తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు వరుసగా అగ్నిప్రమాదాలకు గురవుతున్న అంశం ప్రభుత్వాలను కలవరపెడుతున్నాయి. ప్రయాణీకులను సజీవ దహనం చేస్తున్న ఘటనలు గుండెల్ని పిండేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు జరిగిన ఘోర ప్రమాదాల్లో పదుల సంఖ్యలో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అయినా సరే పొరుగు రాష్ట్రాల ప్రైవేటు బస్సుల మాఫియా తీరులో మాత్రం మార్పు రావడం లేదు. నిబంధనలను తుంగలో తొక్కి అధికారుల కళ్లు గప్పి రోడ్లపై తిరుగుతున్న ఈ మత్యు శకటాలు ఎప్పుడు ఎవరి ప్రాణాలను బలి తీసుకుంటాయో తెలియక ప్రయాణీకులు వణికిపోతున్నారు.
Also Read : డీలిమిటేషన్ తెలుగు రాష్ట్రాలకు నష్టమేనా..?
తాజాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ ట్రావెల్ సంస్థల తీరుపై తెలుగు రాష్ట్రాల బస్సుల యజమానుల సంఘం తీవ్ర ఆరోపణలు చేసింది. ‘శ్యామోలి పరివాహన్’ వంటి సంస్థలు అధిక లాభాల కోసం బస్సుల నిర్మాణాన్ని అడ్డగోలుగా మార్చేస్తూ, కనీస భద్రతా ప్రమాణాలను విస్మరిస్తున్నాయని.. సంచలన ఆరోపణలు చేసింది. అదనపు సీట్ల కోసం చేసే అక్రమ మార్పులు, అత్యవసర ద్వారాల తొలగింపు వంటి అంశాలు ప్రయాణీకుల ప్రయాణాన్ని చావు అంచుల్లోకి నెట్టేస్తున్నాయని ఏపీ బస్ యజమానులు ఆరోపిస్తున్నాయు. శ్యామోలి పరివాహన్ ట్రావెల్స్ మాఫియా లాభార్జనే ధ్యేయంగా సామాన్య ప్రయాణీకుల ప్రాణాలను పణంగా పెడుతోందన్నారు. లగ్జరీ సర్వీసుల పేరుతో అధిక ధరలు వసూలు చేస్తున్నారని.. మరోవైపు బస్సుల నిర్మాణంలో కనీస భద్రతా ప్రమాణాలను గాలికొదిలేస్తున్నారన్నారు. ‘శ్యామోలి’ సంస్థ నిర్వహిస్తున్న వోల్వో మల్టీ-యాక్సిల్ బస్సుల్లో జరుగుతున్న అడ్డగోలు ఉల్లంఘనలపై ఏపీ, తెలంగాణ బస్ ఓనర్స్ అసోసియేషన్ విజయవాడ రవాణా శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది.
అసోసియేషన్ తన ఫిర్యాదులో పేర్కొన్న ప్రధాన అంశాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ నిబంధనల ప్రకారం వోల్వో 9600 శ్రేణి బస్సుల్లో కేవలం 40 స్లీపర్ బర్త్‌లకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ, ఈ సంస్థ ప్రైవేట్ బాడీ బిల్డర్ల ద్వారా బస్సు లోపలి అమరికను మార్చి, సీట్లు, స్లీపర్లను కలిపి ఏకంగా 58 మంది ప్రయాణం చేసేలా మార్పులు చేసింది. 58 మంది ప్రయాణించే ఈ భారీ బస్సుల్లో అత్యవసర సమయంలో బయటపడేందుకు కేవలం కుడి వైపున ఒకే ఒక ద్వారం ఉందని.. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ప్రయాణీకులు సజీవ దహనం అయ్యే అవకాశం ఉందని తమ ఫిర్యాదులో స్పష్టం చేశారు.
ఈ ఉల్లంఘనలకు పాల్పడుతున్న బస్సులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. గంటకు 120 కిలోమీటర్ల వేగ పరిమితిని మించి ఈ బస్సులు ప్రయాణిస్తున్నాయని.. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానంగా బెంగాల్‌కు చెందిన శ్యామోలితో పాటు కర్ణాటకకు చెందిన ట్రావెల్స్ సంస్థలపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో స్పష్టం చేశారు.
Also Read : అమెరికా ఫ్లైట్ ఎక్కనున్న కేసీఆర్.. రీజన్ ఇదేనా..?
అయితే రాష్ట్ర సరిహద్దులు దాటి వందల కిలోమీటర్ల మేర ఈ మృత్యు శకటాలు యథేచ్చగా తిరుగుతున్నా రవాణా శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సీటింగ్ సామర్థ్యాన్ని పెంచినా, పర్మిట్ నిబంధనలను తుంగలో తొక్కినా చెక్ పోస్టుల వద్ద అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. గతంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదాల నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా, ఇప్పటికీ మామూళ్ల మత్తులో జోగుతూ తనిఖీలను గాలికొదిలేయడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ప్రైవేట్ ఆపరేటర్ల కాసుల కక్కుర్తికి అధికారులు వత్తాసు పలుకుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మేల్కొని ఈ దందాపై ఉక్కుపాదం మోపకపోతే రేపు జరగబోయే అనర్థాలకు రవాణా శాఖాధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

