ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తి. చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు కూడా. చంద్రబాబు వెంటే ఉన్నారు.. ఆయన మాటే.. ఈయన మాట అన్నట్లుగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబును అంటి పెట్టుకునే ఉన్నారు. బాబు గారి ఆశీస్సులతోనే రాజ్యసభకు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా కూడా కీలక పదవులు నిర్వహించారు. ఇదే సమయంలో పక్కా పారిశ్రామిక వేత్తగా ఆయనకు పేరు. అధికారం అండతో రాజకీయంగా, ఆర్థికంగా లబ్ది పొందారనేది బహిరంగ రహస్యం. ఒకదశలో ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో కూడా ఆయనే కీలకం. 2019 ఎన్నికల సమయంలో పార్టీకి ఆర్థికంగా అండగా ఉన్నారంటారు. అందుకే అభ్యర్థుల ఎంపిక కూడా ఆయనే దగ్గరుండి చూసుకున్నారు.
Also Read : మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..? పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్..!
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఇందుకు ప్రధాన కారణం.. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక సరిగ్గా లేదనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఇన్ని విమర్శలు వచ్చినా కూడా చంద్రబాబు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఓడిందో.. చంద్రబాబు అధికారం కోల్పోయారో.. వెంటనే సదరు కేంద్ర మాజీ మంత్రి గారు ప్లేట్ ఫిరాయించారు. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆఘమేఘాల మీద భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయనతో పాటు మరో నలుగురిని కూడా తీసుకుపోయారు. అంతే.. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి గుర్తింపు కూడా లేకుండా చేశారు.
ఆయన అసలు పేరు చాలా మందికి తెలియదు. ఆయన అసలు పేరు మాత్రం యలమంచిలి సత్యనారాయణ చౌదరి. కానీ ఆయనను అంతా ముద్దుగా సుజనా చౌదరి అని పిలుస్తారు. చంద్రబాబు కష్టాల్లో ఉన్న సమయంలో వదిలేసి వెళ్లిపోయిన సుజనా.. అప్పటి నుంచి పూర్తిగా దూరంగానే ఉన్నారంటున్నారు పార్టీ పెద్దలు. టీడీపీ నేతలను జగన్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే.. చివరికి చంద్రబాబును అక్రమ కేసులో అరెస్టు చేసినప్పుడు కూడా సుజనా కనీసం స్పందించలేదు. బాబు వల్లే రాజకీయంగా ఎదిగిన సుజనా.. అదే చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో కానీ.. ఆ తర్వాత కానీ.. ఆయనను పరామర్శించలేదు.
ఇక 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. దీంతో సుజనా చౌదరికి కాషాయ పెద్దలు ఓ ఛాన్స్ ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేసిన సుజనా చౌదరి.. టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తల అండతోనే 47 వేల ఓట్లకు పైగా మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి మళ్లీ తన మార్కు రాజకీయం ప్రారంభించారు. బీజేపీ తరఫున మంత్రి పదవిని ఆశించారు. కానీ చంద్రబాబు మాత్రం.. గతంలో జరిగిన పరిణామాలను గుర్తు తెచ్చుకున్నట్లున్నారు. అందుకే సుజనాకు నో చెప్పేసి.. ధర్మవరం నుంచి గెలిచిన సత్యకుమార్ యాదవ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Also Read : ఇండియన్ ఐటీ ఉద్యోగులకు అమెరికా భారీ షాక్..!
అయితే తాజాగా చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సుజనా చౌదరి ఎమ్మెల్యేగా ఉన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ, మంచి వాగ్దాటి, మాస్ లీడర్ బుద్దా వెంకన్నను విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇంఛార్జ్‌గా ఎంపిక చేశారు. ఇది ఒక విధంగా సుజనా చౌదరికి బ్రేకులు వేసినట్లే అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సుజనా చౌదరికి రాజకీయంగా, అధికారంగా, పరోక్షంగా చంద్రబాబు చెక్ పెట్టినట్లుగా ఉందన్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున కూడా బుద్దా వెంకన్నకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. వెంకన్న రాకతో తెలుగు తమ్ముళ్లు రెట్టించిన ఉత్సాహంతో గంతులెస్తున్నారు. మరి సుజనా జోరుకు బుద్దా ఎలా బ్రేకులు వేస్తారో చూడాలి.

