Wednesday, February 4, 2026 11:09 AM
Wednesday, February 4, 2026 11:09 AM

లోకేష్ పై క్లాస్, మాస్ ముద్రలు..!

“మాస్” లీడర్‌గా ఎదగాల్సిన లోకేష్.. “క్లాస్” లీడర్ షిప్‌కే పరిమితం అయ్యారా..! తాత దివంగత ఎన్టీఆర్ మాదిరిగా “మాస్” లీడర్‌గా ఎదిగే అవకాశం కలిసొచ్చినా కూడా.. తండ్రి చంద్రబాబును ఆదర్శంగా తీసుకున్న లోకేష్ “క్లాస్” లీడర్ అయ్యారా..! కాలం కలిసోచ్చింది.. అందుకు అదృష్టం కూడా తోడు అయ్యింది.. అధికారం దక్కింది.. వీటన్నిటిని అనుకూలంగా మలుచుకుంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ ప్రస్తుతం లోకేష్ తీరును దగ్గరగా గమనిస్తున్న వారు మాత్రం.. భవిష్యత్తు యువ నాయకుడు.. ఎదిగే అవకాశాన్ని లోకేష్ వదులుకుంటున్నారేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read : దావోస్ మ్యాన్.. చంద్రబాబు ఊహించని గౌరవం..!

లీడర్‌లలో రెండు రకాల లీడర్లు ఉంటారు. ఒకరు క్లాస్ అయితే.. మరొకరు మాస్. ఎన్‌టీఆర్, వైఎస్ఆర్ అంటే మాస్ లీడర్ అనే పేరు. వాళ్లు మైక్ ముందుకు వస్తే చాలు.. జనం తమని తాము మర్చిపోయే వాళ్లు. ఎన్‌టీఆర్ ఎన్నికల ప్రచారం కోసం వస్తున్నారనే విషయం తెలుసుకున్న జనం.. రోజుల తరబడి పడిగాపులు కాశారంటే.. ఆయనకు ప్రజల్లో ఉన్న ఇమేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆయన కాలం చేసి 30 ఏళ్లు అయినా కూడా.. ఇప్పటికీ N T R అనే మూడు అక్షరాలు ఒక బ్రాండ్‌గా మిగిలిపోయాయి. ఎన్‌టీఆర్ తర్వాత కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి వంటి నేతలు వచ్చినా కూడా.. కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకోలేక పోయారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం.. తన పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లారు. తన హావభావాలు, మాట తీరుతో ఓటర్లను ఆకట్టుకున్నారు. చెల్లెమ్మ, అక్కయ్య, తమ్ముడు.. అంటూ మాస్ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ఇప్పటికీ ఎన్‌టీఆర్, వైఎస్‌ఆర్ అంటే ప్రజల్లో ఓ గుర్తింపు ఉంది.

అయితే ఎన్‌టీఆర్ తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు కేవలం క్లాస్ లీడర్‌గా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్నారు. ఐటీ, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో చర్చలు, ఐటీ ప్రమోషన్, హైటెక్ సిటీ నిర్మాణం.. ఇలా బాబు మాటలు కూడా పూర్తిగా మాస్‌ను దూరం చేశాయి. చివరికి చంద్రబాబుకు ఏపీ సీఈవో అనే బ్రాండ్ రావడం కూడా మాస్ దూరమవ్వడానికి ఓ కారణం. ఒక దశలో చంద్రబాబును హైటెక్ సీఎం అని కాంగ్రెస్ నేతలు అభివర్ణించారు కూడా. ఇది ఒక వర్గానికే చంద్రబాబును పరిమితం చేసింది. ఇక తండ్రి వైఎస్‌ఆర్ మాదిరిగా మాస్ లీడర్‌గా ఎదిగే అవకాశం జగన్‌కు కలిసి వచ్చిందనే చెప్పాలి. పాదయాత్ర చేస్తున్న సమయంలో.. అవ్వా, తాతా అంటూ మాటలతో ఆకట్టుకున్నారు జగన్. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తీరు పూర్తిగా మారిపోయింది. సామాన్యులను కాదు కదా.. కనీసం పార్టీ నేతలకు కూడా దర్శనాలు లేవు. పరదాల మధ్య ప్రయాణం, ప్యాలెస్ రాజభోగాలు జగన్‌కు మాస్ లీడర్ బ్రాండ్‌ దూరం చేశాయి. అధికారం అనే అహంకారం కారణంగా జగన్ మాస్ ప్రజలకు దూరమయ్యారనేది వాస్తవం.

Also Read : సంచలన నిర్ణయం దిశగా జగన్ అడుగులు..!

తాత ఎన్‌టీఆర్ మాదిరిగా మాస్ లీడర్‌గా ఎదిగే అవకాశాన్ని లోకేష్ చేజార్చుకున్నారా.. అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. నిజానికి 2014లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అనూహ్యంగా లోకేష్‌కు మంత్రి పదవి వరించింది. అప్పటి వరకు లోకేష్ చాలా తక్కువ మందికే తెలుసు. అయితే వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా కించపరిచే వ్యాఖ్యలు చేయటంతో.. లోకేష్ రాటు దేలారు. కుటుంబ సభ్యులను కించపరిచేలా వ్యాఖ్యానించడం.. నిక్ నేమ్ పెట్టడం.. బాడీ షేమింగ్.. ఇలాంటి తట్టుకున్నారు. యువగళం పాదయాత్రతో తనపై కామెంట్లు చేసిన వారికి తనదైన శైలిలోనే జవాబిచ్చారు. మాస్ డైలాగ్‌లతో, హావభావాలతో ఆకట్టుకున్నారు. పోలీసులకు వార్నింగ్, వైసీపీ నేతలకు తొడగొట్టి సవాల్ విసరటం.. ఇలా చేయడంతో.. టీడీపీ కార్యకర్తలు లోకేష్‌ను ఓన్ చేసుకున్నారు. ప్రతి కార్యకర్తను ఆప్యాయంగా పలకరించిన లోకేష్.. భుజం మీద చెయ్యి వేసి ఫోటోలు దిగారు. దీంతో.. కార్యకర్తలు ఉప్పొంగి పోయారు.

కానీ.. ఇప్పుడు ఆ మాస్ బ్రాండ్ నిలబెట్టుకోవడంలో లోకేష్ విఫలమవుతున్నారనే మాట పొలిటికల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తోంది. కలిసి వచ్చిన అవకాశాన్ని లోకేష్ తనకు అనుకూలంగా మలుచుకోవటం లేదా.. అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. తండ్రి బాటలోనే లోకేష్ కూడా కేవలం కార్పొరేట్‌ వ్యవస్థకే పరిమితం అయ్యారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విదేశీ పర్యటనలు, దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ.. ఇవి రాష్ట్రానికి మేలు జరిగే పనులే అయినప్పటికీ.. సామాన్యులకు మాత్రం లోకేష్ దూరమవుతున్నారనే మాట బాగా వినిపిస్తోంది. తెలిసో, తెలియకో.. సొంత పార్టీ కార్యకర్తలకు దూరం అవుతున్నారనేది వాస్తవం. పార్టీ నేతలు, కార్యకర్తలతో లోకేష్ భేటీ అవటం లేదనేది సగటు టీడీపీ అభిమాని అసంతృప్తి.

Also Read : షర్మిల మౌనం… మార్పుకు సంకేతమా?

ఈ విషయంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లెక్క ఇప్పటి వరకు తప్పలేదు. ఎన్నికల ముందు తన ప్రసంగాలతో ఆకట్టుకున్న పవన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పంచ్ డైలాగ్‌లను వదలటం లేదు. పైగా ఇప్పటికీ సినిమాలతో తన అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. అలాగే అవకాశం వచ్చినప్పుడు మాజీ సీఎం జగన్ సహా వైసీపీ నేతలకు మాస్ వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. దీంతో పవన్‌కు మాస్‌లో మరింత అభిమానం పెరుగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ తమకు దూరమవుతున్నారనే భావన కిందిస్థాయి కార్యకర్తల్లో ఉందనేది సర్వే సంస్థల నివేదిక. ఇదే విషయాన్ని పార్టీలోని పలువురు సీనియర్ నేతలు కూడా ఇప్పటికే బాహాటంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తనపై పడిన క్లాస్ లీడర్ ముద్రను తొలగించి.. మాస్ లీడర్‌గా మారాలంటే.. తాత ఎన్టీఆర్‌ను లోకేష్ ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్