Friday, November 13, 2026 06:05 PM
Friday, November 13, 2026 06:05 PM

‘ఇట్లు అర్జున’ రివ్యూ : కొత్త పోరడు హిట్ కొట్టాడా?

‘శిరిడి సాయి’, ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రాల నిర్మాత మహేష్ రెడ్డి తన కుమారుడు అనీష్‌ను హీరోగా పరిచయం చేసిన చిత్రం ‘ఇట్లు అర్జున’. వెంకీ కుడుముల నిర్మాణ పర్యవేక్షణలో మహేష్ ఉప్పాల రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రచార చిత్రాలతో ఆసక్తి రేపింది. ఓ ప్రేమకథకు వెయ్యి కోట్ల హవాలా డబ్బు వ్యవహారాన్ని ముడిపెట్టిన ఈ చిత్రం ఎంతవరకు మెప్పించింది?

కథ

చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన అర్జున్ (అనీష్) మాట్లాడలేడు. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న తండ్రి కోసం చిన్నచిన్న దొంగతనాలు చేస్తుంటాడు. తన ఫ్లాట్‌కు పై అంతస్తులో ఉండే కీర్తి (అనస్వర రాజన్)ని చిన్నప్పటి నుంచే ఇష్టపడే అర్జున్, ఆమె మనసు గెలుచుకునే ప్రయత్నంలో ఉంటాడు. ఇంతలో పెద్దన్న (ముఖేష్ రుషి)కు చెందిన వెయ్యి కోట్ల హవాలా డబ్బుకు సంబంధించిన పాస్‌వర్డ్ అనుకోకుండా అతడి చేతికి చిక్కుతుంది. ఆ డబ్బు కోసం పోటీ పడుతున్న ముఠాలు అర్జున్ వెంటపడతాయి. వాటి నుంచి అతడు ఎలా బయటపడ్డాడు? ఈ వ్యవహారం కీర్తితో అతని బంధాన్ని ఎలా మలుపు తిప్పింది? అన్నది మిగతా కథ.

కథనం, విశ్లేషణ

అనీష్ అరంగేట్రానికి మహేష్ ఉప్పాల ఎంచుకున్న పాత్రే సినిమాకు తొలి ఆకర్షణ. తండ్రి కోసం దొంగతనాలు చేసే అర్జున్‌లో అమాయకత్వంతో పాటు చలాకీతనమూ ఉంది. కీర్తి మనసు గెలవడానికి అతడు చేసే ప్రయత్నాల్లో ఆ చలాకీతనం కనిపిస్తుంది. తన మనసులోని మాటను హావభావాలతో చెప్పే అర్జున్‌ను కథలో సహజంగా చూపించడం వల్ల ప్రేక్షకులకు అతడితో కలిసి ప్రయాణించే అవకాశం దొరుకుతుంది.

తొలి భాగంలో ప్రేమకథ సరదాగా సాగితే, హవాలా డబ్బు కోసం పోటీపడే ముఠాల ఎత్తుగడలు ఉత్కంఠను పెంచుతాయి. ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు విలన్లు చేసే ప్రయత్నాలు ప్రేమ సన్నివేశాల కంటే ఎక్కువ ఆసక్తి రేపుతాయి. అప్పటివరకు వేర్వేరుగా సాగిన ఈ రెండు కథలు విరామం దగ్గర కలుస్తాయి. ముఠాల మధ్య పోరు అర్జున్, కీర్తిల సమస్యగా మారే ఆ మలుపు రెండో భాగంపై అంచనాలను పెంచుతుంది.

విరామం తర్వాత ఆ ఉత్కంఠను కొనసాగించడంలో కథనం కొంత తడబడుతుంది. ముఠాల నుంచి ముప్పు పెరిగే కొద్దీ అర్జున్, కీర్తి మధ్య బంధం కూడా బలపడేలా సన్నివేశాలు కుదిరి ఉంటే, వారి ప్రయాణం మరింత ప్రభావవంతంగా ఉండేది. చివరి 40 నిమిషాల్లో మాత్రం సినిమా మళ్లీ వేగం పుంజుకుంటుంది. విలన్ అడ్డాలోకి అర్జున్ అడుగుపెట్టే యాక్షన్ ఘట్టానికి ‘రణవిహార’ పాట, తమన్ నేపథ్య సంగీతం బలం చేకూరుస్తాయి. కథను మలుపు తిప్పిన వెయ్యి కోట్ల వ్యవహారానికి దక్కిన ముగింపు కొంత అసంతృప్తిని మిగిల్చినా, అర్జున్ ప్రయాణానికి లభించిన భావోద్వేగ ముగింపు మెప్పిస్తుంది.

నటన, సాంకేతికాంశాలు

అర్జున్‌లోని అమాయకత్వాన్ని అనీష్ హావభావాలతో బాగా పలికించాడు. కొన్ని చోట్ల భావప్రకటన మరింత సహజంగా ఉండాల్సిందనిపించినా, నృత్యాలు, పోరాటాల్లో అతడి ఈజ్ కనిపిస్తుంది. కీర్తిగా అనస్వర రాజన్ చలాకీగా నటించింది. ముఖేష్ రుషి, కళైఅరసన్, ఎలాంగో కుమార్‌వేల్ తమ పాత్రలతో నేరకథకు బలం చేకూర్చారు. రాజా మహదేవన్ ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు సినిమాకు దృశ్యపరంగా ఆకర్షణ తెచ్చాయి. యాక్షన్ ఘట్టాలను తెరకెక్కించడంలో మహేష్ ఉప్పాల పనితనం కనిపిస్తుంది. వాటి ప్రభావాన్ని పెంచడంలో తమన్ సంగీతం కీలకంగా నిలిచింది.

మొత్తంగా ‘ఇట్లు అర్జున’ పరిచయమైన ప్రేమ, నేర కథాంశాలతో మొదలై, ఆసక్తికరమైన విరామ ఘట్టం, బలమైన పతాక సన్నివేశాలతో మెప్పిస్తుంది. రెండో భాగం మధ్యలో వేగం తగ్గినా, అర్జున్ పాత్రను తీర్చిదిద్దిన తీరు అనీష్‌కు మంచి అరంగేట్రాన్ని అందించింది.

ఆంధ్రన్యూస్9 రేటింగ్ – 2.5/5

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

సీఐఐ సమ్మిట్‌లో లోకేష్,...

విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య...

గిరిజనుల అభిమానం పవన్...

గిరిజనులను ఆకట్టుకునేందుకు పవన్ కల్యాణ్ చేసిన...

కూటమిలో పంచాయతీ కుంపట్లు..!

పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఇప్పటి...

పెట్టుబడుల వేటలో మంత్రి...

విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ అంతర్జాతీయ భాగస్వామ్య...

లోకల్ వార్‌లో మంత్రుల...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు...

లోకేష్ వర్సస్ వైసీపీ.....

మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఆసక్తికరంగా...

పోల్స్