ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్‌ల పరంపర కొనసాగుతోంది. ముఖ్యంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఆ పార్టీకి కోలుకోలేని విధంగా మరో వికెట్ డౌన్ అయింది. సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీకి అధికారికంగా గుడ్ బై చెప్పారు. అమరావతి వేదికగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన పార్టీలో చేరారు. కృష్ణుడికి పవన్ కళ్యాణ్ స్వయంగా జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Also Read : ఎన్నికల కమిషన్‌లో ముదిరిన వివాదం..!
తుని నియోజకవర్గంలో వైసీపీ కోట రోజురోజుకూ కుప్పకూలుతోంది. ఇటీవలే ఆ పార్టీకి చెందిన మరో బలమైన నేత వరుపుల సుబ్బారావు కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వరుపుల సుబ్బారావు నిష్క్రమణతోనే తునిలో వైసీపీ సగం బలాన్ని కోల్పోగా, ఇప్పుడు యనమల కృష్ణుడు కూడా హ్యాండ్ ఇవ్వడంతో నియోజకవర్గంలో పార్టీ ఉనికి పూర్తిగా ప్రశ్నార్థకంగా మారింది. ఒకే నియోజకవర్గంలో ఇంతటి ప్రజాదరణ, కేడర్ బలం ఉన్న ఇద్దరు కీలక నేతలు ఒకరి వెనుక ఒకరు పార్టీని వీడటం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహాలకు ఎదురుదెబ్బగా మారింది అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు.
Also Read : ఫిరాయింపులలో తెలంగాణా వరస్ట్ రికార్డ్..!
గత 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో సీటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన యనమల కృష్ణుడు.. అప్పట్లో వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మారుతున్న రాజకీయ పరిణామాలు, క్షేత్రస్థాయిలో వైసీపీ భవిష్యత్తు అంధకారంగా మారడంతో ఆయన ప్రత్యామ్నాయ దారుల వైపు చూశారు. తుని నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ఓటర్లు, యువతలో జనసేనకు ఉన్న క్రేజ్ మరియు పవన్ కళ్యాణ్ వైఖరి నచ్చడంతోనే ఆయన గాజు గ్లాస్ అందుకోవడానికి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. వరుపుల, యనమల కృష్ణుల నయా రూట్‌తో తునిలో వైసీపీ క్యాడర్ అంతా ఇప్పుడు జనసేన, టీడీపీల వైపు క్యూ కడుతోంది.

