Friday, August 28, 2026 08:06 PM
Friday, August 28, 2026 08:06 PM

ఏకగ్రీవాలను వైసీపీ అడ్డుకోగలదా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలను అంగీకరించేది లేదని, ప్రతి స్థానంలో వైసీపీ అభ్యర్థులను పోటీకి పెట్టాలని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని చోట్ల ఏకగ్రీవాలు జరగకుండా అడ్డుకోగలమా..? అంటూ వైసీపీ నేతలు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఏకగ్రీవాలను ప్రోత్సహించామని ఇప్పుడు వద్దంటే ఎలా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏకగ్రీవాలు అయ్యే చోట సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జులపైన చర్యలు ఉంటాయని అధినేత హెచ్చరికలతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

Also Read : కన్వర్ట్‌ అయితేనే వైసీపీలో పదవులా..? డ్యామేజ్ అయిన జగన్ ఇమేజ్

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. స్థానిక ఎన్నికల్లో మాత్రం తన పార్టీ సత్తా చూపాలని భావిస్తున్నారు. దీంతో ప్రతి చోట పోటీకి సిద్ధం కావాలని.. అందుకు తగిన కేడరు సిద్ధం చేయాలని చెబుతున్నారు. రెండు నెలల నుంచి పార్టీ అంతర్గత సమావేశాల్లో స్థానిక ఎన్నికలపై తీవ్రంగా చర్చిస్తూ.. స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. తాజాగా పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయిలో సమర్థంగా పనిచేసి ఫలితాలు రాబట్టాలని ఆదేశాలు జారీ చేశారు కూడా. ఈ పరిణామంతో వైసీపీ కేడర్‌లో ఒక్కసారిగా జోష్ పెరిగిందనేది పార్టీ నేతలు బయటకు చెబుతున్న మాట. అయితే పార్టీ అధికారంలో లేని సమయంలో ఏకగ్రీవాలు జరగకుండా పోరాడటం అంటే చాలా వ్యయప్రయాసలతో కూడిన అంశంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు భావిస్తున్నారు.

Also Read : ఇలా అయితే మా వల్ల కాదు..!

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, వైసీపీ నేతలు, కార్యకర్తలు లక్ష్యంగా జరుగుతున్న అరెస్టుల వల్ల కొన్ని సమస్యాత్మక నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పోటీ అంటే కార్యకర్తలు ముందుకు వచ్చే పరిస్థితి లేదని వైసీపీ నేతలు అంతర్గతంగా చర్చిస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా కొన్నిచోట్ల జరిగిన ఒప్పందాల ప్రకారం ప్రస్తుతం ఏకగ్రీవాలకు సహకరించాల్సిన పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. అదే సమయంలో కొన్ని పంచాయతీల్లో గ్రామాల అభివృద్ధి కోసం అంతా కలిసి ఏకగ్రీవ ఎన్నికలు చేసుకుంటారని, ఇలాంటి చోట అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతుంటారని అంటున్నారు.

ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకగ్రీవాలకు అంగీకరించమంటే కుదురుతుందా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గతంలో అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో నాటి ప్రతిపక్ష నేతలపై జరిపిన దాడులు ఇప్పటికీ అందరికీ గుర్తే. అభ్యర్థులను అడ్డుకోవడం, కిడ్నాప్, బెదిరింపులు.. ఇలా లెక్కలేనన్ని ఉన్నాయి. మాచర్ల మునిసిపాలిటీలో అన్ని వార్డులను పూర్తి ఏకగ్రీవం చేసుకోవడం వెనుక మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెదిరింపులు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. వీటికి ప్రస్తుత కూటమి నేతలు తప్పని సరిగా బదులు తీర్చుకుంటారనేది విశ్లేషకుల మాట.

Also Read : సీఎం రేవంత్‌కు మంత్రి కొండా సురేఖ బంగారు రాఖీ..!

మొత్తానికి ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వొద్దు అంటూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జారీ చేసిన అల్టిమేటం నియోజకవర్గ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. అధినేత ఆదేశాలను అమలు చేసేందుకు చాలా మంది నియోజవర్గాల్లో ఇప్పటికే తమ క్యాడర్‌తో సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికీ.. అవి పెద్దగా ఫలితాలు రావడం లేదు. కొందరు నేతలు రెండేళ్లుగా నియోజకవర్గాలకు దూరంగా ఉండటం, అడపాదడపా మాత్రమే కార్యకర్తలను కలుస్తుండటం వల్ల ఇప్పుడు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో అనే టెన్షన్ వైసీపీ నేతల్లో ఉంది. ఇన్నాళ్లు కార్యకర్తలను గాలికి వదిలేసి ఇప్పుడు తమ సీటు కిందకు నీళ్లు వచ్చాయనే ఆందోళనతో పోటీ చేయమంటే కేడర్ అంగీకరిస్తుందా..? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఏమైనా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో స్థానిక ఎన్నికల్లో ఫలితాలు ఎలా వస్తాయో గానీ వైసీపీ నియోజకవర్గ స్థాయి నేతల్లో మార్పు మాత్రం తీసుకువస్తుందని అంచనా వేస్తున్నారు. వాస్తవంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలకే ప్రాధాన్యమిచ్చింది. ఏకగ్రీవాలకు ప్రత్యేక నజరానాలు కూడా ప్రకటించింది. అప్పట్లో ప్రతిపక్షాన్ని అడ్డుకునేందుకు ఎన్నో అరాచకాలకు పాల్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో అందుకు భిన్నంగా అధినేత ఆలోచించడంపై పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇటు అధినేత జగన్ ఆదేశాలను శిరసావహించడం.. అటు అధికార పార్టీని ఎదుర్కొవడం కష్టమే అంటున్నారు వైసీపీ నేతలు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ స్థానిక ఎన్నికలు ఏకగ్రీవం కాకూడదు.. ఏకగ్రీవాలు అయితే ఆయా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌కు సీటు లేనట్టే అంటూ అధినేత బెదిరించడం ఆశావహుల్లో కలకలం మొదలైంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆసియా క్రీడల్లో క్రికెటర్లకు...

జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా వచ్చే నెల...

ఇలా అయితే ...

ఏ రాజకీయ పార్టీలో అయినా సరే.....

ఏపీ మున్సిపాలిటీలకు మహర్దశ.....

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు, నగరాల రూపురేఖలను మార్చేలా...

సీఎం రేవంత్‌కు మంత్రి...

తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా...

అమరావతిలో మళ్ళీ ల్యాండ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను...

మళ్ళీ తెరమీదకు బీసీ...

మాజీ మంత్రి విడదల రజనీ అప్పుడప్పుడు...

పోల్స్