కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన రాజ్యాంగ 131వ సవరణ బిల్లు అవసరమైన ప్రత్యేక మెజారిటీ సాధించ లేకపోవడంతో తిరస్కరణకు గురైంది. లోక్‌సభలో జరిగిన ఓటింగ్ ప్రక్రియలో మొత్తం 528 మంది లోక్‌సభ సభ్యులు పాల్గొన్నారు. బిల్లుకు అనుకూలంగా 298 మంది ఓటు వేయగా, వ్యతిరేకంగా 230 మంది సభ్యులు ఓటేశారు. మూడింటా రెండొంతుల మెజారిటీ సాధించలేక వీగిపోవడంతో మహిళా రిజర్వేషన్లతో పాటు డీలిమిటేషన్ ఆశలకు కూడా బ్రేక్ పడింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న లక్ష్యంతో పాటు నియోజకవర్గాల పెంపు ద్వారా రాజకీయ సమీకరణాలు మారిపోతాయనే అంచనాలు ఒక్కసారిగా ఆగిపోయాయి.
Also Read : ఏపీకి మరో భారీ పరిశ్రమ.. పారిశ్రామిక హబ్ గా మారుతున్న ఉత్తరాంధ్ర..!
డీలిమిటేషన్ బిల్లుకు బ్రేకులు పడటంతో నేతల ఆశలు ఆవిరయ్యాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్ విభజన ఉంటుందని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటించారు. అదే సమయంలో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని.. ప్రతి రాష్ట్రంలో సీట్ల సంఖ్య 50 శాతం పెరుగుతుందని ప్రకటించారు. దీని వల్ల ప్రస్తుతమున్న సభ్యుల సంఖ్యా శాతం పెరుగుతుంది తప్ప.. తగ్గదన్నారు. అయితే ఈ ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ మినహా మిగిలిన దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వ వైఖరినీ తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
డీలిమిటేషన్ బిల్లుకు బ్రేకులు పడటంతో.. నేతల ఆశలకు బ్రేకులు పడ్డాయి. డీలిమిటేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలు సంఖ్య 25 నుంచి 38కి పెరుగుతుందని.. శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 175 నుంచి 263కు పెరుగుతాయని అంతా భావించారు. ఈ పెంపు 2029 ఎన్నికల నుంచే అమలు అవుతుందని అంతా భావించారు. కొంతమంది అయితే కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలివే అంటూ ఓ జాబితా కూడా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు నేతలంతా ఇప్పటి నుంచే సన్నాహాలు కూడా చేసుకున్నారు. కొన్ని చోట్ల రిజర్వేషన్లను కూడా నేతలే నిర్ణయించుకున్నారు. ఇది మహిళలకు, అది ఎస్సీలకు అంటూ వారికి వారే సొంత లెక్కలు వేసుకున్నారు.
Also Read : పాక్ పర్యటనకు ట్రంప్.. అది జరిగితేనే వస్తా..!
కానీ ఇప్పుడు ఈ బిల్లులు వీగిపోవడంతో నేతల ఆశలకు బ్రేకులు పడినట్లు అయ్యింది. కొత్త నియోజకవర్గాల ద్వారా కొత్త నాయకత్వానికి అవకాశం వస్తుందని అంతా భావించారు. ఎంతో మంది ఆశావహులు ఈసారి తమకు అవకాశం ఖాయమని గంపెడాశలు పెట్టుకున్నారు. ఇప్పుడు వారి ఆశలన్నీ గల్లంతయ్యాయి. కొత్తగా రాజకీయాల్లోకి రావాలని భావించిన యువ నాయకులు, స్థానిక స్థాయిలో ఆశావహులు ఈ నిర్ణయంతో నిరాశకు గురవుతున్నారు. మహిళా రిజర్వేషన్‌తో పాటు డీలిమిటేషన్ కూడా ముందుకు సాగకపోవడంతో రాజకీయ సమీకరణలు ఇప్పట్లో మారే అవకాశం లేదని తేలిపోయింది. దీంతో తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటనే చర్చలు మొదలయ్యాయి. మొత్తానికి మహిళా సాధికారత దిశగా కీలక మలుపుగా భావించిన బిల్లు వీగిపోవడం, దేశ వ్యాప్తంగా మహిళల రాజకీయ ఆశలకు తాత్కాలిక బ్రేక్ పడినట్లు అయ్యింది.

