పోలవరం జిల్లా పరిధిలో పెద్దపులి సంచారం మరోసారి తీవ్ర కలకలం రేపుతోంది. గత నాలుగు నెలలుగా అటవీ సరిహద్దు గ్రామాల్లోని ప్రజలను, గిరిజన ప్రాంతాలను ముప్పతిప్పలు పెడుతున్న ఈ పులి.. ఇప్పుడు మళ్లీ గంగవరం మండలంలోకి ప్రవేశించింది. గడచిన నాలుగు నెలల కాలంలో ఈ పులి ఏకంగా 20 పశువులపై దాడులు చేసి చంపేయడంతో స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు రాజమహేంద్రవరం అటవీ డివిజన్ పరిధిలోని దట్టమైన అడవుల్లో, సరిహద్దు గ్రామాల్లో సంచరించిన పులి.. తన దిశను మార్చుకుంది.
Also Read : అమెరికా-ఇరాన్ మధ్య సంచలన ఒప్పందం..!
నిన్న ఏలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్ తో పాటు ఆర్.డి.పురం పరిసర ప్రాంతాలలో పులి అడుగుజాడలు కనిపించాయి. ఏలేరు జలాశయం సమీపంలో పులి కదలికలు ఉన్నాయన్న వార్తతో ఆ పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు, ప్రాణభయంతో ఇళ్ల నుండి బయటకు రావడానికి జంకుతున్నారు. పులి సంచారంపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. వేములోవ, పిడతమామిడి మరియు ఇతర ప్రభావిత గ్రామాలలో రక్షణ బృందాలు పర్యటించాయి.
Also Read : భారత్ లో టెస్లా మోడల్ వై ప్రీమియం ఆర్డబ్ల్యూడీ.. ధర ఎంత అంటే..!
పులి అడుగుజాడలను నిశితంగా పరిశీలిస్తూ, దాని కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఒంటరిగా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని, పశువులను అడవి వైపు తోలవద్దని హెచ్చరించారు. పులిని సురక్షితంగా బంధించేందుకు లేదా దాన్ని తిరిగి అడవిలోకి పంపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.

