Saturday, August 29, 2026 02:02 PM
Saturday, August 29, 2026 02:02 PM

వారసుల కోసం నేతల పాట్లు.. ఫలితమిస్తాయా..?

అధికారం పోయింది.. కానీ రాజకీయ పట్టు పోకూడదు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా.. కుటుంబ రాజకీయ వారసత్వం మాత్రం కొనసాగాలి. ఇప్పుడు ఉత్తరాంధ్ర వైసీపీ సీనియర్ నేతల ఆలోచన ఇదేనా..? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను వేదికగా చేసుకుని తమ వారసులను రాజకీయ రంగంలోకి దించి.. వారికి ప్రజాప్రతినిధులుగా తొలి గుర్తింపు ఇప్పించేందుకు బొత్స సత్యనారాయణ, ధర్మాన సోదరులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించిన ఈ కుటుంబాలకు ఇప్పుడు అసలు సవాల్ అధికారాన్ని తిరిగి సాధించడం మాత్రమే కాదు.. తమ రాజకీయ వారసత్వాన్ని తర్వాతి తరానికి విజయవంతంగా బదిలీ చేయడం కూడా. అందుకే స్థానిక ఎన్నికలనే అందుకు తొలి వేదికగా ఎంచుకుంటున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Also Read : ఏపీ మున్సిపాలిటీలకు మహర్దశ.. భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్..!

విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొత్స కుటుంబానికి ప్రత్యేకమైన రాజకీయ పునాది ఉంది. బొత్స సత్యనారాయణ సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు కూడా వివిధ పదవులు అనుభవించారు. ఇప్పుడు ఆ వారసత్వాన్ని తర్వాతి తరానికి అప్పగించే దిశగా కసరత్తు జరుగుతోందన్న చర్చ మొదలైంది. బొత్స సత్యనారాయణ తన కుమార్తెను స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దించి.. జిల్లా పరిషత్ స్థాయిలో కీలక పదవికి తీసుకురావాలని చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే అది బొత్స కుటుంబ రాజకీయాల్లో కొత్త తరానికి అధికారిక ఆరంభంగా మారనుంది. స్థానిక సంస్థల స్థాయిలో పట్టు సాధించిన తర్వాత భవిష్యత్తులో అసెంబ్లీ లేదా పార్లమెంట్ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ఇది బలమైన పునాదిగా మారవచ్చన్నది అనుచరుల అంచనా.

శ్రీకాకుళం రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా తమదైన ముద్ర వేసిన ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ విషయంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇద్దరు నేతలు తమ కుమారులను ఇప్పటికే నియోజకవర్గ స్థాయి కార్యక్రమాల్లో చురుగ్గా భాగస్వాములను చేస్తున్నారన్న చర్చ ఉంది. ప్రసాదరావు కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, కృష్ణదాస్ కుమారుడు కృష్ణ చైతన్య పేర్లు స్థానిక రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గత ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ భవిష్యత్తుపై కొత్త వ్యూహాలు అవసరమైన సమయంలో.. వారసులను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం ద్వారా రెండు లక్ష్యాలను సాధించవచ్చన్నది వారి ఆలోచనగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు కొత్తతరం నాయకులకు రాజకీయంగా ప్రయోగాత్మక వేదికగా మారే అవకాశం ఉంది. గ్రామం నుంచి జిల్లా వరకు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకునేందుకు.. కేడర్‌తో అనుబంధం పెంచుకునేందుకు.. సొంత రాజకీయ గుర్తింపు తెచ్చుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. మరోవైపు కుటుంబ వారసులకు ప్రాధాన్యం పెరిగితే.. కేడర్‌లో ఎలాంటి స్పందన వస్తుందన్నది కీలక ప్రశ్న. సీనియర్ నేతల వ్యక్తిగత ప్రభావం ఒకవైపు.. స్థానిక నాయకుల అసంతృప్తి మరోవైపు. ఈ రెండింటినీ సమన్వయం చేయడం ఆయా నేతలకు అంత తేలిక కాకపోవచ్చు.

Also Read : ఏకగ్రీవాలను వైసీపీ అడ్డుకోగలదా..?

మరోవైపు రాష్ట్రంలో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి అధికారంలో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష వైసీపీ తరఫున కొత్తగా రంగంలోకి దిగే వారసులకు వ్యక్తిగత కుటుంబ పలుకుబడితో పాటు.. పార్టీ కేడర్ బలం, స్థానిక సామాజిక సమీకరణాలు, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను ఎదుర్కొనే సామర్థ్యం కూడా అవసరం. అంటే.. సీనియర్ నేతల పేరు వారసులకు టికెట్ తెచ్చిపెట్టవచ్చు.. కానీ గెలుపును మాత్రం ప్రజలే నిర్ణయించాలి.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు బొత్స, ధర్మాన సోదరులకు కేవలం పార్టీ ఉనికిని చాటుకునే ఎన్నికలు మాత్రమే కాకుండా.. తమ కుటుంబాల రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకునే వేదికగా మారనున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వారసులను స్థానిక పీఠాలపై కూర్చోబెట్టి రాజకీయంగా బలమైన పునాది వేస్తారా..? లేక అధికార కూటమి ధాటికి ఆ వ్యూహం బెడిసికొడుతుందా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్టీ భవిష్యత్తు ఒక ఎత్తు.. కుటుంబ రాజకీయ భవిష్యత్తు మరో ఎత్తు. ఈ రెండింటినీ ఒకే బరిలో పరీక్షించబోతున్న స్థానిక ఎన్నికలు.. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కొత్త తరానికి ‘లాంచింగ్ ప్యాడ్’ అవుతాయా..? లేక సీనియర్లకు మరో పరీక్షగా మిగిలిపోతాయా..? వేచి చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జగన్‌ని భయపెడుతున్న ఇండియా...

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌...

వైసీపీ నేతలను జగన్...

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే రాబోయే స్థానిక సంస్థల...

SC, STలకు జగన్‌...

BCలనే కాదు..వైసీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీలను...

300 కోట్ల పెట్టుబడి.....

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించడమే...

ఆసియా క్రీడల్లో క్రికెటర్లకు...

జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా వచ్చే నెల...

ఇలా అయితే ...

ఏ రాజకీయ పార్టీలో అయినా సరే.....

పోల్స్