ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును తీవ్రతరం చేసింది. ఈ ఇసుక కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయ అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ కేసులో మే 26వ తేదీన దేశవ్యాప్తంగా 8 ప్రధాన ప్రాంతాలలో ఏకకాలంలో నిర్వహించిన సోదాలలో భారీగా నగదు, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారికంగా వెల్లడించింది.
Also Read : హైకోర్టులకు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..!
హైదరాబాద్, జైపూర్, కోయంబత్తూర్ నగరాల్లోని మొత్తం 8 కీలక ప్రాంతాలలో ఈడీ అధికారులు సుదీర్ఘంగా తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో రూ.1.53 కోట్ల భారతీయ కరెన్సీ, 1,800 అమెరికా డాలర్ల విదేశీ కరెన్సీ, మరియు రూ.1.29 కోట్ల విలువైన వెండి బిస్కట్లు లభ్యమవగా, వాటిని అధికారులు సీజ్ చేశారు. వీటితో పాటు నిందితులకు, వారి కుటుంబ సభ్యులకు చెందిన స్థిర, చరాస్తుల పత్రాలు, పలు డిజిటల్ పరికరాలు మరియు కీలకమైన పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది.
Also Read : భారతీయులు మా ఉద్యోగాలను దోచుకుంటున్నారు: బ్రిటిష్ ఎంపీ..!
గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తన అధికార దుర్వినియోగానికి పాల్పడి, ప్రైవేట్ కాంట్రాక్ట్ కంపెనీలతో చేతులు కలిపి నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారని ఈడీ స్పష్టం చేసింది. ఇసుక తవ్వకాల కాంట్రాక్టులు దక్కించుకున్న ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీసీకేసీ ప్రాజెక్ట్స్, టర్న్‌కీ ఎంటర్ప్రైజెస్ కార్యాలయాలతో పాటు వ్యాపారవేత్తలు బోయినపల్లి శ్రీనివాసరావు, అశోక్ కుమార్, మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి నివాసాలు, ఫామ్ హౌస్ లలో ఈ తనిఖీలు జరిగాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటైన జిల్లా స్థాయి ఇసుక కమిటీలు గతంలో జరిపిన తనిఖీల్లో ఈ కంపెనీలు అనుమతించిన పరిమితి కంటే ఎక్కువ లోతుగా, అలాగే అనుమతి లేని ప్రాంతాల్లో ఇసుకను అక్రమంగా తవ్వినట్లు తేలింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను జైప్రకాష్ పవర్ వెంచర్స్, జీసీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలపై ఏకంగా రూ.2,407.70 కోట్ల మేర డిమాండ్ నోటీసులు జారీ అయినట్లు ఈడీ గుర్తించింది.

