రాష్ట్ర బీజేపీలో అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమైంది. రెండోసారి ఎంపీలుగా గెలిచినప్పటి నుంచి ఒకే సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, ఎంపీ ధర్మపురి అరవింద్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విబేధాలు కొనసాగుతున్నాయి. సందు దొరికినప్పుడల్లా ఒకరిపై ఒకరు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసుకోవడం నిత్యకృత్యంగా మారింది. గతంలో బండి సంజయ్ తనయుడిపై వచ్చిన పోక్సో కేసు వివాదం వెనుక అరవింద్ హస్తం ఉందంటూ బండి వర్గం పరోక్షంగా ఆరోపణలు చేయగా, జగిత్యాల జిల్లా రాజకీయాల్లో పట్టు కోసం ఇద్దరు నేతల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది.
Also Read : జనసేన యూత్ విభాగం లాంచ్.. పేరు ఇదే..!
ముఖ్యంగా తన నియోజకవర్గ వ్యవహారాల్లో బండి సంజయ్ జోక్యాన్ని తానే మాత్రం సహించేది లేదంటూ అరవింద్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంతర్గత గొడవలు తాజాగా మరో వివాదంతో డిజిటల్ మీడియా వేదికగా రచ్చకెక్కాయి. ఇటీవల ఒక టీడీపీ, రేవంత్ రెడ్డి అనుకూల డిజిటల్ మీడియా సంస్థలో ధర్మపురి అరవింద్‌కు వ్యతిరేకంగా ఒక ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై ఎంపీ అరవింద్ తీవ్రంగా మండిపడ్డారు. ఆ తర్వాత సదరు మీడియా సంస్థ ఆ కథనాన్ని ఆన్‌లైన్ నుండి తొలగించింది. దీనిపై అరవింద్ స్పందిస్తూ, ఆ కథనం రాసిన మహిళా జర్నలిస్ట్ ఎవరో తనకు తెలుసని, తాను గట్టిగా మాట్లాడటం వల్లే వారు ఆ వార్తను తొలగించారని పేర్కొన్నారు.
Also Read : నేను రాజీనామా చేయాలంటే సిఎం చేయాల్సిందే..!
అయితే ఈ కథనం వెనుక సొంత పార్టీ నేతలే ఉన్నారని, ఆ దిశగా విచారణ జరపాలని ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో అరవింద్ సూచించడం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు అరవింద్ కావాలనే తనకు సన్నిహితంగా ఉండే ఒక యూట్యూబర్ ద్వారా బండి సంజయ్‌ను టార్గెట్ చేస్తున్నారని బండి సంజయ్ అనుచరులు తిప్పికొడుతున్నారు. ఈ రకమైన ఇంటర్వ్యూల ద్వారా బండి సంజయ్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ తాజా వివాదం ఇద్దరు అగ్రనేతల మధ్య ఉన్న పాత కక్షలను, లొల్లిని మరోసారి బట్టబయలు చేసింది.

