కన్నడ కుర్చీపై క్లారిటీ వచ్చేసింది. రెండు రోజులుగా కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై వస్తున్న పుకార్లకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెక్ పెట్టారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు లేదని తేల్చేశారు. ఐదేళ్ల పాటు సిద్ధరామయ్య కొనసాగుతారన్నారు డీకే. తాను సిద్ధరామయ్యతో కలిసి పని చేస్తానని కుండ బద్దలు కొట్టిన డీకే.. పార్టీ హైకమాండ్ చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానంటూ తేల్చేశారు. దీంతో కర్ణాటకలో సీఎం మార్పు అంటూ జరుగుతున్న ప్రచారానికి డీకే శివకుమార్ అడ్డుకట్ట వేసినట్లు అయ్యింది.
Also Read : బ్రేకింగ్: లిక్కర్ స్కామ్ లో అప్రూవర్లుగా కీలక నిందితులు
2023 మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 141 స్థానాలతో అతి పెద్ద పార్టీగా నిలిచింది. ఇండియా కూటమి మొత్తం 145 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఎన్‌డీఏ కూటమికి 81 స్థానాలు మాత్రమే వచ్చాయి. బీజేపీ 63 స్థానాల్లో గెలవగా.. జేడీఎస్ 18 స్థానాలు సొంతం చేసుకుంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం కోసం పెద్ద కసరత్తు చేసింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి కుర్చీపై ఎవర్ని కూర్చొబెట్టాలనే విషయంలో పలుమార్లు తర్జనాభర్జనా చేశారు కాంగ్రెస్ పెద్దలు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డీకే శివకుమార్ ఎంతో ఖర్చు పెట్టారు. ఇక డీకేను టార్గెట్ చేస్తూ.. నాటి బీజేపీ సర్కార్.. ఐటీ దాడులు, ఈడీ సోదాలంటూ నానా హంగామా చేసింది. అయినా సరే.. డీకే మాత్రం వెనకడుగు వేయలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు అన్ని విధాలుగా డీకే అండగా ఉన్నారు. అటు పార్టీ పెద్దలతో మంతనాలు మొదలు.. టికెట్ల కేటాయింపు వరకు డీకే కీలక పాత్ర పోషించారు. దీంతో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే డీకే శివకుమార్ సీఎం అభ్యర్థి అనే ప్రచారం కూడా జరిగింది.
Also Read : కరువు రహిత రాష్ట్రమే చంద్రబాబు లక్ష్యం
ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. 2013-18 మధ్య సీఎంగా వ్యవహరించిన సిద్ధరామయ్య మరోసారి తెరపైకి వచ్చారు. తనకే సీఎం పదవి కావాలని పట్టుబట్టారు. ఇందుకు తన కులబలం ప్రయోగించారు. కురుబ గౌడ కులం కర్ణాటకలో అతిపెద్ద వెనుకబడిన తరగతులకు చెందినది. సిద్ధరామయ్యకు తొలి నుంచి కురుబ గౌడ కులం అండగా నిలిచింది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా సిద్ధరామయ్యను కాదని ముందుకు అడుగు వేయలేకపోయింది. దీనిపై డీకే వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. సీఎం కుర్చీలో తొలి రెండున్నరేళ్ల పాటు సిద్ధరామయ్య, తర్వాత రెండున్నరేళ్ల పాటు డీకే శివకుమార్ కూర్చుంటారనే మాట అప్పట్లో బాగా వినిపించింది. దీంతో తనకు సీఎం పదవి కావాలంటూ డీకే మరోసారి ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరిపారనే వార్తలు కూడా వెలువడ్డాయి. దీనిపై క్లారిటీ ఇచ్చిన డీకే.. కర్ణాటకలోని 140 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తన ఎమ్మెల్యేలే అని.. అందరినీ ఒక గ్రూపుగా ఏర్పాటు చేయడం తన రక్తంలో లేదన్నారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పూర్తిగా పాలిస్తారని.. ఆయనతోనే తామంతా కలిసి పని చేస్తామని తేల్చేశారు. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించేందుకు మాత్రమే ఢిల్లీకి వచ్చినట్లు తేల్చేశారు. దీంతో.. డీకే శివకుమార్ సీఎం ఆశలు అడియాశలే అని తేలిపోయింది.

