రాజధాని అమరావతి ప్రాంతంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతంలో తమకు పూర్తి వ్యతిరేకంగా ఉన్న అమరావతి ప్రాంత రైతులు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి, అమరావతిని నిర్లక్ష్యం చేశారనే ఆగ్రహం ఈ ప్రాంత రైతుల్లో తీవ్రంగా ఉండేది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అదే ప్రాంతానికి చెందిన కొంతమంది రైతులు జగన్ వద్దకు వెళ్లడం వెనుక స్పష్టమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది.
Also Read : బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి బలపడుతుందా..?
అమరావతి పరిధిలో వైఎస్ జగన్ తన రాజకీయ పునాదులను పటిష్టం చేసుకునేందుకు, అక్కడ పట్టు సాధించేందుకు చేస్తున్న వ్యూహాత్మక ప్రయత్నాల్లో భాగమే ఈ భేటీ అని విశ్లేషకులు భావిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ బలవంతపు భూసేకరణ చేయబోమని, రైతులకు అండగా ఉంటామని జగన్ భరోసా ఇవ్వడం వెనుక పెద్ద రాజకీయ ఎత్తుగడ దాగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి అమరావతి ప్రాంతంలోని రైతులందరూ హాజరుకాకపోయినప్పటికీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై అక్కడ అసంతృప్తి మొదలైందనే బలమైన సంకేతాన్ని ప్రజల్లోకి పంపడంలో జగన్ పార్టీ నేతలు విజయవంతమయ్యారని మాట బాగా వినిపిస్తోంది.
గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ పద్ధతి ద్వారా రైతులు స్వచ్ఛందంగా దాదాపు 30 వేల ఎకరాల భూమిని అప్పగించారు. తమ ప్రాంతం అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతుందనే ఆశతో అప్పట్లో వారు ఎంతో ఆనందంగా భూములు ఇచ్చారు. కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అమరావతిని పూర్తిగా పక్కనబెట్టేసింది. పరిపాలన రాజధానిని విశాఖపట్నానికి మారుస్తామని ప్రకటించడంతో అమరావతి రైతులు సుదీర్ఘ కాలం పాటు ఉద్యమాలు, ఆందోళనలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతిలో మళ్లీ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. విదేశీ, స్వదేశీ సంస్థలు కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం చేపట్టిన తదుపరి విడత భూసమీకరణే ఇప్పుడు సరికొత్త వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.
మొదటి విడత సేకరించిన భూములకు తోడు, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు, విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ వంటి భారీ ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వం మరోసారి భూసేకరణకు సిద్ధం కావడం రైతుల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. దీనికి తోడు మూడో విడత భూసేకరణ కూడా ఉంటుందనే ప్రచారం సాగుతుండటంతో, భవిష్యత్తులో తమకు అసలు భూములే మిగలవేమో అనే భయం స్థానికులను వెంటాడుతోంది. ప్రభుత్వం బలవంతంగా భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తోందని, ప్రైవేటు సంస్థలకు ఇష్టారాజ్యంగా కేటాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామసభల్లోనే రైతులు తమ వ్యతిరేకతను బహిరంగంగానే ప్రదర్శించారు. ఈ అసహనమే వారిని జగన్ వైపు అడుగులు వేసేలా చేసింది.
Also Read : శ్రీశైలం భక్తుల కష్టాలు తీరేదెప్పుడు..?
ప్రభుత్వ నిర్ణయాల వల్ల రైతుల్లో నెలకొన్న ఈ నిరాశను, అసంతృప్తిని జగన్ తనకు అనుకూలంగా మలచుకోవాలని చూస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ వ్యతిరేక గళాన్ని తన వైపు తిప్పుకోవడం ద్వారా చంద్రబాబు నాయుడు సమర్థతను, కూటమి ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీయవచ్చనేది వైసీపీ ఆలోచనగా కనిపిస్తోంది. రైతులు జగన్‌ను కలవడం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు కూడా ఈ పరిణామాలపైన అందోళన చెందుతున్నారు. అమరావతి అభివృద్ధి పనులు వేగంగా చేస్తూనే, భూసేకరణ వంటి సున్నితమైన విషయాల్లో చంద్రబాబు ప్రభుత్వం ఒకింత ఆచితూచి అడుగులు వేయాలని, లేకపోతే ఈ అసంతృప్తిని జగన్ పూర్తిగా తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రమాదం ఉందని సొంత పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారు. మొత్తానికి అమరావతి భూసేకరణ రగడ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపులు తిప్పుతోంది.

