సాధారణంగా ఒక నానుడి ఉంది. అదేమిటంటే.. మనిషికో మాట.. గొడ్డుకో దెబ్బ అంటారు. అంటే అర్థం ఏమిటంటే.. మనిషి అయితే ఒక మాట చెబితే వినాలి.. అదే పశువు అయితే.. ఒక దెబ్బ కొడితే కదలాలి. కానీ ఎన్ని మాటలు చెప్పినా కూడా వినని వారిని ఏమనాలి.. చివరికి హైకోర్టు మొట్టికాయలు వేసినా కూడా మారలేదు అంటే.. ఇంక వారిని ఏమనాలి.. ఇప్పుడు ఇదే ప్రశ్న ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం.. వైసీపీ నేతలు తీరు మాత్రమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే వైసీపీ నేతల గేమ్ ప్లాన్ మాత్రం.. మామూలుగా లేదంటున్నారు.
Also Read : ప్రభుత్వాన్ని నడిపిస్తోంది ఎవరూ..?
సాధారణంగా తప్పు చేసిన వాళ్లు బుకాయిస్తారు.. లేదా తప్పు ఒప్పుకుంటారు. వైసీపీ నేతలు మొదటి రకం. వైసీపీ నేతలు తప్పు చేసినా కూడా తమదే పై చెయ్యి అనేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. తాము చేసేది తప్పు అని తెలిసినా కూడా సరే.. దానిని తప్పు అని ఒప్పుకోవటం లేదు. చివరికి హైకోర్టు కూడా వైసీపీ నేతలు చేసేది తప్పు అని చెప్పినా సరే.. ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు వైసీపీ నేతలు నానా పాట్లు పడుతున్నారు. దీనికి వారు ఎంచుకున్న మార్గం ఒకటే.. “అబద్ధం వందసార్లు చెబితే అదే నిజం అవుతుంది” అనే మాటను బాగా అనుకరిస్తున్నారు.
ప్రజలను నమ్మించాలంటే ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే.. ఏదో ఒక మూల దాని పట్ల అనుమానం మొదలవుతుంది కదా.. అనేది వైసీపీ నేతల గేమ్ ప్లాన్. అందుకే చెప్పిన మాటే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. డీఎస్సీ 2025 నిర్వహణలో అవకతవకలు జరిగాయని.. కాబట్టి ఇందుకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ఊరు వాడ వైసీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే రచ్చ రచ్చ చేస్తున్నారు. ధర్నాలు, నిరసనలు, నిరాహార దీక్షలు, ర్యాలీలు చేస్తున్నారు. ఇవన్నీ ప్రజల దృష్టిలో పడటానికే తప్ప.. మరోటి కాదనేది బహిరంగ రహస్యం.
నిజానికి తప్పు జరిగితే అది వెంటనే బయటపడుతుంది. ఇందుకు ఉదాహరణ నీట్ పరీక్ష. కేంద్రం నిర్వహించిన ఈ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు బయటకు తెలియటంతో వెంటనే దానిని రద్దు చేసిన కేంద్రం.. మళ్లీ నిర్వహించింది. పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కోసం విపక్షాలతో పాటు విద్యార్థులు కూడా ఆందోళన చేయడంతో తప్పని పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే డీఎస్సీ 2025లో అవకతవకలు జరిగినట్లు అభ్యర్థులు, వైసీపీ మినహా ఇతర రాజకీయ పార్టీల నేతలు కానీ కనీసం ఆరోపించటం లేదు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నేతలు ఆ విషయంలో పల్లెత్తు మాట అనటం లేదు. డీఎస్సీ పరీక్ష రాసి మార్కులు రాని ఒకరిద్దరు మినహా.. మిగిలిన వారెవరూ కనీస ఆరోపణలు కూడా చేయటం లేదు. ఇంకా చెప్పాలంటే అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్లు చెబుతున్నారు కూడా.
Also Read : స్కూల్స్ వద్ద నో జంక్ ఫుడ్.. గవర్నమెంట్ ఆర్డర్..!
కానీ వైసీపీ నేతలు మాత్రం.. మొత్తం పరీక్ష నిర్వహణ, నియామకాల్లో అవకతవకలు జరిగాయంటున్నారు. ఇక మరో అడుగు ముందుకు వేసిన వైసీపీ ఎమ్మెల్సీ.. సీబీఐ విచారణ జరిపించాలంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే సరైన ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలు మాత్రమే చేయడంతో.. ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అంతటితో ఆగకుండా.. ఇలాంటి తప్పుడు రాజకీయ ఆరోపణలకు హైకోర్టుకు వస్తే చర్యలుంటాయని కూడా ధర్మాసనం హెచ్చరించింది. అయినా సరే.. వైసీపీ నేతలు మాత్రం అవకతవకలు జరిగాయని.. సీబీఐ విచారణ జరిపించాలని.. నారా లోకేష్ రాజీనామా చేయలంటున్నారు. ఆ అవకతవకలేవో కోర్టులో చెబితే.. కోర్టు ద్వారా సీబీఐ విచారణ ప్రారంభిస్తుంది కదా అనే ప్రశ్నకు నీళ్లు నములుతున్నారు. ఓ వైపు ఎంపికైన అభ్యర్థులు, మరోవైపు ఎంపిక కానీ అభ్యర్థులు, మరోవైపు రాజకీయ పార్టీల నేతలు, చివరికి హైకోర్టు కూడా.. తప్పు జరిగినట్లు రుజువులు లేవని చెబుతున్నా.. వైసీపీ నేతలు మాత్రమే.. ప్రజల బుర్రలో ఒక అబద్ధాన్ని చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ పెద్దలు దీనిని సమర్థంగా తిప్పికొట్టకపోతే.. అబద్ధాన్ని కూడా ప్రజలు నిజమని నమ్మే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు.

