“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు. జనులాపుత్రుని కనుగొని పొగడగ, పుత్రోత్సాహంబునాడు పుడుతుంది”.. అని సుమతీ శతకకారుని వచనం. అంటే.. ఏ తండ్రికైనా కుమారుడు జన్మించినంతనే ఆనందం కలుగదు. అతని మంచితనాన్ని, విద్యాబుద్ధులను, తెలివితేటలను చూసి ప్రజలు మెచ్చుకొన్ననాడే ఆ తండ్రికి నిజమైన సంతోషం కలుగుతుంది. అనేది ఈ వచనం అర్థం. అలాగే ‘పున్నామ నరకం నుంచి రక్షించే వాడు కొడుకు’.. అంటారు పెద్దలు. అంటే మరణించిన తర్వాత తర్పణాలు, శ్రాద్ధకర్మలు వంటివి చేయకపోతే వారు ‘పున్నామ నరకం’.. పునర్జన్మ చక్రం లేదా పూతి గంధ నరకంలో పడతారని పురాణాల నమ్మకం. వారసుడిగా కొడుకు ఈ కర్మకాండలు చేయడం ద్వారా తల్లిదండ్రుల ఆత్మలకు శాంతి చేకూరుతుందని నమ్ముతారు.
Also Read : కేబినేట్ ప్రక్షాళనకు మోడీ ప్లాన్.. తెలంగాణాకు పెద్ద పీట..?
ఇప్పుడు ఈ పురాణ ఇతిహాసాలు, శతక వచనాల గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఈ చర్చకు ప్రధాన కారణం.. ఓ కేంద్ర మంత్రి కుమారుడు చేసిన ఘనకార్యం. పుత్రుడు అనే మాట వినగానే.. ప్రస్తుతం అందరికీ గుర్తుకు వచ్చేది ఒకరే.. అతనే బండి భగీరథ్. పోక్సో కేసులో అరెస్టు అయిన బండి భగీరథ్ వ్యవహారం ఇప్పుడు తండ్రి బండి సంజయ్ పదవికి చుట్టుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో చక్రం తిప్పిన బండి సంజయ్.. తన కొడుకు కోసం చేసిన ఇప్పుడు నానా పాట్లు పడుతున్నారు. కొడుకుని రక్షించుకునేందుకు బండి సంజయ్ వ్యవహరించిన తీరు ఇప్పుడు ఆయన పదవికే ఎసరు పెట్టిందనే మాట తెలంగాణ రాజకీయాల్లో బాగా వినిపిస్తోంది.
కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విషయంలో బండి సంజయ్ వ్యవహరించిన తీరు పార్టీకి తీవ్ర నష్టం కలిగించిందని బీజేపీ అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. బండి వ్యవహారంపై ఇప్పటికే విపక్షాలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి కూడా. ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ పైన బీజేపీ పెద్దలపైన పదే పదే విమర్శలు చేస్తున్నారు. దీంతో వీటికి కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీ పెద్దలు రంగంలోకి దిగినప్పటికీ.. అది పెద్దగా ఫలితం చూపించలేదు. బండి భగీరథ్ కేసుతో బీజేపీకి సంబంధం లేదని టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ప్రకటన చేసినప్పటికీ.. భగీరథ్ అరెస్టు లేదా లొంగిపోయిన సమయంలో అతనితో ఉన్నది బీజేపీ లీగల్ సెల్ లాయర్లు. ఇది కూడా బీజేపీని ఇరుకున పెట్టింది.
Also Read : 59 ఏళ్ళ తర్వాత కేబినేట్ లోకి కాంగ్రెస్..!
బండి భగీరథ్ వ్యవహారానికి చెక్ పెట్టాలంటే.. కేవలం ఒకటే మార్గమని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సంజయ్ పైన వేటు. ఇప్పటికే ఈ వ్యవహారంపై బీజేపీ ఢిల్లీ పెద్దలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో పూర్తి నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. రాంచందర్ రావు ఆకస్మిక ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మంత్రి పదవి పోతుందనే సంకేతాలు ఇప్పుడు బండి సంజయ్ వర్గంలో కలవరం రేపుతున్నాయి. అందుకే బండి సంజయ్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని రాజకీయ వర్గాల్లో టాక్. ఆఘమేఘాల మీద బల ప్రదర్శన కోసం బీజేపీ కార్యాలయానికి బండి సంజయ్ వెళ్లటం వెనుక పార్టీ నుంచి వస్తున్న సంకేతాలే కారణమని తెలుస్తోంది. రెండు రోజుల్లో బండి సంజయ్‌ను మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశం ఉందని.. దీనిలో భాగంగానే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావును ఢిల్లీకి పిలిపించి, మొత్తం వ్యవహారంపై పూర్తి నివేదిక తీసుకున్నట్లు తెలుస్తోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో.. బండి భగీరథ్ వ్యవహారం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. దీంతో సంజయ్‌పై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించి.. ఆయన స్థానంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్‌లో ఒకరికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. బండి సంజయ్ కూడా తన పదవి కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసి.. విఫలమైనట్లు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం ఆయన ఎక్కడా కనిపించటం లేదని.. ప్రస్తుతం ఆయనకు తన పదవి కంటే కూడా.. కుమారుడిని కేసు నుంచి తప్పించడమే టార్గెట్ అన్నట్లుగా ఉన్నట్లున్నారనేది సన్నిహితుల మాట. సంజయ్‌ను తొలగిస్తే.. ఆ అవకాశం తమకే వస్తుందని సీనియర్ నేతలు భావిస్తున్నారు. దీంతో మంత్రి పదవిపై ఎవరి ప్రయత్నాలు వారు హైకమాండ్ స్థాయిలో ముమ్మరం చేసినట్లు సమాచారం.

