కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర ఏళ్లు గడిచిపోయాయి. కానీ, వైసీపీ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో నియమించిన వారు కొనసాగుతుండటం గొప్ప విశేషం. నిబంధనల ప్రకారం వీటి పదవీ కాలం మూడేళ్లు. జీవోలో “కొత్త వారిని నియమించే వరకు..” అని ఉండటంతో వైసీపీ నేతల పంట పండినట్లు అయ్యింది. ఎందుకంటే.. కూటమి అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లు దాటినా కూడా.. ఇప్పటికీ కొత్త వారిని నియమించకపోవడంతో.. వైసీపీ హయాంలో బాధ్యతలు చేపట్టిన వారే ఇప్పటికే చాలా చోట్ల పదవుల్లో కొనసాగుతున్నారు. ముఖ్యంగా జిల్లాల్లో వారిదే ఇప్పటికీ పెత్తనం చెలాయిస్తున్నారు.
Also Read : ఒరిజినల్ రెడ్లు Vs వైఎస్ ఫ్యామిలీ.. కదులుతున్న జగన్ పునాదులు
చైల్డ్, వుమెన్ వెల్ఫేర్ కమిటీ, జువైనల్ జస్టిస్ బోర్డ్‌లు ప్రతి జిల్లాకు ఉంటాయి. మహిళా అభివృద్ధి, బాలల సంక్షేమ శాఖ పరిధిలో జరిగే కార్యక్రమాలను ఈ కమిటీలు పర్యవేక్షిస్తాయి. ప్రత్యేకంగా మిషన్ వాత్సల్య పేరుతో జరుగుతున్న కార్యక్రమాల అమలు కోసమే వీటిని ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాకు ఒక చైర్ పర్సన్, నలుగురు సభ్యులు ఉంటారు. గౌరవవేతనం లేదా సిట్టింగ్ ఫీజు ఉంటుంది. ఒక్కో సిట్టింగ్‌కు రూ.2 వేలు ఇస్తారు. ఒక నెలలో 20 సిట్టింగ్‌ల వరకు ఉంటాయి. అంటే నెలకు రూ.40 వేల వరకు వస్తాయి.
ఈ కమిటీలకు రాష్ట్రస్థాయిలో నియామకాలు జరిగినా.. మెజారిటీ జిల్లాల్లో నియామకాలు జరగలేదని తెలుస్తోంది. ఈ పోస్టులకు చైల్డ్ సైకాలజీ, సైకియాట్రి, సోషియాలజీ, లా, ఎడ్యుకేషనల్, సోషల్ వర్క్‌లో డిగ్రీ లేదా పీజీ అర్హతలు. మహిళలు, పిల్లల సంరక్షణ, విద్య, హక్కుల పరిరక్షణలో పదేళ్ల అనుభవం ఉండాలి. వయోపరిమితి 35-65 సంవత్సరాలు. రాష్ట్ర జువైనల్ జస్టిస్ బోర్డుకు హైకోర్టు న్యాయమూర్తి చైర్మన్‌గా ఉంటారు. జిల్లాల్లో రిటైర్డ్ జడ్జి ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర మహిళా సంక్షేమ కమిటీని నియమించారు. నాలుగైదు జిల్లాల్లో తప్ప, మిగిలిన జిల్లాల్లో మాత్రం ఇప్పటి వరకు రెండింటి నియామకాలు జరగలేదు. దీనివల్ల, వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన వారే కొనసాగుతున్నారు.
Also Read : 25 రోజుల తర్వాత ఏపీకి పవన్.. ఇప్పటి నుంచైనా ప్లీజ్..!
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని నెలల వరకు వీటి వైపు కన్నెత్తి చూడలేదు. ఈ నియామకాల కోసం ఆశ పడుతున్న వారు చాలామంది ఉన్నారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కూటమి పార్టీల నాయకుల్లో పదవుల కేటాయింపుల వాటాలు కుదరలేదు. ఒక్కో పోస్టుకు మూడు నాలుగు సిఫార్సు లేఖలు రావడంతో ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా, మరోసారి నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర యంత్రాంగం నిర్ణయించినట్టు తెలుస్తోంది. కొత్త వారిని కూటమి ప్రభుత్వం నియమించకపోవడంతో.. వైసీపీ హయాంలో నియమించిన వారే చాలా జిల్లాల్లో కొనసాగుతున్నారు.

