సరిగ్గా పార్లమెంట్ సమావేశాల ముందు.. బీజేపీ గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రస్తుతం బీజేపీకి అత్యంత కీలకం. గత సమావేశాల్లో బీజేపీ తీసుకువచ్చిన కీలక బిల్లులకు సభలో ఆమోదం లభించలేదు. దీంతో ఒక రకంగా బీజేపీ పరువు పోయినట్లుగా అయ్యింది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ.. రెండు బిల్లులకు ఆమోదం లభించలేదంటే.. అది ప్రభుత్వంపై కావాల్సినంత చెడ్డ పేరు అని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో డీ లిమిటేషన్ బిల్లుతో పాటు వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే ఆమోదం పొందేలా బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నారు.
Also Read : అంబటికి షాక్ ఇచ్చిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి సరిగ్గా రెండు రోజుల ముందు శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు లోక్‌సభలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఠాక్రే వర్గానికి చెందిన ఆరుగురు అసమ్మతి ఎంపీలు, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనం కావడానికి స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం ఠాక్రే వర్గానికి రాజకీయంగా తీవ్ర నష్టం చేకూర్చింది. ఈ పరిణామంతో లోక్‌సభలో ఏక్ నాథ్ షిండే వర్గం బలం 7 నుంచి 13కి పెరిగింది. అదే సమయంలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం బలం కేవలం ముగ్గురు ఎంపీలకే పరిమితమైంది. దీనివల్ల సభలో అధికార ఎన్డీఏ కూటమి బలం 319కి చేరింది. జూలై 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పరిణామం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
గత జూన్ నెలలో శివసేన (యూబీటీ)కు చెందిన తొమ్మిది మంది ఎంపీలలో ఆరుగురు తిరుగుబాటు చేశారు. పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వారు షిండే వర్గంలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే తమను షిండే వర్గంలో విలీనం చేయాలని కోరుతూ స్పీకర్‌కు పార్టీ వినతిపత్రం సమర్పించారు. మరోవైపు, ఫిరాయించిన అరుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ ఠాక్రే స్పీకర్‌ను కోరారు. అయితే, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ తమకు ఉందని రెబల్ ఎంపీలు వాదించారు. తాజాగా లోక్‌సభ టేబుల్ ఆఫీస్ జారీ చేసిన సర్క్యులర్‌లో, ఆరుగురు ఎంపీల విలీనాన్ని స్పీకర్ గుర్తించినట్లు అధికారికంగా వెల్లడించారు.
Also Read : అమర్ రాజాకు ఏపీ గవర్నమెంట్ బిగ్ గిఫ్ట్..!
ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ – ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతో షిండే శివసేన కేంద్రంలోని ఎన్‌డీఏ సర్కార్‌కు మద్దతు ఇస్తోంది. ప్రస్తుత ఎంపీల చేరికతో ఎన్‌డీఏ ఖాతాలో మరో ఆరుగురు ఎంపీలు చేరినట్లు అయ్యింది. ఈ సమావేశాల్లో సభలోకి వచ్చే కీలక బిల్లులకు ఆమోదం లభించడం చాలా సులువైంది. ఇప్పటికే టీఎంసీ రెబల్ ఎంపీలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. తాజాగా శివసేన (యూబీటీ) రెబల్ ఎంపీలు కూడా చేరడంతో కాషాయా నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు.

