ఆంధ్రప్రదేశ్‌కు కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఒక ప్రతిష్టాత్మక డ్రోన్ తయారీ ప్రాజెక్టు కోసం ఇటు ఆంధ్రప్రదేశ్, అటు పొరుగు రాష్ట్రమైన తమిళనాడు మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది. చంద్రు రాజేంద్రన్ అనే ప్రముఖ పారిశ్రామికవేత్త తన క్లయింట్లలో ఒకరు భారతదేశంలో రూ.300 కోట్ల భారీ పెట్టుబడితో సరికొత్త డ్రోన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అనువైన రాష్ట్రం కోసం చూస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
Also Read : కన్వర్ట్ అయితేనే వైసీపీలో పదవులా..? డ్యామేజ్ అయిన జగన్ ఇమేజ్
ఈ ట్వీట్‌పై రాష్ట్ర ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించి ఏపీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఆ పారిశ్రామికవేత్తకు రిప్లై ఇస్తూ.. “చంద్రు, మేము ప్రస్తుతం కర్నూలులో దేశంలోనే అత్యంత అధునాతనమైన ఒక మెగా ‘డ్రోన్ సిటీ’ని అభివృద్ధి చేస్తున్నాము. మీ పరిశ్రమకు అవసరమైన భూమి, అంతర్జాతీయ స్థాయి ఎకోసిస్టమ్, వేగవంతమైన సింగిల్ విండో అనుమతులను మా ప్రభుత్వం తక్షణమే కల్పిస్తుంది.
అంతేకాకుండా డ్రోన్ల తయారీ కోసమే ప్రత్యేకంగా రూపొందించిన అద్భుతమైన ప్రోత్సాహక విధానం కూడా ఏపీలో అందుబాటులో ఉంది. కాబట్టి మీ ప్రాజెక్టు చర్చల కోసం వెంటనే ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డుతో సంప్రదించండి” అని పిలుపునిచ్చారు. మంత్రి లోకేష్ చూపిన ఈ వేగవంతమైన చొరవకు చంద్రు రాజేంద్రన్ కూడా సానుకూలంగా స్పందిస్తూ.. తమ షార్ట్‌లిస్ట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉందని ప్రకటించారు. మరోవైపు ఈ మెగా ప్రాజెక్టును ఎలాగైనా దక్కించుకోవాలని తమిళనాడు ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ కూడా రంగంలోకి దిగింది.
Also Read : చైనాలో ఆ రాత్రి ఇంత ఘోరం జరిగిందా..?2 లక్షల మంది ఎలా..?
తమ రాష్ట్రంలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌తో పాటు నైపుణ్యం కలిగిన ఇంజనీరింగ్ ప్రతిభ అందుబాటులో ఉందని చెప్తూ వారు కూడా ఆ పెట్టుబడిదారుడిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. అయితే, మంత్రి నారా లోకేష్ నేరుగా రంగంలోకి దిగి కర్నూలు డ్రోన్ సిటీ ప్రణాళికలను వివరించడంతో ఈ రూ.300 కోట్ల ప్రాజెక్టు ఏపీకే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ భారీ పెట్టుబడి ఏ రాష్ట్రానికి దక్కుతుందనేది ఇప్పుడు రాజకీయ, పారిశ్రామిక వర్గాలలో ఆసక్తికరంగా మారింది.

