దశాబ్దాల పాటు తన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు గిరిబాబుకు ఆయన స్వగ్రామం రావినూతల కన్నీటి వీడ్కోలు పలికింది. ప్రకాశం జిల్లాలోని ఈ గ్రామంలో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, అభిమానుల సమక్షంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. గిరిబాబును చివరిసారి చూసేందుకు గ్రామస్థులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నివాళులర్పించారు.
Also Read : దిల్ రాజు పై పెయిడ్ ట్రోల్స్ నడిపిందెవరు?
‘నాన్నా’ అంటూ కంటతడి పెట్టిన రఘుబాబు
తండ్రి పార్థివదేహం వద్ద నటుడు రఘుబాబు ‘నాన్నా’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తండ్రికి తుది వీడ్కోలు పలుకుతూ ఆయన భావోద్వేగానికి గురైన తీరు అక్కడున్న వారిని కలచివేసింది. అంతకుముందు నటుడు మోహన్‌బాబుతో పాటు పలువురు సినీ ప్రముఖులు గిరిబాబు పార్థివదేహానికి నివాళులర్పించారు.
స్వగ్రామంలోనే చివరి కోరిక నెరవేర్చిన కుమారులు
రావినూతల అంటే తమ తండ్రికి ఎంతో ఇష్టమని ఆయన కుమారులు రఘుబాబు, రవిబాబు తెలిపారు. తన అంత్యక్రియలు స్వగ్రామంలోనే జరగాలని గిరిబాబు కోరుకున్నారని గుర్తుచేసుకున్నారు. ఆయన కోరిక మేరకు రావినూతలలోనే అంత్యక్రియలు నిర్వహించారు.
గిరిబాబు మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పోషించిన పాత్రలను, తెలుగు సినిమాకు అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో నివాళులర్పిస్తున్నారు.


