Saturday, May 9, 2026 04:00 PM
Saturday, May 9, 2026 04:00 PM

వాసు డిమాండ్ వెనుక మతలబు ఏమిటో..!

రాజకీయాల్లో పైకి రావాలంటే.. అది ఒక్కరి వల్ల మాత్రం అసాధ్యం. ఎంతో మంది సహకారం తప్పని సరిగా ఉండాల్సిందే. ఇక పదవిలోకి వచ్చిన తర్వాత.. తన స్థితికి కారణమైన వారిని గుర్తించి, గౌరవించిన వాడే నిజమైన నాయకుడు. ఇక తన ఎదుగుదలకు కారణమైన ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రూపంలో సాయం చేయడమే అసలు సిసలు నాయకత్వం. వారి కష్టానికి తగినట్లుగా ప్రభుత్వ, పార్టీ పదవులు వచ్చేలా నాయకులు కృషి చేస్తారు. కొంతమంది ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే.. కొందరు మాత్రం పార్టీ పదవులతో సంతృప్తి చెందుతారు. కానీ కొందరు నేతల తీరు మాత్రం ఇప్పుడు పెద్ద వివాదాస్పదం అవుతోంది.

Also read : సీఎం సచివాలయంలో ఉండగా.. భయపెట్టిన ప్రచారం..!

పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల కోసం నేతలు పట్టుబట్టడం సహజం. తమ గెలుపు కోసం, ఎదుగుదల కోసం ఆర్థికంగా, సామాజిక పరంగా కష్టపడిన వారికి, అండగా ఉన్న వారికి పదవులు ఇప్పించుకుంటారు. తమ వారికి పదవులు ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరతారు. వారికి పదవి వస్తే.. అది తమ వల్లే జరిగిందని గొప్పగా చెప్పుకుంటారు కూడా. అయితే తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యే తీరు మాత్రం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి తొలిసారి గెలిచిన ఆదిరెడ్డి వాసు.. తీరు ఇప్పుడు పార్టీ పెద్దలను కలవరపరుస్తోంది. నిజానికి వాసు గెలుపు తొలిసారే అయినప్పటికీ.. గత ఎన్నికల్లో కూడా ఆయన భార్య ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా ఉన్నారు.

నియోజకవర్గంలో తొలి నుంచి పూర్తి ఏకపక్షంగా వ్యవహరిస్తున్న వాసు.. పదవుల కేటాయింపు విషయంలో కూడా అదే తీరును అనుసరిస్తున్నారు. 2019-24 మధ్య కాలంలో వైసీపీ నేతలను ధీటుగా ఎదుర్కొన్న నేతలను పూర్తిగా పక్కన పెట్టిన వాసు.. పదవుల కేటాయింపు విషయంలో తనదైన వివక్ష చూపిస్తున్నారు. నియోజకవర్గంలో తనకు ఎవరూ వద్దని.. కేవలం ఒక్కరు మాత్రమే తన వెంటే ఉంటే చాలు అన్నట్లుగా వాసు వ్యవహార శైలి కనిపిస్తోంది. పదవిలోకి వచ్చిన రోజు నుంచి.. ఇసుక, మద్యం, మట్టి సహా అన్ని వ్యాపారాలు కేవలం నక్కా చిట్టిబాబుకే అప్పగించారు. మాజీ కార్పొరేటర్‌ నక్కా చిట్టిబాబును కాదని రాజమండ్రి సిటీ పరిధిలో ఏ ఒక్క పని జరగటానికి వీలు ల్లేదనే మాదిరిగా పరిస్థితి మారిపోయింది.

నిజానికి నక్కా చిట్టిబాబు గతంలో టీడీపీ కార్పొరేటర్‌గా పని చేశారు. రెండో విడత ఆయనకు కార్పొరేటర్‌గా టికెట్ ఇవ్వలేదనే అక్కసుతో రాజమండ్రి సిటీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మెలను, ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేశారు. ఇదంతా చీకట్లో జరిగిన వ్యవహారం కాదు. మీడియాకు స్వయంగా చిట్టిబాబు కుమారుడు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. మీడియా సమక్షంలోనే టీడీపీ జెండా దిమ్మెలను పగలగొట్టారు. ఆ తర్వాత తాను వైసీపీలో చేరేందుకు సిద్ధమని ప్రకటించారు. కానీ.. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ.. వైసీపీలో చేరలేదు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ వాసు వెనకే తిరగటం మొదలుపెట్టారు.

Also read : ఇద్దరు సీఎంల ముద్దుల ఐఏఎస్ అధికారి..!

చిట్‌ఫండ్ వ్యాపారం కేసులో ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులను సీఐడీ అధికారులు అరెస్టు చేసినప్పుడు చిట్టిబాబు కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వాసుకు సంబంధం ఉన్నట్లుగా స్టేట్‌మెంట్ ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. అయితే అతను మాత్రం నోరు విప్పకపోవడంతో.. నెల రోజుల పాటు వాసుతో పాటు జైలులో ఉంచారు. అందుకే చిట్టిబాబుకు పదవి ఇవ్వాలని ఆదిరెడ్డి వాసు పట్టుబడుతున్నారనా అనేది పార్టీ నేతల అభిప్రాయం. కానీ వాస్తవానికి చిట్టిబాబుకు మాత్రమే పదవి ఇవ్వాలని వాసు పదే పదే కోరటం వెనుక చాలా లోతైన కారణాలున్నాయనేది అత్యంత సన్నిహితుల మాట. వాసు బాగోతాలు, వ్యాపారాలకు సంబంధించిన రుజువులు చిట్టిబాబు దగ్గర ఉన్నాయని.. అందుకే ప్రస్తుతం ఆయన కుమారుడిని వెంటే ఉంచుకుంటున్నారని నియోజకవర్గంలో బాగా వినిపిస్తున్న మాట. వాసుకు సంబంధించిన ప్రతి వ్యవహారం చిట్టిబాబు కుమారుడు చూడాల్సిందే. చిట్టిబాబుకు పదవి కావాల్సిందే అనే వాసు పోరు పడలేక రాష్ట్ర కార్యదర్శి పదవి కేటాయించారు. అయితే అది సరిపోదని.. కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని తన బావ రామ్మోహన్ నాయుడు, చిన్న మామయ్య అచ్చెన్నాయుడు ద్వారా పార్టీ పెద్దలపై పదే పదే ఒత్తిడి చేస్తున్నారు ఆదిరెడ్డి వాసు. దీంతో స్వర్ణకారుల కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి చిట్టిబాబు పేరును పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నారు.

ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ప్రస్తుతం చిట్టిబాబు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్న చిట్టిబాబు.. పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. ఇలాంటి వ్యక్తికి అటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవితో పాటు ఓ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కూడా ఇవ్వడం ఏమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఒక వ్యక్తి కోసమే ఓ ఎమ్మెల్యే ఇంతలా ఎందుకు పట్టుబడుతున్నాడనే విషయంలో పార్టీ పెద్దలు ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. పదవి ఇవ్వకపోతే చీకటి వ్యవహారాలు బయటకు వస్తాయనే భయంతోనే చిట్టిబాబుకు పదవి ఇప్పించేందుకు వాసు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడనే మాట బాగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అసలు విజయ్ చుట్టూ...

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్...

సీఎం సచివాలయంలో ఉండగా.....

ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయం వద్ద...

ఏపీలో ఇక 24...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త వాహనాల కొనుగోలుదారులకు...

బీజేపీలోకి కొడాలి నాని.....

కొడాలి వెంకటేశ్వరరావు అంటే చాలా మందికి...

తమిళ పొలిటికల్ థ్రిల్లర్.....

తమిళనాడు రాజకీయాలు నిమిషానికో మలుపు తిరుగుతూ...

ఆపరేషన్ సుమతి.. టార్గెట్...

“ఏ రోజైతే ఒక మహిళ అర్ధరాత్రి...

పోల్స్