ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయం వద్ద శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా డ్రోన్ కలకలం రేగింది. సచివాలయం పైభాగంలో గుర్తుతెలియని డ్రోన్ తిరుగుతోందంటూ సోషల్ మీడియాలో, కొన్ని వార్తా సంస్థల్లో ప్రచారం జరగడంతో భద్రతా వర్గాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. అయితే, దీనిపై ప్రభుత్వం మరియు పోలీసులు విచారణ జరిపి అసలు నిజాన్ని వెల్లడించారు. సచివాలయంపై డ్రోన్ తిరుగుతోందన్న వార్తలను పోలీసులు ప్రాథమిక విచారణ తర్వాత కొట్టిపారేశారు.
Also Read : ఇద్దరు సీఎంల ముద్దుల ఐఏఎస్ అధికారి..!
ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న ఒక వాణిజ్య విమానాన్ని చూసి, అది డ్రోన్ అని కొందరు పొరబడ్డారని అధికారులు స్పష్టం చేశారు. ఆకాశంలో కనిపిస్తున్న విమానాన్ని కావాలనే డ్రోన్‌గా చిత్రీకరించి తప్పుడు ప్రచారం చేశారని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో కలెక్టర్ల సదస్సు జరుగుతున్న సమయంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ విధమైన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
Also Read : చిక్కుల్లో పడ్డ స్టార్ స్పిన్నర్..!
ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వదంతులు సృష్టించారని అధికారులు మండిపడ్డారు. రాజధాని వంటి అత్యంత భద్రత కలిగిన ప్రాంతాల్లో ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం వల్ల అశాంతి నెలకొనే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో లేదా ఇతర మాధ్యమాల్లో బాధ్యతారాహిత్యంగా వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. అటు సిఎం చంద్రబాబు కూడా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను ఉపేక్షించబోమన్నారు.

