కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ ప్రక్రియపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. లోక్‌సభ స్థానాల పునర్విభజనతో పాటు రాష్ట్రాల శాసనసభ స్థానాల సంఖ్య కూడా పెరుగుతుందా? అనే అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై విస్తృతంగా చర్చ సాగుతోంది. రాజ్యాంగం ప్రకారం లోక్‌సభ స్థానాల పునర్విభజనకు ఆర్టికల్స్ 81, 82 వర్తిస్తే, రాష్ట్ర శాసనసభ స్థానాల పునర్విభజనకు ఆర్టికల్ 170 వర్తిస్తుంది. డీలిమిటేషన్ అమలుకు అవసరమైన రాజ్యాంగ సవరణల్లో ఈ నిబంధనలకు సంబంధించిన అంశాలు కూడా ఉండే అవకాశం ఉందని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంట్ స్థానాల పునర్విభజనతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కూడా అదే ప్రక్రియలో చేపట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
Also Read : అమెరికా గ్లోబల్ వీసా బాంబ్.. ఆ తప్పు చేస్తే కుటుంబం మొత్తానికి నో-ఎంట్రీ..!
డీలిమిటేషన్ అమలులోకి వస్తే కొత్త జనాభా గణాంకాల ఆధారంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను పునర్నిర్ణయించే అవకాశం ఉంది. దీంతో కొత్త నియోజకవర్గాలు ఏర్పడటంతో పాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ స్థానాల పునర్విభజన కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే వేగంగా అభివృద్ధి చెందిన పట్టణ ప్రాంతాలు, అధిక జనాభా ఉన్న ప్రాంతాల్లో కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. హైదరాబాద్ మహానగర పరిసరాలు, అమరావతి ప్రాంతం వంటి ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read : 12 ఏళ్లలో తొలిసారి మోకరిల్లిన మోడీ..!
అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగితే రాజకీయ పార్టీల వ్యూహాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో ద్వితీయ శ్రేణి నాయకులు, యువ నాయకులు పోటీ చేసే అవకాశాలు పెరుగుతాయని ఇప్పటి నుంచే ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపిక, సామాజిక సమీకరణాలు, రిజర్వేషన్ అంశాల్లోనూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న చట్టం, రాజ్యాంగ సవరణలు, అనంతరం ఏర్పాటు కానున్న డీలిమిటేషన్ కమిషన్ సిఫార్సుల తర్వాతే స్పష్టత రానుంది. అప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై జరుగుతున్న చర్చకు రాజకీయ ప్రాధాన్యం కొనసాగనుంది.
Also Read : ‘కాక్రోచ్ జనతా పార్టీ’.. ప్యూచర్ ప్లాన్ ఏంటి..?
2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153కు పెంచే అవకాశం కల్పించారు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం అమలులో ఉన్న పరిమితుల కారణంగా ఈ నిబంధన ఇప్పటివరకు అమల్లోకి రాలేదు. రాజ్యాంగ సవరణల అనంతరం ఆ పరిమితులు తొలగితే, విభజన చట్టంలోని నిబంధనల అమలుకు మార్గం సుగమం కావచ్చని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. అయితే దీనిపై తుది స్పష్టత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే చట్టం, దాని నిబంధనలు, అనంతరం డీలిమిటేషన్ కమిషన్ తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.

