Saturday, September 19, 2026 07:00 PM
Saturday, September 19, 2026 07:00 PM

ఆ సీట్లు మావే.. ఇక మీ ఇష్టం..!

లోకల్ వార్ మొదలైంది. నిజానికి ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే.. ఏపీలో ఎన్నికల కోలాహలం తారాస్థాయికి చేరుకుంది. అన్ని సీట్లు పోటీ చేయాలనేది వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట. ఇదే సమయంలో కూటమి పార్టీల్లో సీట్ల పంపకం ఆసక్తికరంగా మారింది. పైకి మాత్రం డిమాండ్లు భారీగానే వినిపిస్తున్నప్పటికీ.. అసలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది చివరి నిమిషం వరకు తేలేలా లేదు. అయితే ఇదే సమయంలో తమకు తప్పకుండా కావాల్సిన సీట్ల విషయంలో జనసేన నేతలు గట్టి పట్టుతోనే ఉన్నట్లు తెలుస్తోంది. పైకి మాత్రం.. విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కాకినాడ, విశాఖ, తిరుపతి, అనంతపురం మేయర్ స్థానాలను అడుగుతున్నప్పటికీ.. విశాఖ, తిరుపతి మేయర్ సీట్లు మాత్రం తప్పకుండా ఇవ్వాలనేది జనసేన నేతల డిమాండ్.

Also Read : రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు ముచ్చెమటలు..!

రాజకీయాల్లో తొలి నుంచి ఓ విధానం అమలులో ఉంది. 10 సీట్లు అడిగితే.. కనీసం రెండు అయినా ఇస్తారనేది నేతల మాట. అందుకే కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన ఎక్కువ స్థానాల కోసం పట్టుబడుతున్నప్పటికీ.. కనీసం మూడు స్థానాల్లో అయినా దక్కించుకోవాలనేది ఆ పార్టీ నేతల మాట. వాటిల్లో ఒంగోలు, విశాఖ, తిరుపతి స్థానాల కోసం గట్టిగానే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ మూడు స్థానాల్లో కూడా విశాఖ, తిరుపతి మేయర్ స్థానాలు తమవే అంటున్నారు జనసేన పార్టీ నేతలు. ఈ రెండు సీట్ల కోసం జనసేనలో కూడా ఎక్కువ మంది ఆశావహులు పోటీ పడుతున్నారు.

జనసేన పార్టీ నేతలు గోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. కానీ ఈసారి మాత్రం తమ బలం ఉత్తరాంధ్రలో కూడా పెంచుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకే విశాఖ మేయర్ కుర్చీ కోసం గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ మేయర్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం పైన, ఆ పార్టీ నేతలపైన అటు జీవీఎంసీలో, బయట మూర్తి యాదవ్ గట్టిగానే పోరాటం చేశారు. వైసీపీ పాలకుల అవినీతిని బయటపెట్టినందుకు మూర్తి యాదవ్‌ పైన ఎన్నో కేసులు కూడా పెట్టారు. ఇటు యాదవ సామాజిక వర్గం, బీసీ నేత కావడంతో.. జనసేనకు కూడా అనుకూలంగా మారుతుందనేది ఆ పార్టీ నేతల భావన. విశాఖ మేయర్ గెలుచుకుంటే.. ఆ ప్రభావం ఉత్తరాంధ్ర పైన బలంగా ఉంటుందనేది జనసేన పార్టీ నేతల లెక్క. అందుకే విశాఖ మేయర్ కోసం గట్టిగానే పట్టుబడుతున్నారు.

మరోవైపు తిరుపతి మేయర్ కూడా తమకే ఇవ్వాలంటున్నారు జన సైనికులు. ఇందుకు ప్రధానంగా కులాల లెక్కలు తీస్తున్నారు. రాయలసీమలో బలిజ సామాజిక వర్గం ఎక్కువ. మొన్నటి ఎన్నికల్లో రాయలసీమ బలిజలు పూర్తి ఏకపక్షంగా కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపారు. కానీ అత్యధికంగా బలిజలు ఉన్న రాయలసీమ జిల్లాల్లో జనసేన పార్టీ చాలా తక్కువ స్థానాలకే పరిమితం అయ్యింది. దీంతో తిరుపతి మేయర్ సీటు బలిజలకు కేటాయించాలనేది ఆ పార్టీ నేతల డిమాండ్. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇప్పటికే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల భాస్కర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

Also Read : ఏపీలో మద్యం షాపుల లైసెన్స్‌ రెన్యూవల్‌కు కాసుల వర్షం..!

అటు ఉత్తరాంధ్రలో విశాఖ, రాయలసీమలో తిరుపతి నగరాలు.. ఆయా ప్రాంతాల్లో చాలా ప్రభావవంతమైనవి. కాబట్టి ఆ రెండు నగరాలను తమ కంట్రోల్‌లో ఉంచుకోవాలనేది జనసేన పార్టీ నేతల భావన. నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్న ఆధ్యాత్మిక నగరం తిరుపతి నగర ప్రభావం అటు రాయలసీమతో పాటు ఇటు నెల్లూరు జిల్లాలో కూడా గట్టిగానే ఉంటుందనేది జనసేన నేతల మాట. అదే సమయంలో బలిజ సామాజిక వర్గానికి కేటాయించడం వల్ల రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మరోసారి కాపు సామాజిక వర్గం ఓట్లు తమకే వస్తాయనే ప్లాన్‌లో ఉన్నారు. మరి సీట్ల కేటాయింపు ఎలా ఉంటుందో.. తెలియాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

పోల్స్