Monday, May 4, 2026 07:47 PM
Monday, May 4, 2026 07:47 PM

బెంగాల్‌.. కమల వికాసం.. దీదీ విలాపం

మినీ సార్వత్రిక ఎన్నికలుగా పరిగణించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. అంచనాలకు అందని రీతిలో ప్రజలు తీర్పు ఇచ్చారు. అధికార పార్టీలే మళ్లీ గెలవనున్నాయని మెజారిటీ ప్రీ పోల్ సర్వేలు అంచనా వేసినా.. పోలింగ్ అనంతరం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత వెల్లువెత్తింది. ఫలితంగా అసోం, పుదుచ్చేరిలలో తప్ప మూడు ప్రధాన రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళంలో అధికార పార్టీలను ఓటర్లు పూర్తిగా తిరస్కరించారు. పశ్చిమబెంగాల్‌లో టార్గెట్ దీదీ ఫలించి కమలం జెండా ఎగిరింది. తమిళనాడులో చాలా దశాబ్దాల తర్వాత ద్రవిడవాదం ఓడిపోయింది. సినీనటుడు విజయ్ పార్టీ టీవీకే విజయహాసం చేస్తోంది.

Also Read : కేరళం.. యూడీఎఫ్ హిట్.. ఎల్‌డీఎఫ్ అవుట్..!

సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లో అధికారం చేపట్టాలని ఎప్పటినుంచో టార్గెట్ పెట్టుకున్న భారతీయ జనతాపార్టీ.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఎట్టకేలకు ఈ ఎన్నికల్లో ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా దూసుకుపోతున్నది. 2021 ఎన్నికల్లోనే తృణమూల్ కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఆమడదూరంలో నిలిచిపోయిన బీజేపీ ఈసారి మాత్రం అనుకున్నది సాధించింది. బీజేపీ దెబ్బకు హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టించి నాలుగోసారి వరుసగా ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఆశించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పూర్తిగా భంగపడ్డారు. తొలి రౌండ్ నుంచే బీజేపీ కూటమి విజయం ఖాయమైంది. రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఫల్తా నియోజకవర్గం మొత్తం మీద ఎన్నికల సంఘం రీపోలింగ్‌కు ఆదేశించడంతో 293 స్థానాల్లోనే లెక్కింపు ప్రారంభమైంది.

ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 148 సీట్ల సింపుల్ మెజారిటీ అవసరం కాగా.. బీజేపీ కూటమి 190కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గత ఎన్నికల్లో 215 స్థానాలతో అపూర్వ విజయం సాధించిన మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఈసారి మాత్రం చాలా స్థానాలను కోల్పోయింది. అధికారంలోకి వస్తామని ధీమాగా చెప్పిన దీదీ పార్టీ వంద లోపు స్థానాలతో సరిపెట్టుకుంది. భవానీపూర్‌ నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కూడా మొదట్లో తన సమీప ప్రత్యర్థి బీజేపీ నేత సువేందు అధికారి కంటే వెనుకబడినా.. తర్వాత పుంజుకుని ఆధిక్యంలోకి వచ్చారు. అయితే ఆమె కేబినెట్‌లోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఓడిపోయారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీని ఓడించి సంచలనం సృష్టించిన సువేందు అధికారి ఈ ఎన్నికల్లో కూడా అక్కడే పోటీ చేసి విజయం సాధించారు.

Also Read : కేరళ సీఎం అయ్యేది ఎవరు..? శశి థరూర్ కష్టమేనా..?

బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు సర్ ద్వారా బంగ్లాదేశీల ఓట్లు తొలగించడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నిజానికి ఇవన్నీ బీజేపీ వ్యతిరేక ఓట్లు. బంగ్లాదేశ్ నుంచి దొంగ చాటుగా భారత్‌లో చొరబడిన వారికి ఓటు హక్కు కల్పించారు. సరైన పత్రాలు లేకపోయినా కూడా అలాంటి వారంతా బెంగాల్‌లో ఓటర్లుగా ఉన్నారు. ఇలాంటి వారిని తరిమేయాలని బీజేపీ తొలి నుంచి డిమాండ్ చేస్తున్నప్పటికీ.. తృణమూల్ కాంగ్రెస్ మాత్రం వారికి అండగా నిలిచింది. అయితే ఎన్నికల కమిషన్ సర్ ద్వారా బంగ్లాదేశీల ఓట్లు తీసేయడంతో బీజేపీ గెలుపు సునాయాసమైందంటున్నారు రాజకీయ విశ్లేషకలు. అలాగే వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన మమత బెనర్జీపైన, తృణమూల్ కాంగ్రెస్ నేతలపైన పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. హిందువులపై దాడులను బీజేపీ బాగా ఫోకస్ చేయడం కూడా దీదీ ఓటమికి కారణం. బెంగాల్‌లో దీదీని ఓడించేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డిదనే చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్‌లో ర్యాలీలు నిర్వహించడం, ఎన్నికల ముందు రోజు కూడా హోరా బ్రిడ్జి సమీపంలో బోటు షికారు.. ఇలా బెంగాల్ ఓటర్లను కమలం వైపు మళ్లించేందుకు చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయనే చెప్పాలి. మొత్తానికి హ్యాట్రిక్ విజయాలతో మోదీ సర్కార్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దీదీని ప్రతిపక్షానికి పరిమితం చేసి.. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా విస్తరించేందుకు బీజేపీ అడుగు ముందుకు పడింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఓటమి దిశగా ముగ్గురు...

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌...

విజయ్‌‍కు ఏఐఏడీఎంకే మద్దతు...

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు...

తమిళనాట రాజకీయ సంచలనానికి...

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌కు...

తమిళనాట ఎన్నికల ఫలితాలు.....

తమిళ రాజకీయాల్లో గత కొన్నాళ్ళుగా ఆసక్తి...

కల్తీ నెయ్యిలో వైవీ...

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కుంభకోణంపై...

సీఐని సస్పెండ్ అయ్యే...

పల్నాడు జిల్లా వినుకొండలో ఒక పోలీస్...

పోల్స్