మా ఎమ్మెల్యే ఎక్కడున్నారో మీరైనా చెప్పండయ్యా.. అంటున్నారు. మా సార్ మీకేమైనా కనిపించారా.. అని నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నారు. ఇక కనిపించిన ప్రతి నేతను కూడా మా ఎమ్మెల్యే సార్ గురించి మీకు తెలిస్తే.. మాకు కబురు చెప్పండి.. మా కష్టాల గురించి కాస్త వివరించండి.. అని వేడుకుంటున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే.. ఏ నియోజకవర్గం.. ఏ పార్టీ.. అసలు కనిపించకుండా పోవాల్సినంత తప్పేం చేశారు.. మరి ఎమ్మెల్యే లేకపోతే.. నియోజకవర్గంలో పనులను చక్కబెడుతోంది ఎవరు..? ఇవే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకూ ఆ ఎమ్మెల్యే సార్ ఎవరో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా.. అయితే ఈ స్టోరీ చివరి వరకు చదవాల్సిందే.
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2014-2019 మధ్య కాలంలో కేంద్రంలో కూడా చక్రం తిప్పారు. కేంద్ర మంత్రి పదవి కూడా వెలగబెట్టారు. ఇంకా చెప్పాలంటే.. 2019 ఎన్నికల సమయంలో తెలుగుదేశం టికెట్ల కేటాయింపులో కీలక పాత్ర పోషించారు. అయితే.. ఆ కేటాయింపుల్లో ‘తన వారికి’ న్యాయం చేసుకున్నారనే ఆరోపణలు కూడా బాగా వినిపించాయి. దాని ఫలితమే టీడీపీ ఓడిందనేది పార్టీలో సీనియర్లు అప్పట్లోనే బాగా ఆరోపించారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే.. ఆ నేత పార్టీ ఫిరాయించాడు. సైలెంట్‌గా భారతీయ జనతా పార్టీలోకి చేరిపోయాడు.
Also Read : ఎల్‌నినో ముప్పు.. WHO హైరిస్క్ జాబితాలో భారత్
బీజేపీలో చేరడానికి మరో ముఖ్య కారణం.. అధికారం మాత్రమే కాదు.. కోర్టు కేసులు, ఆర్ధిక అవకతవకలు కూడా ఒక కారణం అన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి. దీంతో సైలెంట్‌గా పార్టీ మార్చేశారు అన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఆ తర్వాత నుంచి కేరాఫ్ అడ్రస్ కేవలం హైదరాబాద్, ఢిల్లీ. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఏపీలో పరిస్థితుల గురించి కానీ.. వైసీపీ పాలనపైన కానీ.. కనీసం నోరు ఎత్తలేదు. అమరావతి రైతులకి మాత్రం న్యాయ పరంగా సహాయ సహకారాలు అందించారు. అదే సమయంలో బీజేపీ పెద్దల సాయంతో తన జోలికి ఎవరు రాకుండా చాలా లాబీయింగ్ చేసుకున్నారు. ఇదంతా 2024 ఎన్నికలకు ముందు వ్యవహారం. నిజానికి 2024 ఎన్నికల వరకు కూడా ఆయనను ఏపీ ప్రజలంతా మర్చిపోయారు.
కానీ 2024 సమయంలో ఒక్కసారిగా తళుక్కుమని మెరిశారు. ఏపీలో చక్రం తిప్పేస్తామంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పుకున్నారు. ఒకదశలో సీఎం అభ్యర్థి అంటూ ప్రచారం కూడా చేసుకున్నారు. ఇక 2024 ఎన్నికల్లో తెలుగుదేశం – జనసేన – భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు కుదరటంతో.. మళ్లీ మాట మారింది. ఆ పొత్తుకు కారణం తానే అని.. జాతీయ స్థాయిలో లాబీయింగ్ చేశానంటూ తన వారి దగ్గర కబుర్లు చెప్పారు. సీన్ కట్ చేస్తే.. జనసేనకు దక్కాల్సిన ఎమ్మెల్యే సీటును దక్కించుకున్నారు. బీజేపీ తరఫున పోటీ చేశారు. డబ్బులు కూడా భారీగానే ఖర్చు చేశారు. ఈయన అదృష్టం ఏమిటంటే.. సిట్టింగ్ మాజీ మంత్రిని వైసీపీ అధినేత నియోజకవర్గం మార్చడమే. ఇది కూడా ఈయన గెలుపునకు పరోక్షంగా కారణమైంది.
Also Read : కూటమికి ఇబ్బందిగా మారిన నెల్లిమర్ల మేడం..!
గెలిచిన వెంటనే చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం ఆశించారు. అయితే యాదవ సామాజిక వర్గానికి చెందిన సత్యకుమార్ యాదవ్ వైపే ఢిల్లీ పెద్దలు మొగ్గుచూపడంతో.. మళ్లీ అలకపాన్పు ఎక్కారు. అసలు నా రేంజ్ ఏంటో తెలుసా.. సీఎం క్యాండిడేట్‌ను.. ఇలా ఎమ్మెల్యే స్థాయికే పరిమితం చేస్తారా.. కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వరా.. అంటూ పెద్ద వార్నింగ్ కూడా ఇచ్చారు. నా సంగతి ఏమిటో వాళ్లకు చూపిస్తా.. అంటూ తన వాళ్ల దగ్గర వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే.. గెలిచిన తర్వాత ఓ ఆరు నెలలు మాత్రం నియోజకవర్గంలో బాగా హంగామా చేశారు. ఓ పది మందిని ఆఫీసులో నియమించి.. ఫిర్యాదులు ఏమైనా వచ్చినా.. సహాయం కోసం ఎవరైనా వచ్చినా.. వెంటనే దానిపై చర్యలు తీసుకున్నారు. ఇక సోషల్ మీడియా ప్రచారం కోసం ప్రత్యేకంగా ఓ టీమ్ అపాయింట్ చేశారు. ఇక అంతే.. సార్ తుమ్మినా, దగ్గినా సరే.. అన్న నడిచొస్తే.. అన్నట్లుగా పాటలు పెట్టుకుని ఎలివేషన్ బిల్డప్ ఇచ్చారు.
అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఈ పెద్ద మనిషి.. నియోజకవర్గంలో కనిపించి నెలలు దాటిపోయింది. ఎప్పుడో ఓసారి చుట్టపు చూపుగా వస్తారు.. అది కూడా రోజంతా కాదు.. కేవలం గంటలు మాత్రమే.. ఉదయం హైదరాబాద్ నుంచి రావడం.. మళ్లీ సాయంత్రం విమానం ఎక్కి వెళ్లిపోవడం.. అంతే.. మరి నియోజకవర్గం బాధ్యతల గురించి అంటారా.. అందుకు కార్యాలయ కార్యదర్శిగా ఓ వ్యక్తిని నియమించారు. ప్రస్తుతం ఆయనే ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఇంకా చెప్పాలంటే.. ఆ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కూడా ఆయనే. ఈ కార్యాలయ కార్యదర్శి దృష్టిలో తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే వారంతా పురుగులతో సమానం. కనీసం మనుషుల మాదిరిగా కూడా వారిని చూడరు. నలుగురిని కలుపుకునిపోయే పరిస్థితి అక్కడ అస్సలే కనిపించదు. తన మాటే శాసనం అన్న విధంగా ఆయన వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపించడం గమనార్హం.
Also Read : జగన్ చెప్పినా వినను.. బొత్సా హాట్ కామెంట్స్..!
ఇక ఏపీ అంతా స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం జరుగుతుంటే.. ఆ ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో మాత్రం.. ఆ సందడే లేదు. బీజేపీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గం కాబట్టి.. పొత్తులో భాగంగా ఓ స్థానాలను ఆ పార్టీకే కేటాయించారు. 5 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తే.. నాలుగు చోట్ల ఓడిపోయారంటే.. అక్కడ ఆ ఎమ్మెల్యే గారి పని తీరుపైన ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారో అర్థం అవుతుంది. గెలిచిన ఒక్క బీజేపీ కార్పొరేటర్ కూడా జిల్లా అధ్యక్షుడు కావడం గమనార్హం. ఇక ఆయనకి కూడా వ్యతిరేకంగా పని చేశారన్న వార్తలు కూడా నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. ఆయన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కాదు కదా.. ఏకంగా రాష్ట్రపతి వచ్చినా సరే.. ఈయన మాత్రం కనిపించరు. ఇంకా చెప్పాలంటే.. ఈయనకు అంత సమయం ఉండదు కూడా.
ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరో.. ఏ నియోజకవర్గమో ఇప్పటికైనా తెలిసిందా.. ఎవరో కాదు.. ఆయనే యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి. నిజానికి సత్యనారాయణ అంటే ఎవరికీ తెలియదు. కానీ సుజనా అంటే మాత్రం.. మాకెందుకు తెలియదు అనేస్తారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తీరుపైన ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండటం అనేది ఆయనకు చాలా పెద్ద పని. ఆ సమయం వ్యాపారానికి కేటాయిస్తే.. నాలుగు డబ్బులు వస్తాయనేది ఆయన మాట.
తన నియోజకవర్గం పరిధిలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ దసరా బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతుంటే.. ఈయన మొదటి రోజు కనిపించారు. ఆ తర్వాత అమ్మవారికి ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించిన సమయంలో కూడా కనిపించలేదు. ఇక విజయవాడ మేయర్, కార్పొరేటర్ల ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కనీసం ఓటు వేశారో లేదో కూడా తెలియదు. కూటమి మేయర్ అభ్యర్థికి అనుకూలంగా, బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థులకు ఓటు వేయాలనే మాట కూడా ఎక్కడా అనలేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో 5 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తే.. ఒక చోట మాత్రమే గెలిచిదంటే.. సుజనా తీరు ఎలా ఉందో.. శ్రీధర్ పెత్తనం, ప్రవర్తన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా పార్టీ పెద్దలు దృష్టి పెట్టి పరిస్థితి చక్కబెట్టకపోతే.. పరిస్థితి మరింత దారుణంగా తయారవ్వడం ఖాయం.


