ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో భారీ మార్పులు చేపట్టిన పార్టీ జాతీయ అధ్యక్షులు.. త్వరలో తన మంత్రివర్గంలో కూడా మార్పులు చేయనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. వాస్తవానికి ఏపీలో మంత్రివర్గ మార్పులంటూ చాలా రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. నిజానికి 2024 డిసెంబర్ నెలలోనే మంత్రివర్గంలోకి పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కొణిదెల నాగాబాబుకు అవకాశం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. కానీ దాదాపు ఏడాదిన్నర దాటినా కూడా ఇప్పటి వరకు ఆ ఇద్దరికీ అమాత్య యోగం వరించలేదు.
Also Read: మాచర్లలో సంచలనం.. జూలకంటిపై అటాక్..!
ఇక ఈ ఏడాది ఉగాదికి మంత్రివర్గ విస్తరణ అంటూ అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. అలాగే ఇన్ అవుట్ అంటూ కొన్ని పేర్లు కూడా సోషల్ మీడియాతో పాటు పొలిటికల్ సర్కిల్‌లో కూడా బాగా హల్‌చల్ చేశాయి. అయితే ఈ పుకార్లకు అటు పార్టీ పెద్దలు కానీ.. ఇటు ప్రభుత్వ వర్గాల నుంచి ఎలాంటి ఖండన రాలేదు. దీంతో మంత్రివర్గం నుంచి వారికి ఊష్టింగ్ ఖాయమనే మాట దాదాపు ఖరారైంది. ప్రధానంగా హోమ్ మంత్రి అనితను మంత్రివర్గం నుంచి తప్పించడం దాదాపు ఖాయమంటున్నారు విశ్లేషకులు. తాజాగా మరో ఇద్దరు మంత్రుల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి.
విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండపల్లి శ్రీనివాస్‌ను తొలగించడం దాదాపు ఖాయమే అంటున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే కొండపల్లికి క్యాబినెట్‌లో చోటు దక్కింది. జిల్లాలో ఎంతో మంది సీనియర్ నేతలను కాదని కొండపల్లికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. రెండేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఆయనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే వాసంశెట్టి సుభాష్‌ను కూడా తప్పించనున్నట్లు చంద్రబాబు సన్నిహిత నేతలు తెలిపారు. రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి సుభాష్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. సరిగ్గా 2024 ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. సుభాష్‌కు మంత్రిగా అవకాశం ఇవ్వడంపై అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి.
Also Read: సజ్జల భార్గవ్ కు బిగుస్తోన్న ఉచ్చు..?
వీరి స్థానంలో అనూహ్యంగా కొత్తవారికి చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే మంత్రివర్గం పూర్తిగా లోకేష్ టీమ్ అని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి కొత్తగా ఎమ్మెల్సీ కావలి గ్రీష్మకు ఎస్సీ, మహిళ కోటాలో చోటు ఖాయమంటున్నారు. అలాగే గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు దాదాపు ఖాయమంటున్నారు. అలాగే జనసేన పార్టీ నుంచి ప్రస్తుతమున్న కందుల దుర్గేష్ స్థానంలో కొణతాల రామకృష్ణకు అవకాశం ఇవ్వనున్నరు. వచ్చే నెల 27, 28, 29 తేదీల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రణస్థలం సమీపంలోని పైడి భీమవరం వద్ద తెలుగుదేశం పార్టీ మహానాడు పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహానాడు అనంతరం మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని పార్టీ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు.

