తిరుమల ఏడుకొండల వాడి దర్శనానికి వెళ్ళిన భక్తులు చాలా మంది గమనించని ఓ విషయం ఉంటుంది. అదే.. నిత్యం కోట్లాది మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నా కూడా.. ఎక్కడా తాగునీటి, వాడుక నీటి సమస్య ఉండదు. అసలు అంత పెద్ద ఎత్తున నీటి సరఫరా ఎలా సాధ్యం..? ఈ విషయంపై చాలా మందికి అవగాహన ఉండదు. కానీ.. దాని వెనుక ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. 1999వ సంవత్సరంలో తిరుమల కొండపై తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా కొండపై ఉన్న ప్రధాన జల వనరులైన గోగర్భం, పాపవినాశనం వంటి డ్యామ్‌లు పూర్తిగా అడుగంటిపోయాయి.
Also Read : గిరిబాబు చివరి కోరిక నెరవేరింది.. రావినూతలలో కన్నీటి వీడ్కోలు
ఆ సమయంలో భక్తుల అవసరాల కోసం రోజుకు సుమారు 100కు పైగా ట్యాంకర్ల ద్వారా కొండ కింద నుంచి 15 లక్షల గ్యాలన్ల నీటిని తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భక్తుల రద్దీని నియంత్రించడం కష్టమవుతుందని, తాగునీటి కొరత వల్ల ఆలయ నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ సమస్యకు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని అప్పటి, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. తిరుపతి దిగువన ఉన్న కళ్యాణి డ్యామ్ నుంచి తిరుమల కొండపైకి నేరుగా నీటిని పంపింగ్ చేసే ప్రత్యేక పైప్‌లైన్ ప్రాజెక్టుకు అప్పట్లో శ్రీకారం చుట్టారు.
1999 నవంబర్‌లో ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. దాదాపు రూ. 120 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులను ఎల్ అండ్ టి, కిర్లోస్కర్ వంటి దిగ్గజ ఇంజనీరింగ్ సంస్థలు అత్యంత వేగంగా చేపట్టాయి. సాధారణంగా పూర్తి కావడానికి ఏడాదికి పైగా పట్టే ఈ క్లిష్టమైన ప్రాజెక్టును, సుమారు 77 నుంచి 80 రోజుల రికార్డు సమయంలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. దేశంలోనే తొలిసారిగా 9 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్ ద్వారా, సముద్ర మట్టానికి సుమారు 750 మీటర్ల ఎత్తులో ఉన్న తిరుమల కొండపైకి భారీ స్థాయిలో నీటిని పంపింగ్ చేయడం అప్పట్లో ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచింది.
Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన మలుపు..!
దీని ద్వారా రోజుకు లక్షలాది గ్యాలన్ల నీరు కొండపైకి చేరడం మొదలైంది. నాడు నిర్మించిన ఈ కళ్యాణి డ్యామ్ పంపింగ్ స్కీమ్ ఇప్పటికీ తిరుమల నీటి అవసరాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం తిరుమలకు రోజుకు అవసరమయ్యే సుమారు 50 లక్షల గ్యాలన్ల నీటిలో, దాదాపు సగం నీరు ఈ కళ్యాణి డ్యామ్ నుంచే సరఫరా అవుతుండటం విశేషం.


