒక్కసారి పార్టీని వీడి వెళ్ళిపోయిన వారికి గేట్లు మూసివేయడమే తప్ప తిరిగి చేర్చుకోవడం అన్నది వైసీపీ ఇప్పటిదాకా చేయలేదు. అయితే వైసీపీ అధినాయకత్వంలో కూడా గణనీయమైన మార్పు ఈ విషయంలో కనిపిస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే మరో రెండేళ్ళ వ్యవధిలో ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. జగన్ పాదయాత్ర వచ్చే ఏడాది మొదలవుతుందని ఇప్పటికే వెల్లడించారు. ఈ తక్కువ సమయంలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించినా ఆశించిన ఫలితాలు వస్తాయనే నమ్మకం లేదంటున్నారు. మూడు పార్టీలతో కూటమి అత్యంత పటిష్టంగా ఉంది. అందువల్ల వారి వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రూపొందించాలంటే రాజకీయంగా గట్టి నాయకులు అవసరం అనే భావన వైసీపీ నేతల్లో ఉంది. అందుకే పార్టీలో మునుపటి నుంచి ఉన్న వారి సత్తా సామర్థ్యం వైసీపీకి తెలుసు కాబట్టి వారిని చేర్చుకుంటేనే మేలు కదా అని ఆలోచిస్తున్నారని చెబుతున్నారు.
Also Read : వైసీపీ నేతల చూపు.. టీడీపీ వైపే..!
అదే కనుక నిజం అయితే స్థానిక ఎన్నికల ముందే భారీ ఎత్తున చేరికలు ఉండొచ్చు అని అంటున్నారు. ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో వైసీపీ తన సత్తా చాటాలని చూస్తోంది. ప్రతీ జిల్లాలో బలమైన నాయకత్వం ఉండాలని చూస్తోంది. ఇటీవల విజయనగరం నుంచి ఒక కీలక నేత టీడీపీలో చేరిపోయారు. దీంతో క్యాడర్ కూడా డీలా పడింది. దాంతో తమ వైపు కూడా చేరికలు ఉంటే జోష్ పెరుగుతుందని భావించి ఈ వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ చేర్చుకోవడంలోనూ అందరికీ చాన్స్ దక్కుతుందా లేదా సెలెక్టివ్‌గా కొందరికేనా అన్నది అయితే చూడాల్సి ఉంది. పార్టీని వీడిపోయి అదే పనిగా అధినాయకత్వం మీద విమర్శలు చేస్తూ నష్టపరుస్తున్న ఒకరిద్దరి విషయంలో ఎప్పటికీ వైసీపీలో చాన్స్ దక్కేది లేదంటున్నారు.

