మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి నేరుగా వైసీపీ చీఫ్ జగన్‌నే టార్గెట్ చేస్తున్నారు. ఒకప్పుడు జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా, కుడిభుజంగా ఉంటూ పార్టీని నడిపించిన విజయసాయి ఇప్పుడు పూర్తిగా టోన్ మార్చేశారు. రాయలసీమ ఆత్మగౌరవాన్ని, రెడ్ల పౌరుషాన్ని కాపాడతానంటూ.. ఒరిజినల్ రెడ్ల పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
Also Read : 25 రోజుల తర్వాత ఏపీకి పవన్.. ఇప్పటి నుంచైనా ప్లీజ్..!
వై.ఎస్. ఫ్యామిలీ అసలు రెడ్లే కాదంటూ ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. తాజాగా విజయసాయి రెడ్డి చేసిన ఒరిజినల్ రెడ్ల కామెంట్‌తో పరోక్షంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, ఆయన కుటుంబ క్రైస్తవ చరిత్రను టార్గెట్ చేస్తూ ఆయన ఈ కొత్త విభజన రేఖను గీస్తున్నారు. రెడ్లలో ఒరిజినల్ ఎవరు, కల్తీ ఎవరు అనే చర్చను ముందుకు తీసుకువస్తూ.. క్రైస్తవంలోకి మారిన వర్గాన్ని, సాంప్రదాయ హిందూ రెడ్లను వేరు చేసి చూపే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
రెడ్డి సామాజికవర్గ చరిత్ర, సంస్కృతిపై తాను ఏకంగా 350 పేజీల పుస్తకాన్ని రాశానని చెబుతున్న విజయసాయిరెడ్డి.. ఇటీవల హిందూ జీవన విధానం, విదేశీ మతాల ప్రభావం, రాజకీయ పదవుల కోసం జరిగిన మతమార్పిళ్లపై వరుసగా బాణాలు ఎక్కుపెడుతున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాత వీడియోను ఇటీవల బయటకు తీసిన విజయసాయి.. జగన్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ఎంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు మతం మార్చుకున్నారో నంబర్-1 సమాధానం చెప్పాలని నిలదీయడం ఈ వ్యూహంలో భాగమే.
Also Read : బాంబు పేల్చిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే.. ఇంకా వైసీపీ వాసన పోలా..!
ఇక నేరుగా జగన్ ఓటు బ్యాంకును టార్గెట్ చేశారు విజయసాయి. రెడ్డి సామాజికవర్గం, మైనారిటీ, క్రిస్టియన్ ఓటర్లు జగన్‌కు ఇన్నాళ్లూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గనుక అసలైన రెడ్లు క్రైస్తవులు కారు అనే సిద్ధాంతాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు వంటి ప్రాంతాల్లోని హిందూ రెడ్లను తనవైపు తిప్పుకోగలిగితే జగన్ రాజకీయ కోటకు పగుళ్లు ఏర్పడటం ఖాయం. రెడ్డి కమ్యూనిటీలోని సంప్రదాయవాదులు జగన్ క్రిస్టియానిటీని సమర్థిస్తున్నప్పటికీ, వారిలో చీలిక తీసుకురాగలిగితే వైసీపీ పునాదులు కదిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్‌ను రాజకీయంగా దెబ్బతీయడానికి ఆయన మత గుర్తింపును, సొంత సామాజికవర్గాన్నే ఆయుధాలుగా మార్చే ఈ డబుల్ ఎడ్జ్ వ్యూహాన్ని విజయసాయిరెడ్డి పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఒకప్పుడు వైఎస్ కుటుంబానికి నమ్మినబంటుగా, పార్టీలో జగన్ తర్వాత నెంబర్ 2గా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి నోటి నుంచే ఇలాంటి వ్యాఖ్యలు రావడం జగన్ వర్గానికి మింగుడుపడని పరిణామం. నన్ను నమ్మకద్రోహి అంటే ఇంకా చాలా నిజాలు బయటపెడతానంటూ విజయసాయి ఇటీవల వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో విజయసాయి మరింత దూకుడుగా వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పోరాటంలో విజయసాయి సక్సెస్ అయితే… ఏపీలో వైసీపీకి ఇప్పటివరకు అండగా ఉంటూ వస్తున్న రెడ్డి ఓటుబ్యాంకు నిలువునా చీలిపోవడం ఖాయం

