రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. అలాగని.. శాశ్వత శత్రువులు కూడా ఉండరు. ఎవరెవరి రాజకీయ అవకాశాల కోసం వారు.. ఆయా పార్టీలకు అనుకూలంగా మాట్లాడుతారు. అయితే కొందరు చాలా జాగ్రత్తగా రాజకీయ విమర్శలు మాత్రమే చేస్తారు. దీని వల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయనేది వారి భావన. కానీ వైసీపీ ఆవిర్భవించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజకీయ విమర్శలకంటే కూడా.. వ్యక్తిగత విమర్శలే ఎక్కువయ్యాయి. ఇంకా చెప్పాలంటే.. వ్యక్తిత్వ హననం, బూతులతో రెచ్చిపోవడం మొదలైంది. అధినేతలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు.. చివరికి మహిళా నేతలు, కార్యకర్తలపై కూడా నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీనియర్ నేతలు ఏ పార్టీలో ఉన్నా సరే.. వేడుకలో కానీ, సభలు, సమావేశాల్లో కానీ ఎదురుపడితే.. పరస్పరం మర్యాద పూర్వకంగా పలకరించుకుంటారు. కానీ ప్రస్తుతం రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నేతలు మాత్రం.. అలా కాదు. వాళ్లు ఏ పార్టీ నేతలైనా సరే.. తమ వ్యతిరేకులు ఎదురైతే.. కారాలు, మిరియాలు నూరుతుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు ఒంగోలు నియోజకవర్గం నేతలు. అక్కడ తొలి నుంచి పార్టీల మధ్య పోటీ అనే మాట కంటే కూడా.. వ్యక్తుల మధ్య పోటీ అనే మాట సరిగ్గా సరిపోతుంది. పోటీ చేసే నేతలు ఏ పార్టీలో ఉన్నా సరే.. తమ ప్రత్యర్థులపై ఒంగోలు గిత్త మాదిరిగా కయ్యానికి సై అంటారు.
Also Read: నిజంగానే జగన్ వెంట్రుక కూడా పీకలేరా.?
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో దామచర్ల జనార్థన్, బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య నిప్పు నెయ్యి మాదిరిగా పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా ఎన్నికలప్పుడే ఏ పార్టీ నేతలైనా సరే పరస్పరం విమర్శలు చేసుకుంటారు. కానీ ఒంగోలులో మాత్రం.. వీరిద్దరి మధ్య నువ్వా, నేనా అన్నట్లుగా ఉంటుంది. ఇది ఇప్పటి వైరం కాదు. బాలినేని కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి పరిస్థితి ఇంతే. దామచర్ల కుటుంబం తొలి నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతుంది. బాలినేని మాత్రం.. వైఎస్ కుటుంబంతో కలిసి ప్రయాణించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా వ్యవహరించారు. వైఎస్ మరణానంతరం జగన్ వెంట నడిచారు. వైసీపీలో చేరారు.
ఒంగోలు అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ అనటం కంటే కూడా.. దామచర్ల, బాలినేని అనటమే సమంజసంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇద్దరు ఒకరిపై ఒకరు మాటల దాడులతో పాటు భౌతిక దాడులకు దిగిన సందర్భాలున్నాయి. ఒకానొక సమయంలో బాలినేని నోరు జారారు కూడా. అయితే 2024 ఎన్నికల తర్వాత పరిస్థితి మారిపోయింది. బాలినేని వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. దీంతో ఈ ఇద్దరి మధ్య విభేదాలు తగ్గిపోతాయని అంతా అనుకున్నారు. కానీ.. ప్రభుత్వంలో ఉన్నా సరే.. చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకోవాల్సిందే.. అంటూ దామచర్ల జనార్థన్ చేసిన వ్యాఖ్యలు ఈ ఇద్దరి మధ్య వైరం కొనసాగుతుందని తేల్చేశాయి.
Also Read : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. ఏ ఏ శాఖలకు ఛాన్స్..?
తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు కూడా సీఎం చంద్రబాబు పైన విమర్శలు చేశారు బాలినేని. అయితే ఎక్కడా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. జనసేనలో చేరిన తర్వాత బాలినేనిని ఎమ్మెల్సీ చేస్తారని.. మంత్రిగా మళ్లీ అవకాశం వస్తుందనే ప్రచారం జరిగింది. కానీ అలాంటిది లేదని తేల్చేశారు పార్టీ నేతలు. ఇప్పుడు అనూహ్యంగా చంద్రబాబును కలవటం హాట్ టాపిక్‌గా మారింది.
చంద్రబాబును బాలినేని శ్రీనివాసరెడ్డి కలిసిన సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు, రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి, ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరంపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలిసింది. అలాగే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయడం, కార్యకర్తలకు మరింత ప్రాధాన్యత కల్పించడం, ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం పెంచడం వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.
రానున్న రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమి బలోపేతం, ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లే అంశాలపై కీలక చర్చలు జరిగినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీలో సుమారు రెండేళ్ళ క్రితం చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి టిడిపి అధినేత చంద్రబాబునాయుడును కలవడం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో సైతం ప్రాధాన్యత సంతరించుకుంది.

