ఇరాన్ లో అంతర్గత తిరుగుబాటు సృష్టించి, అక్కడి ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ వేసిన ఒక భారీ రహస్య వ్యూహం ఘోరంగా విఫలమైంది. ఈ ఆపరేషన్ దారుణంగా ఫెయిల్ అవ్వడంతో.. కొత్తగా బాధ్యతలు చేపట్టిన మొసాద్ డైరెక్టర్ రోమన్ గోఫ్‌మన్ ఈ ప్లాన్ వెనుక ఉన్న ఇద్దరు అత్యంత సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారులను పదవుల నుండి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్-ఇరాక్ సరిహద్దుల్లోని కుర్దిష్ గ్రూపుల ద్వారా దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించి, ఇరాన్ పాలకులను అంతం చేయాలనేది ఈ వ్యూహం యొక్క ముఖ్య ఉద్దేశం.
Also Read : డీలిమిటేషన్‌కు జెన్-జీ ఎఫెక్ట్..!
ఈ రహస్య ఆపరేషన్‌లో భాగంగా ఇరాన్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత, ఆ దేశ బాధ్యతలను ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహ్మూద్ అహ్మదీనెజాద్‌కు అప్పగించాలని మొసాద్ ప్రణాళిక రచించినట్లు లీకులు వచ్చాయి. అయితే ఈ వ్యూహంపై అమెరికా అధికారులు గతంలోనే హెచ్చరిస్తూ.. ఇరాన్ ప్రభుత్వం అంత తేలిగ్గా కూలిపోదని, ఇజ్రాయెల్ అంచనాలు మితిమీరిన ఉత్సాహంతో కూడుకున్నవని పేర్కొన్నారు. చివరికి ఆపరేషన్ వివరాలు ముందే లీక్ అవ్వడం, టర్కీ దేశం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించడంతో ఇజ్రాయెల్ మాస్టర్ ప్లాన్ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయింది.
Also Read : బెజవాడ మేయర్ పీఠంపై బొండా ఉమా కన్ను..?
మొసాద్ ప్లాన్ ఫెయిల్ అవ్వడమే కాకుండా.. ఇరాన్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇరాన్ మిలిటరీ మరియు ఎయిర్ డిఫెన్స్ స్థావరాల రహస్య సమాచారాన్ని సేకరిస్తున్న 21 మంది మొసాద్ ఏజెంట్లను కెర్మన్ ప్రావిన్స్‌లో ఇరాన్ నిఘా వర్గాలు రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశాయి. ఈ సమాచారమంతా లీక్ అవ్వడంతో మొసాద్ నెట్‌వర్క్ బద్దలై, ఇజ్రాయెల్ రక్షణ వర్గాల్లో తీవ్ర కలవరం మొదలైంది. ఈ అంతర్జాతీయ వైఫల్యం మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో ఇజ్రాయెల్‌కు తీవ్ర ఎదురుదెబ్బగా మారింది.

