ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా నీట్ పేపర్ లీకేజీపై జెన్-జీ యువతతో కలిసి 37 రోజుల పాటు సుదీర్ఘ పోరాటం చేసిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు మరో భారీ పొలిటికల్ అటాక్‌కు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. ఈ సారి వారు నేరుగా దేశ ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ, ఈవీఎంలకు వ్యతిరేకంగా ఒక అతిపెద్ద దేశవ్యాప్త నిరసన ఉద్యమానికి తెరలేపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. “ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్ పేపరే ముద్దు” అనే ప్రధాన నినాదంతో కేంద్ర అధికార పక్షానికి హడల్ పుట్టించేలా వారు సరికొత్త వ్యూహాన్ని రచిస్తున్నారు.
Also Read : పక్కన పెడతారా.. ఉద్యమిస్తారా..? వారిదే నిర్ణయం
ఇటీవల మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సీజేపీ ఫౌండర్ అభిజీత్ దిప్కే దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థల తీరుపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ జవాబుదారీతనం ప్రమాదంలో పడిందని, ఈ వ్యవస్థను నిలదీయకపోతే ఎన్నికల మ్యానిప్యులేషన్స్ ఆగవని ఆయన హెచ్చరించారు. టెక్నాలజీ పేరుతో ఓట్లను మ్యానిప్యులేట్ చేసే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, పాత పద్ధతిలోనే బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌తో సీజేపీ దేశవ్యాప్త నిరసనలకు సిద్ధమవుతోంది.
Also Read : పొగాకు రైతులపై జగన్ మొసలి కన్నీళ్లు..!
రాబోయే సెప్టెంబర్ నెల నుండి ప్రారంభం కాబోతున్న ఈ “క్యా బోల్తీ పబ్లిక్” అనే దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఈవీఎంలకు వ్యతిరేకంగా ప్రజల నుండి పెద్ద ఎత్తున సంతకాల సేకరణ మరియు నిరసన కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు. తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని, కేవలం ఒక పవర్‌ఫుల్ ప్రెజర్ గ్రూప్ లాగా ఉంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని సీజేపీ స్పష్టం చేసింది. నీట్ స్కామ్‌పై పోరాడి కేంద్ర మంత్రి రాజీనామాకు కారణమైన ఈ జెన్-జీ యువత.. ఇప్పుడు ఈవీఎంలపై పోరాటానికి సిద్ధమవడంతో ఢిల్లీ వర్గాల్లో తీవ్ర కలవరం మొదలైంది.

